Share News

‘చిన్న కాళేశ్వరం’ వేగం పుంజుకునేనా?

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:29 AM

ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు గా సాగుతున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇకనైనా వేగం పుంజుకుంటుందా? లేదా? అన్న సంశయం రైతుల్లో కనిపిస్తోంది. సరిగ్గా పదహారేళ్ల క్రితం 2008 సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా పునాది పడిన ఈ ఎత్తిపోతల పథకానికి 16 ఏళ్లుగా నిధుల గ్రహణం పట్టింది. ప్రాజెక్టు ప్రారంభం మొదలుకొని భూసేకరణ దాకా అన్నీ చిక్కుముడులే ఎదురయ్యాయి.

‘చిన్న కాళేశ్వరం’ వేగం పుంజుకునేనా?
బీరాపూర్‌ వద్ద నిర్మించిన ఎత్తిపోతల పంప్‌హౌస్‌

దశాబ్దన్నర గడిచినా పూర్తికాని ప్రాజెక్టు

రూ.523కోట్ల అంచనా వ్యయంతో 2008లో పనులు ప్రారంభం

బీఆర్‌ఎస్‌ హయాంలో నిలిచిన పనులు

ఆర్థిక సాయానికి ఇటీవలే కేంద్రం సుముఖత

పనులు పూర్తయితే 45వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి

యంత్రాంగం నిర్లక్ష్యంతో భూసేకరణ చిక్కులు

అధికారులపై మంత్రి శ్రీధర్‌ బాబు సీరియస్‌

భూపాలపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు గా సాగుతున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో ఇకనైనా వేగం పుంజుకుంటుందా? లేదా? అన్న సంశయం రైతుల్లో కనిపిస్తోంది. సరిగ్గా పదహారేళ్ల క్రితం 2008 సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా పునాది పడిన ఈ ఎత్తిపోతల పథకానికి 16 ఏళ్లుగా నిధుల గ్రహణం పట్టింది. ప్రాజెక్టు ప్రారంభం మొదలుకొని భూసేకరణ దాకా అన్నీ చిక్కుముడులే ఎదురయ్యాయి. మరీ ముఖ్యంగా పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో 2014లో రాష్ట్ర విభజన జరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారడం ఈ ప్రాజెక్టు పాలిట శాపంగా పరిణమిం చిందనే చెప్పాలి. దాంతో తొమ్మిదన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును గాలికొదిలేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఈ క్రమంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట మేడిగడ్డ ప్రాజెక్టును ప్రారంభించ డంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం చిక్కుల్లో పడింది. అయితే రైతుల ఒత్తిళ్లు, వివిధ రాజకీయ పక్షాల విమర్శల నేపథ్యంలో కేఎల్‌ఐఎస్‌ ప్రాజెక్టును కాస్త ముక్తేశ్వర ఎత్తిపోతల పథకంగా (చిన్న కాళేశ్వరంగా) మార్చి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రాజెక్టు పేరునైతే మార్చారు గానీ నిధులు సమకూర్చకపో వడంతో ఏక్క అడుగూ ముందుకు పడలేదు. అప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను మెగా ఇంజనీరింగ్‌తో పాటు కిర్లోస్కర్‌, మరో సంస్థ కలిసి జాయింట్‌ వెంచర్‌గా దక్కించుకున్నాయి. అయితే నిధుల విడుదలలో జాప్యం, భూ సేకరణ చిక్కులు లాంటి పరిణామాలతో నిర్మాణ వ్యయం పెరుగుతోందనే సాకుతో ఈ సంస్థలు ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పుకునే ప్రయత్నం చేశాయి. అప్పటి ప్రభుత్వం కూడా మేడిగడ్డపై చూపిన శ్రద్ధ ఈ ప్రాజెక్టుపై చూపకపోవడంతో ఇదే అదనుగా యంత్ర సామగ్రిని సరఫరా చేయాల్సిన కిర్లోస్కర్‌ సంస్థ పనుల నుంచి తప్పుకోగా ప్రస్తుత ప్రభుత్వం నచ్చజెప్పడంతో కేవలం మెగా ఇంజనీరింగ్‌ సంస్థ మాత్రమే ప్రస్తుతం అడపాదడపా పనులు నిర్వహిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.48కోట్ల నిధులను విడుదల చేయడం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(గతంలో ఏఐబీపీ) పథకం కింద రూ.228కో ట్లు తనవంతు ఆర్థిక సాయం అందించేందుకు సుముఖత తెలపడంతో ప్రాజెక్టు పూర్తిపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలకమైన చిక్కుముడు లు తొలగించాల్సి ఉంది. ముఖ్యంగా భూసేకరణ అంశంలో అధికారుల పనితీరు కారణంగా సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని చెబుతున్నారు. గతంలో జరిగిన భూసేకరణలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రధానం గా పట్టేదారులు, అనుభవదారుల్లో ఎవరికీ పరిహారం చెల్లించారన్న దానిపై రికార్డులు దొరకని పరిస్థితి నెలకొందని అంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు నకిలీ రికార్డులను సృష్టించి పరిహారం పొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమనడంతో ఈ వ్యవహారంపై మంథని శాసనసభ్యుడు, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అధికారులపై కన్నెర్ర చేశారు. పూర్తిస్థా యిలో విచారించి దోషులను గుర్తించి క్రిమినల్‌ కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు ప్రయత్నిస్తున్నా రికార్డులు సరిగ్గా లేకపోవటం తో గతంలో సేకరించిన సర్వే నెంబర్లు ఏవనే విషయాన్ని తేల్చేందుకు నానా తంటాలు పడుతున్నారని రెవెన్యూకు చెందిన విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

నాలుగు మండలాలు... 45వేల ఎకరాల ఆయకట్టు..

