రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు
ABN , Publish Date - Apr 29 , 2024 | 05:46 AM
దేశంలో రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
మాపై సోషల్ మీడియా గూండాల దుష్ప్రచారమది
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆరెస్సెస్ రిజర్వేషన్లకు మద్దతిస్తోంది
అర్హులకు రిజర్వేషన్లు అందాలి.. అసమానతలు తొలగేవరకూ కొనసాగాలి: భాగవత్
హైదరాబాద్ సిటీ/ సరూర్‌నగర్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): దేశంలో రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అర్హులైన వారికి రిజర్వేషన్లు అందాలని, అసమానతలు తొలగేవరకూ అవి కొనసాగాలని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆరెస్సెస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తూనే ఉందని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగించి సోషల్ మీడియా గూండాలు దుష్ప్రచారం చేసి, విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు సంఘ్ వ్యతిరేకం అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఆదివారం ఆయన నాదర్‌గుల్‌లో ‘విద్యా భారతి విజ్ఞాన కేంద్రాన్ని’ చినజీయర్‌స్వామితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగవత్ మాట్లాడుతూ.. 1952లో ఒక చిన్న గదిలో 15 మంది విద్యార్థులతో ప్రారంభమైన శ్రీ సరస్వతి శిశు మందిర్ వేలాది పాఠశాలలుగా రూపాంతరం చెందిందని చెప్పారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించి దేశభక్తి, విలువలతో కూడిన విద్యను అందిస్తోందని తెలిపారు. కడుపు నింపుకోవడానికి చదువు అవసరం లేదని, సంస్కారాన్ని నేర్పి మనిషిగా మార్చేందుకు చదువు అవసరమని అన్నారు. సంఘ్ సభ్యులు సమాజానికి ఎంతో సాయం చేసినా, కనీసం కృతజ్ఞతలు కూడా ఆశించరని చెప్పారు. మనమందరం కలిసి ఉన్నంత కాలం సుఖంగా ఉంటామన్నారు. భయం, స్వార్థంతో ఎక్కువ కాలం కలిసి ఉండలేమని తెలిపారు. మన దేశంలో వేర్వేరు ఆచారాలు, ఆహార అలవాట్లు, భాషలు, వస్త్రధారణ ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేనని చెప్పారు.
అందరిలో రాముడు ఉన్నాడని, సృష్టి మొత్తం నారాయణుడు వ్యాపించి ఉన్నాడని, అందుకే మనం అందరూ ఒకటేనని అన్నారు. విద్యతో జ్ఞానం వస్తుందని, జ్ఞానాన్ని సమాజ హితానికి వాడాలని సూచించారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ సులభంగా జరుగుతుందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను మనమే కాపాడుకోవాలని తెలిపారు. ప్రపంచ పర్యటనకు వెళ్లడం మంచిదేనని, దాని కంటే ముందు అయోధ్య ఆలయాన్ని దర్శించకోవాలని సూచించారు. చదువు, సంస్కారం, విద్యావంతుడైన నాయకుడు ఉంటే దేశం పురోగతి సాధిస్తుదని, 75 ఏళ్ల తర్వాత అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో భారత్ ముందుకు వెళుతోందని త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. భారత్‌ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మోదీ ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో దేశం గర్వపడే రోజులు వచ్చాయన్నారు. విలువలతో కూడిన విద్యను సరస్వతి శిశుమందిర్‌లో అందిస్తున్నారని కొనియాడారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత రాముడు వచ్చాడని, త్వరలోనే రామ రాజ్యం కూడా వస్తుందని చెప్పారు. చదువు సంపాదన కోసమే అనే భావన నేటి విద్యార్థుల్లో ఉన్నదని, సమాజ హితం కోసం కూడా అని వారు తెలుసుకోవాలని పేర్కొన్నారు. విద్యాభారతి వంటి పాఠశాలలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఆరెస్సెస్ నేతలు సునీల్ అంబేకర్, సుధీర్, భరత్, విద్యా భారతి విజ్ఞాన కేంద్రం అధ్యక్షుడు రమేశ్‌గుప్తా, 14 ఎకరాల స్థలదాత భీమిడి పెద్దనర్సింహారెడ్డి పాల్గొన్నారు.