యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:56 PM
తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని లారీ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఎర్రమట్టి(మొరం) తరలిస్తున్నారు.
రోడ్డు పనులకు తరలింపు
ఫప్రభుత్వ ఆదాయానికి గండి
ఫలారీ పార్కింగ్ స్థలానికి ఎసరుపెట్టిన అక్రమార్కులు
ఫమొరం తవ్వకాలతో భారీ గుంతలు
ఫ పట్టించుకోని అధికారులు
తాండూరు రూరల్, సెప్టెంబర్ 15 : తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని లారీ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఎర్రమట్టి(మొరం) తరలిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ హిటాచీలతో యఽథేచ్చగా టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని రోడ్డు పనులకు తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. అంతారం గ్రామ శివారు సర్వేనెంబర్-58లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని లారీ పార్కింగ్ కోసం కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామి మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా రూ.12కోట్ల 26లక్షల నిధులు చేయించి, 6 అక్టోబర్ 2023లో శంకుస్థాపన చేశారు. అనంతరం జేసీబీతో లారీలను పార్కింగ్ చేసేందుకు చదును చేసి వదిలేశారు. అయితే అట్టి స్థలంలో లారీలు పార్కింగ్ చేయడం లేదు. ఇదే అదునుగా భావించిన రోడ్డు కాంట్రాక్టర్లు భారీ హిటాచీలను ఏర్పాటు చేసి వేలాది క్యూబిక్ మీటర్ల ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టారు. దీంతో లారీ పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన అంతారం గ్రామస్తులు అక్కడికి వెళ్లి పరిశీలించగా, భారీ గుంతలను పరిశీలించి తవ్వకాలను అడ్డుకున్నారు. లారీ పార్కింగ్ స్థలం నుంచి రోడ్డు పనులకు మొరం తరలించేందుకు కాంట్రాక్టర్ వద్ద రెవెన్యూ, మైనింగ్, అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ప్రతిరోజు వందల టిప్పర్లతో ఎర్రమట్టిని రోడ్డు పనులకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించి మట్టి తవ్వకాలు చేపట్టాలి. కానీ ఇప్పటి వరకు రాయల్టీ కట్టకుండానే దర్జాగా ఎర్రమట్టిని తరలించారు.
అక్రమార్కులపై భారీ ఎత్తున జరిమానా విధించాలి
అంతారం గ్రామశివారులో లారీ పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడ్డాయి. ఈ గోతుల్లో వర్షానికి నీళ్లు నిండి ప్రమాదకరంగా మారాయి. కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎర్రమట్టి తరలిస్తున్న వారిపై భారీ ఎత్తున జరిమానా విధించాలి.
వడ్డె కృష్ణ, ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్
అధికారులు చర్యలు తీసుకోవాలి
గుట్టుచప్పుడు కాకుండా ఎర్రమట్టి తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇంత పెద్దఎత్తున తవ్వకాలు జరిపినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమ తవ్వకాలను మేము అడ్డుకున్నాము. ఇంత జరుగుతున్నా కనీసం లారీ పార్కింగ్ ప్రతినిధులు సైతం ఇటు వైపు రావడం లేదు. వారికి కూడా కాంట్రాక్టర్‌తో లోపాయికారి ఒప్పందాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- నక్కల రాజు, అంతారం
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం
అంతారం శివారులోని సర్వేనెంబర్-58 లారీ పార్కింగ్‌లో మొరం తవ్వకాలు జరుపుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. తవ్వకాల కోసం ఇప్పటి వరకు మా వద్ద ఎవరూ అనుమతులు తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తాము. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే వాహనాలు సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
తారాసింగ్, తహసీల్దార్, తాండూరు.