మా భారతి అక్క..హోంమంత్రి అనిత సెటైర్లు

ABN, Publish Date - Sep 28 , 2024 | 03:14 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యంగ్య బాణాలు సంధించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న వైఎస్ జగన్ చెబుతున్నవన్నీ కుంటి సాకులేనని తెలిపారు.

అమరావతి, సెప్టెంబర్ 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యంగ్య బాణాలు సంధించారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ.. తిరుపతి పర్యటన రద్దు చేసుకున్న వైఎస్ జగన్ చెబుతున్నవన్నీ కుంటి సాకులేనని తెలిపారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లి వైఎస్ విజయమ్మకు, చెల్లి వైఎస్ షర్మిలకు పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి వైఎస్ జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నాడని ఆరోపించారు.


డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక వైఎస్ జగన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ టేస్ట్ గురించి వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని.. ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలలో జగన్‌కు స్వామి వారి ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్‌లో చుట్టి పక్కన పెట్టేయటం, అలాగే శ్రీవారి ఆలయంలో వేద పండితులు ఆశీర్వదిస్తూ.. అక్షింతలు వేస్తే తల దులుపేసుకున్న సందర్భాలు ఎన్నో చూడలేదా? అని ఈ సందర్భంగా మంత్రి అనిత పేర్కొన్నారు.


జగన్ ప్రభుత్వ హయాంలో తితిదే బోర్డు మెంబర్‌గా దళితులకు ఎవరికైనా అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నించారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారని గుర్తు చేశారు. అలాగే హిందూ దళితురాలైన తనకు సైతం టీటీడీ బోర్డు అవకాశం వస్తే బ్లూ మీడియాలో రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది వైఎస్ జగనేనని ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.


అయినా తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయానికి పులకేశికి ఏ నెంబర్ ఇవ్వాలో కూడా అర్ధం కావడం లేదని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ఇక వైఎస్ జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందన్నారు. దేశాన్ని కించపరుస్తున్న జగన్‌ను దేశ బాహీష్కరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.


సెల్ఫ్ గోల్స్‌‌తో తనని దేశ బాహీష్కరణ చేయాలని పరిస్థితి జగనే తెచ్చుకున్నాడన్నారు. శుక్రవారం జగన్ పర్యటన చేస్తారని ప్రకటించిన అనంతరం ఒక్కరినైనా బైండోవర్ చేశామా? లేక గృహ నిర్బంధం చేశామా? అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సాధారణ సెక్షన్ 30ని అమల్లోకి తీసుకు వస్తే.. అది తన కోసమే జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడన్నారు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావలనుకునే తత్వం జగన్‌దని ఆమె స్పష్టం చేశారు. అందుకే తాడేపల్లిలోని తన నివాసం వద్దే వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి గుడి సెట్టింగ్ వేసుకున్నాడని హోం మంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు.

Updated at - Sep 28 , 2024 | 03:14 PM