గోదావరిపై ప్రతిపాదించిన ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కాటారం, మహదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లోని 45,232 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనిప్రతిపాదించారు. ఇందుకు గాను 14 చెరువులను పునరుద్ధరించి రిజర్వాయర్లుగా మార్చాలని సంకల్పించారు. అయితే వీటికి అదనంగా మరో మూడు చెరువులను కూడా కలపాలని మంత్రి అధికారులకు సూచించడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు రివైజ్‌ చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్టు తెలిసింది. కాగా, ఇప్పటికే గారెపల్లి సమీపంలో నూతన రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మహదేవపూర్‌ మండలంలోని ఎర్రచెరువు, మందిరం చెరువు, కాటారం మండలంలోని కొత్తపల్లి, కొత్తపల్లి తండా, గారెపల్లి చింతల చెరువు, ఆదివారంపేట, ధన్వాడ, గుమ్మళ్లపల్లి, గూడూర్‌ ఊర చెరువులు, వీరాపూర్‌ శివశంకర్‌ ప్రాజెక్టు, మల్హర్‌ మండలంలోని రుద్రారం, మహాముత్తారం మండలంలోని పోలారం, ఎల్లాపూర్‌ చెరువులను రిజర్వాయర్‌లుగా మార్చడానికి ప్రతిపాదించి పనులను చేపట్టారు. అయితే ప్రభుత్వం నిధులు ఇవ్వక చెరువుల పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా రెండు దశల్లో సరఫరా చేయడానికి పథకం రూపకల్పన చేయగా, మొత్తం 4.5 టీఎంసీల నీటిని పంప్‌హౌస్‌ల ద్వారా చెరువుల్లోకి మళ్లించి ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు గాను కాళేశ్వరం సమీపంలోని బీరసాగర్‌ వద్ద స్టేజ్‌-1 పంప్‌హౌస్‌, కాటారం సమీపంలో స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ నిర్మాణాలు జరిగాయి. ఇందులో మొత్తం 27 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను కూడా బిగించారు.

ముందుకు కదలని భూసేకరణ

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం సుమారు 3,500 ఎకరాలకు పైగా భూసేకరణ చేపట్టాలని ప్రతిపాదించారు. చెరువులను రిజర్వాయర్‌గా మార్చేందుకు, పైప్‌లైన్లు, కెనాల్స్‌ నిర్మాణం కోసం భూమిని సేకరిస్తున్నారు. ఇందులో 640 ఎకరాలు అటవీ భూమి కాగా, మిగతా 2900 ఎకరాల్లో పట్టా భూములు, అసైన్డ్‌ భూములు ఉన్నాయి. అయితే అటవీశాఖ అనుమతులు ఆలస్యంగా వచ్చాయి. కాగా, 640 ఎకరాల అటవీ భూమిని సేకరించి పైప్‌లైన్లు వేసే కార్యక్రమం చేపట్టగా కొంత మేర మిగిలిపోయింది. మిగతా 2,900 ఎకరాల్లో సుమారు 890 ఎకరాలను ఇప్పటి వరకు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మిగతా 2వేల ఎకరాలకు గాను త్వరలో మరో 340 ఎకరాల భూ సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన పైప్‌లైన్ల నిర్మాణం జరిగినా ఇంకా పలుచోట్ల పైప్‌లైన్లు వేయలేదు. దీంతో పైప్‌లైన్ల కోసం వేయాల్సిన ఎంఎస్‌, జీఆర్పీ(గ్లాస్‌ రీ ఇన్‌ఫోర్స్‌డ్‌) పైపులు పలు చోట్ల వృథాగా పడి ఉన్నాయి. కాగా, భూసేకరణ జరిగిన భూముల రైతులకు కొందరికి ఇంకా పరిహారం అందలేదు. గారెపల్లి నూతన రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు సుమారు రూ.5కోట్లకు పైగా పరిహారం రావాల్సి ఉందని అంటున్నారు.

ప్రాజెక్టుతో 63 గ్రామాల రైతులకు ప్రయోజనం

చిన్న కాళేశ్వరం పనులను త్వరగా పూర్తి చేయాలని నాలుగు మండలాల రైతులు కోరుతున్నారు. 4.5 టీఎంసీల నీటితో నాలుగు మండలాల్లోని 63 గ్రామాల పరిధిలోని సుమారు 45,230 ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందనుంది. 0.3 టీఎంసీల నీటితో తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రతిపాదించారు. నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేశారని, చిన్న కాళేశ్వరాన్ని మాత్రం పుష్కర కాలం గడిచినా పూర్తిచేయడం లేదని పలువురు రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మంథని నియోజకవర్గంలోని (భూపాలపల్లి జిల్లా పరిధిలోని) నాలుగు మండలాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికైనా అధికారులు చిన్న కాళేశ్వరం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని వేలాది మంది రైతులు కోరుతున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:29 AM