Share News

ఓరుగల్లు రైలు.. యమ స్పీడు

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:55 PM

దక్షిణ భారతదేశ రైల్వేకు ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేజంక్షన్‌ రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు ఎదురుచూస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు రైల్వే డివిజన్‌ ఏర్పాటుపై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ పనులు వేగంగా జరుగుతుండగా, కోచ్‌ ఫ్యాక్టరీ, డివిజన్‌ హోదాతో రైల్వేమ్యాప్‌లో కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు రానుంది.

ఓరుగల్లు రైలు.. యమ స్పీడు
కాజీపేట రైల్వే స్టేషన్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రైల్వే అభివృద్ధికి వేగంగా అడుగులు

కాజీపేట రైల్వేస్టేషన్‌కు డివిజన్‌ హోదాకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

కాజీపేటలోనే కోచ్‌ ఫ్యాక్టరీకి ఏర్పాటుకు ఇప్పటికే అనుమతి

కొత్త రైల్వే మార్గాలకు నిధుల విడుదల చేసిన రైల్వేశాఖ

దక్షిణ భారతదేశ రైల్వేకు ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేజంక్షన్‌ రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లు వాసులు ఎదురుచూస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు రైల్వే డివిజన్‌ ఏర్పాటుపై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మ్యానుఫాక్చరింగ్‌ యూనిట్‌ పనులు వేగంగా జరుగుతుండగా, కోచ్‌ ఫ్యాక్టరీ, డివిజన్‌ హోదాతో రైల్వేమ్యాప్‌లో కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు రానుంది. అలాగే కాజీపేట జంక్షన్‌ నుంచి కొత్తగా రైల్వేలైన్లు, కొత్తగా ట్రయాంగిల్‌ పట్టాల ఏర్పాటుకు కసరత్తు చేస్తుండటంతో ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వీటితో పాటు కొత్త ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. దీంతో భూపాలపల్లి, మేడారం మీదుగా కొత్తగా రైల్వే లైన్‌ రానుంది. తెలంగాణలో అతిపెద్ద రెండో రైల్వే జంక్షన్‌గా ఉన్న కాజపేట నుంచి ఇక కొత్త రైళ్లు, మరిన్ని వర్క్‌షాపులు రానుండటంతో రైల్వే ఉద్యోగులు, ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అతిపెద్ద రెండో జంక్షన్‌ కాజీపేట

కాజీపేట మీదుగా సెంట్రల్‌ ఇండియా, నార్త్‌ ఇండియా ధృవాలను కలిసే రైల్వే మార్గం కాజీపేట జంక్షన్‌. కాశీ నుంచి కన్యాకుమారి, చెన్నై నుంచి కోల్‌కత్తా, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడికి వెళ్లాలనుకున్నా.. కాజీపేట రైల్వేస్టేషన్‌ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వేలో అత్యధిక అదాయం వచ్చే కాజీపేట.. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జంక్షన్‌గా ఉంది. కాజీపేట, వరంగల్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా ప్రతీరోజు సుమారు 200కు పైగా గూడ్స్‌, ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పాటు భూపాలపల్లి, రామగుండం, గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెంతో పాటు బల్లార్షా తదితర ప్రాంతాల నుంచి బొగ్గు రవాణా, సరుకుల రవాణా కాజీపేట రైల్వే స్టేషన్‌ మీదుగానే సాగుతుంటాయి. ఎక్కువ అదాయం వచ్చే జంక్షన్‌లలో కాజీపేట ప్రథమ స్థానంలో నిలుస్తోంది.

డివిజన్‌ హోదాకు రైల్వేశాఖ సై

ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే కాజీపేట జంక్షన్‌కు ఇక మహర్దశ పట్టనుంది. 30ఏళ్లకుపైగా కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఎట్టకేలకు సాకారం కాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణమధ్య రైల్వే జోన్‌ పని చేస్తోంది. ఈ జోన్‌లో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ (మహరాష్ట్ర), ఏపీలోని గుంతకల్‌, విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్‌లు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒత్తిడితో విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ జోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రైల్వేజోన్‌ కొనసాగాలంటే కనిష్టంగా మూడు డివిజన్‌లు ఉండాలి. ప్రస్తుతం సికింద్రాబాద్‌ కేంద్రంగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌లో గుంతకల్‌, గుంటూరు, విజయవాడ డివిజన్‌లతో విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక మహారాష్ట్రలోని నాందేడ్‌ డివిజన్‌ను ముంబయి కేంద్రంగా ఉన్న సెంట్రల్‌ రైల్వేజోన్‌లో కలపనున్నారు. దీంతో సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్‌లు మాత్రమే మిగులుతున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం మూడు డివిజన్‌లు లేకపోతే డివిజన్‌ హోదా రద్దవుతుంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖకు కాజీపేటను డివిజన్‌గా మార్చి సికింద్రాబాద్‌ దక్షిణమధ్య రైల్వేజోన్‌లో కలపాలని నిర్ణయించారు. దీంతో మూడు డివిజన్‌లతో సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ అధికారుల ఆదేశాలతో దక్షిణ మధ్య రైల్వేశాఖ అధికారులు రంగంలోకి దిగి కాజీపేట డివిజన్‌కు హద్దులను నిర్ణయిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌ వైపు భువనగిరి - ఆలేరు, ఢిల్లీ వైపు బల్లార్షా, వరంగల్‌ నుంచి విజయవాడ వైపు కొండపల్లి, మణుగూరు - సత్తుపల్లి సెక్షన్‌ను హద్దులుగా ఖరారు చేయనున్నారు. వచ్చే బడ్జెట్‌ నాటికి కాజీపేట పూర్తిస్థాయిలో రైల్వే డివిజన్‌గా రూపాంతరం చెందనుంది. అయితే దక్షిణ, ఉత్తర ధృవాలను కలిపే రైల్వేమార్గం అయినప్పటికీ ఇక్కడ ట్రయాంగిల్‌ ప్లాట్‌ఫారాలు లేవు. దీంతో ఢిల్లీ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లే ప్లాట్‌ఫారాలపై నిలిపే అవకాశం లేకుండాపోతోంది. డివిజన్‌ హోదాతో ట్రయాంగిల్‌ ఫ్లాట్‌ఫారాలతో పాటు ఇక్కడి నుంచే కొత్తగా రైళ్లను నడిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం 5వేల మంది వరకు రైల్వే ఉద్యోగులు ఉండగా, డివిజన్‌ ఏర్పాటుతో రెండింతలు ఉద్యోగుల సంఖ్య పెరగనుంది.

