వ్యతిరేకతను అంచనా వేయలేకపోయాం
ABN , Publish Date - Jan 13 , 2024 | 03:49 AM
ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల నెలకొన్న వ్యతిరేకతను ఎన్నికల సమయంలో తాము సరిగా అంచనా వేయలేకపోయామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
‘దళితబంధు’తో కొందరిలో అసంతృప్తి
భూస్వాములకు ‘రైతుబంధు’తోనూ..
ఎమ్మెల్యేలకు అతిప్రాధాన్యమూ కారణమే
పార్టీ ఓటమికి ప్రజలను నిందించొద్దు
పాలనలో ఉండి.. పార్టీని పట్టించుకోలే
వీటన్నింటికీ పూర్తి బాధ్యత నాదే
కారు సర్వీసింగ్‌కు వెళ్లింది.. షెడ్డుకు కాదు
బీఆర్‌ఎస్ ఎప్పటికీ బీజేపీకి బీటీం కాదు
సుప్రీం జోక్యంవల్లే కవిత అరెస్టు కాలేదు
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ
బీఆర్‌ఎస్ సమీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో బీఆర్‌ఎస్ పట్ల నెలకొన్న వ్యతిరేకతను ఎన్నికల సమయంలో తాము సరిగా అంచనా వేయలేకపోయామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఓటమికి ప్రధానంగా.. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో జరిగిన పొరపాట్లే కారణమని చెప్పారు. దళిత బంధు పథకం కింద కొందరికే లబ్ధి చేకూరడంతో.. ఇతరులు అసహనం ప్రదర్శించి వ్యతిరేకమయ్యారని, ఈ పథకం ఇతర కులాల్లో కూడా తమపై వ్యతిరేకత పెంచిందని తెలిపారు. దీంతోపాటు రైతుబంధు పథకం కింద వందల ఎకరాలున్న భూస్వాములకు డబ్బులు ఇవ్వడాన్ని సామాన్య రైతులు అంగీకరించలేదన్నారు. పైగా నియోజవర్గ స్థాయిలో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం కూడా దెబ్బతీసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, పథకాలకు మధ్య కార్యకర్త లేకుండా నేరుగా లబ్ధిదారునికే ప్రయోజనం చేరడం వల్ల.. ఓటరుకు, కార్యకర్తకు లింకు తెగిందని, అందువల్లే పార్టీ కార్యకర్తలు ప్రజలకు దూరమయ్యారని విశ్లేషించారు. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని, పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి ఉంటుందని ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఇప్పటి నుంచి సహించబోమన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ‘‘ ప్రజలు మనల్ని ఓడించి తప్పు చేశారంటూ బీఆర్‌ఎస్ నేతలు కొందరు అక్కడక్కడా విమర్శలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కానీ, ఓటమికి ప్రజలను నిందించడం సరికాదు. ఉద్యమ సమయం నుంచి ప్రజలు మనకు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రం ఏర్పడ్డాక వారి ఆశీర్వాదం వల్లే పదేళ్లు అధికారంలో కొనసాగిన విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని పార్టీ నేతలకు సూచించారు.
క్యాడర్‌ను పట్టించుకోలేదు..
క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను అధిష్ఠానం పట్టించుకోలేదన్న విషయాన్ని కేటీఆర్ అంగీకరించారు. పరిపాలనపై దృష్టి పెట్టడం వల్ల పార్టీని సరిగా పట్టించుకోలేదని, ఇందుకు తనదే బాధ్యత అని అన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగా జరగలేదని, దీనికి కూడా పూర్తి బాధ్యత తనదేనని చెప్పారు. పదేళ్లపాటు విరామం లేకుండా పనిచేసిన కారు.. మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్‌కు పోయిందే తప్ప.. షెడ్డులోకి పోలేదని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీం అంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. ఆ పార్టీతో తమకు పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని స్పష్టం చేశారు.
కేసీఆర్ రంగంలోకి దిగితే..
పాలనకు సమయం ఇవ్వాలన్న కేసీఆర్ సూచనతో.. కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలనే సదుద్దేశంతో ఉన్న తమను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తయారు చేసిన జగదీశ్‌రెడ్డి వంటి కార్యకర్తలే అసెంబ్లీలో కాంగ్రె్‌సను దీటుగా తిప్పికొడుతున్నప్పుడు.. స్వయంగా కేసీఆరే అంసెంబ్లీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని అన్నారు. కాంగ్రెస్ హామీలు కేవలం ఆరు గ్యారెంటీలు కాదని, ఎస్సీ బీసీ, మహిళ తదితర డిక్లరేషన్లతో కలిపి అవి సరిగ్గా 420 ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ భృతి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నాలుక మడతేసిందని ధ్వజమెత్తారు. ఇతర వర్గాలకు ప్రాధాన్యమిచ్చి రైతుబంధును ఆపడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రొటోకాల్ ఉల్లంఘనల్ని సీరియ్‌సగా తీసుకుంటామని చెప్పారు. ఒక్క బీఆర్‌ఎస్ కార్యకర్తకు ఆపద వస్తే మిగతా కార్యకర్తలంతా చేరి అండగా నిలవాలన్నారు.
సుప్రీంకోర్టు జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదు..
గత పార్లమెంటు ఎన్నికలు, పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమక్కై బీఆర్‌ఎ్‌సను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేవారా? అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి బీజేపీతో సంబంధాలు కారణం కాదని, సుప్రీంకోర్టు జోక్యమే కారణమని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పద్ధతి మారిందని విమర్శించారు. బీజేపీ మతాన్ని రాజకేయం కోసం వాడుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. తాము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిలో పంచితే గెలిచేవాళ్లమేమోనని వ్యాఖ్యానించారు. బీజేపీ వాళ్లు పొలిటికల్ హిందువులని, .కేసీఆర్ మతాన్ని మతంగా చూేస హిందువని చెప్పారు. తమది నిజమైన సెక్యులర్ పార్టీ అని స్పష్టం చేశారు.