సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:46 AM
సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
కోదాడ రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ బోర్డు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో సోమవారం జరిగిన మండల మార్బుల్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాయడమే కాకుండా పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడితప్పిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ లతీఫ్, యూనియన్ నాయకులు అచ్చయ్య, అజీజ్ పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సందానం రామారావు, ఉపాధ్యక్షులుగా షేక్ మీరా, ప్రధాన కార్యదర్శిగా షేక్ పాషా, సహాయ కార్యదర్శిగా శీలం సైదులు, కోశాధికారిగా అత్తిలి వీరబాబు, గౌరవ అధ్యక్షులుగా అచ్చయ్య, ఎండీ. అజీజ్ ఎన్నికయ్యారు.
వ్యవసాయ కార్మికులకు పింఛన్ అమలు చేయాలి
సూర్యాపేట(కలెక్టరేట్), (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12వేల చొప్పున పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పేర్ల నాగయ్య డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నేటికీ అమలు చేయడం లేదన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ రాంబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కారింగుల వెంకన్న, హుస్సేన్, లింగయ్య, రమేష్, ప్రసాద్, శంకర్, రాజ్‌కుమార్, మోహన్, జాన్‌సుందర్, ఉపేందర్ , విజయ్, శ్రీను, సైదులు, రజాక్ తదితరులు ఉన్నారు.