కోచ్‌ ఫ్యాక్టరీకి గ్రీన్‌సిగ్నల్‌

రైల్వేశాఖ కాజీపేట జంక్షన్‌పై వరాలు కురిపిస్తోంది. ఇప్పటికే కాజీపేటలో డీజిల్‌ లోకోషెడ్స్‌, ఎలక్ర్టిక్‌ లోకోషెడ్స్‌ ఉన్నాయి. 150కి పైగా డబ్ల్యుఎజీ-7 ఎలక్ర్టికల్‌ లోకోలను నిలుపుదల చేసే సామర్థ్యం ఉంది. వీటితో పాటు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వ్యాగన్‌ మ్యానుఫ్యాక్ష్చరింగ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. 2023 జూలై 8వ తేదీన కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా భూమి పూజ నిర్వహించారు. 2025లోగా పూర్తయ్యేలా రూ.521కోట్లతో ఈవ్యాగన్‌ పరిశ్రమను ఏర్పాటు చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. 55ఏళ్లకుగా పైగా కోచ్‌ ఫ్యాక్టరీ కోసం డిమాండ్‌ చేస్తుంటే.. వ్యాగన్‌ తయారు ఫ్యాక్టరీ ఇవ్వటంపై ఓరుగల్లు వాసులు నారాజ్‌ అయ్యారు. దీంతో ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాజీపేటలో వందేభారత్‌ రైళ్లకోచ్‌లను కాజీపేటలో తయారు చేస్తామని ప్రకటించారు. దీంతో కోచ్‌ ఫ్యాక్టరీ కూడా కాజీపేటలో ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యాగన్‌ తయారీ ఫ్యాక్టరీని అప్‌గ్రేడ్‌ చేసి కోచ్‌ ఫ్యాక్టరీగా మార్చనున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఓరుగల్లువాసులు ఎదురుచూస్తున్న కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్‌ హోదా కాజీపేటకు వస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది.

కొత్తలైన్‌లతో పెరగనున్న కనెక్టివిటీ

ఓరుగల్లులో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు రైల్వేశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భూపాలపల్లి, రామప్ప, మేడారం మీదుగా మణుగూరు వరకు సుమారు రూ.4,100కోట్ల అంచనా వ్యయంతో 207కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే మట్టి సేకరణ టెస్టింగులు పూర్తి చేసిన అధికారులు, రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. ఈలైన్‌ నిర్మాణం పూర్తైతే బొగ్గు రవాణాతో పాటు మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు రైల్‌ కనెక్టివిటీ పెరగనుంది. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన రామప్పకు సైతం వచ్చే పర్యాటకులకు రైల్‌ సౌకర్యం ఏర్పడనుంది. అలాగే మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ జంక్షన్‌ నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వరకు 105కి.మీ. రైల్వేలైన్‌. ఈ ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ రూ.2,100కోట్ల అంచనాలతో డీపీఆర్‌ తయారు చేసింది. ఈ లైన్‌తో హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, న్యూఢిల్లీకి అనుసంధానమవుతుంది. అలాగే డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు 296కిలోమీటర్ల రైల్వేలైన్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ లైన్‌కోసం రూ.5వేలకోట్లతో అంచనాలను రూపొందించింది. ఈ లైన్‌తో వరంగల్‌ మీదుగా హైదరాబాద్‌, విజయవాడ సాగే లైన్‌తో మహబూబ్‌నగర్‌ మీదుగా హైదరాబాద్‌, బెంగూళూరు లైన్‌ను అనుసంధానం చేసేందుకు డోర్నకల్‌-గద్వాల లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కీలకమైన రెండు మార్గాలను అనుసంధానంతో పాటు కొత్తగా రైల్వేలైన్‌ లేని ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. అలాగే కాజీపేట(నష్కల్‌)- కరీంనగర్‌ మధ్య రూ.464కోట్ల అంచనా వ్యయంతో 62కి.మీ. రైల్వేలైన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో హనుమకొండ - కరీంనగర్‌ మధ్య దూర భారం తగ్గటంతో పాటు గ్రానైట్‌ పరిశ్రమకు అనుకూలంగా మారనుంది. అయితే కాజీపేట - భూపాలపల్లి లైన్‌ మాత్రమే ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. మొత్తానికి కొత్త రైల్వే కనెక్టివిటీతో పాటు డివిజన్‌ హోదా, కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో కాజీపేట జంక్షన్‌ కొత్తరూపు సంతరించుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - Nov 23 , 2024 | 11:55 PM