తరలింపు హామీ ఏమైంది?
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:11 AM
నల్లగొండ పట్టణంలో ఇంటింటికీ చెత్త సేకరిస్తున్న మునిసిపాలిటీ ఆ చెత్తను నల్లగొండ మండల సమీపంలోని చందనపల్లి గ్రామంలో ఉన్న డం పింగ్ యార్డుకు తరలిస్తుంది.
తరలింపు హామీ ఏమైంది?
చెత్త నుంచి వెలువడుతున్న పొగ, దుర్వాసనతో ఇబ్బందులు
అనారోగ్యానికి గురవుతున్న పరిసరాల ప్రజలు
తడి చెత్తతో వర్మి కంపోస్టు తయారీతో ప్రయోజనం
నల్లగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలో ఇంటింటికీ చెత్త సేకరిస్తున్న మునిసిపాలిటీ ఆ చెత్తను నల్లగొండ మండల సమీపంలోని చందనపల్లి గ్రామంలో ఉన్న డం పింగ్ యార్డుకు తరలిస్తుంది. ఇంటింటికీ చెత్తను సేకరించడం వల్ల పట్టణంలో వార్డులో పరిసరా లు పరిశుభ్రంగా ఉంచేందుకు వీలుంటుంది. అయితే ప్రధాన సమస్య నల్లగొండ సమీపంలో డంపింగ్‌యార్డులో చెత్త వేయడం వల్ల ఆ పరిస ర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీసారి ఎన్నికల సమయంలో ఆ డంపింగ్ యార్డును దూర ప్రాంతాలకు తరలిస్తామని నాయకులు హామీ ఇస్తున్నా అందుకు సం బంధించి భూమిని సేకరించడంలో ఆలస్యం జరుగుతోంది. దీంతో చందనపల్లి గ్రామంలో ఉన్న యార్డులో నిత్యం చెత్త నుంచి విడుదలవుతున్న పొగతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. చెత్తనుండి వెలువడుతున్న పొగ వల్ల ప్రధానం గా శ్వాసకోశ వ్యాధులకు గురువుతున్నారు. అదేవిధంగా ఆస్తమా ఉన్న ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు, వృద్ధులకు ఈ పొగ వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నా రు. నల్లగొండ నుంచి ఉదయసముద్రం నుంచి నకిరేకల్ వెళ్లే రహదారిపై చెత్త డంపింగ్ యార్డు పరిసరాల్లో వెలువడుతున్న పొగ, మంచు పొ గను తలపిస్తుంది. ఒక్కోసారి ఆ పొగతో రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతీరోజూ 96 టన్నుల చెత్త
నల్లగొండ పట్టణంలోని 48 వార్డుల నుంచి మునిసిపాలిటీ సిబ్బంది నిరంతరం ట్రాక్టర్లు, ఆటో ట్రాలీ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తా రు. ప్రజల్లో కూడా చైతన్యంరావడంతో తడి, పొడి చెత్తను వేర్వేరు బుట్టల్లో వేసి ఇస్తున్నారు. అయి తే ఇంకా కొన్నిచోట్ల ప్రజలు బుట్టల్లో వేయకుండా పక్క ప్లాట్లల్లో, తమ సమీప ప్రాంతాల్లో వేయడం వల్ల కూడా చెత్త పేరుకుపోతుంది. కొన్నిసార్లు మునిసిపల్ సిబ్బంది ఆలస్యమైతే ఆ చెత్త నుంచి దుర్గంధం వెదజల్లుతుంది. ఇక 48 వార్డుల నుంచి ప్రతీరోజు సేకరిస్తున్న 96 టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇందులో 3 టన్నులు తడి చెత్త ఉంటుం ది. ఈ తడి చెత్తను 30 నుంచి 40 రోజుల పాటు డీ కంపోస్టు చేస్తారు. ఈ డీకంపోస్టులో వానపాములను వేయడం వల్ల వర్మి కంపోస్టు తయారవుతుంది. ఇక పొడి చెత్తలో ఉండే అట్టలు, ప్లాస్టిక్ బాటిళ్లు, సీసాలు, ఇంకా ఇతర వస్తువులను వేరుచేసి విక్రయించడానికి మునిపిపాలిటీ ఒక ఏజెన్సీకి అప్పగించింది. ఆ ఏజెన్సీ మునిసిపాలిటీకి నెలకు రూ.25వేల చొప్పున చెల్లిస్తారు. ఇంకా వర్మి కంపోస్టును కిలోకు రూ.10 చొప్పున వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తారు. 2014 సంవత్సరంలో ఈ వర్మి కంపోస్టు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెత్త డంపింగ్ యార్డు సుదూర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత ప్రజలు రోగాల బారినుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి.