ఫామ్ హౌస్‌లోనే పడుకో కేసీఆర్.. వైన్ షాప్ పెట్టిస్తా..

ABN, Publish Date - Nov 19 , 2024 | 07:26 PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మళ్లీ మెులకెత్తనివ్వనని రేవంత్ అన్నారు.

వరంగల్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మళ్లీ మెులకెత్తనివ్వనని రేవంత్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే బీఆర్ఎస్ నేతలను జైల్లో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రాకుండా కేటీఆర్, హరీశ్ రావులను పంపుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని సవాల్ చేశారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.."ఆనాడు ఓడిస్తా అని చెప్పా.. ఓడించా. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండు సున్నా తెపిస్తా అని సవాల్ చేశా.. తెప్పించా. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మెులకెత్తనివ్వనని వరంగల్ గడ్డపై నుంచి చెప్తున్నా.. కాసుకో కేసీఆర్. హాయిగా నువ్వు ఫామ్ హౌస్‌లో పడుకో. అవసరమైతే అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయిస్తా. తెలంగాణలో కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారు. ఫుల్, ఆఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ప్రజలను మత్తుకు బానిసలుగా చేసి అధికారం చెలాయించారు. బీఆర్ఎస్ అధికారం దిగిపోతే కేసీఆర్, కుటుంబ సభ్యుల ఉద్యోగాల ఊడాయి తప్ప.. తెలంగాణకు ఏం కాలేదు. మీ ఉద్యోగాలు పోయాయి కాబట్టి రైతులకు రుణమాఫీ జరుగుతోంది. అభివృద్ధిపై చర్చకు బిర్లా-రంగాలు సిద్ధమా..?. రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారు. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసం పనిచేస్తా" అని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు కాస్త తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Updated at - Nov 19 , 2024 | 07:26 PM