సీఎం రేవంత్ రెడ్డిపై మందకృష్ణ మాదిగ ఆగ్రహం..
ABN, Publish Date - Oct 08 , 2024 | 09:26 PM
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వేగవంతం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాల భర్తీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వేగవంతం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బుధవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని కార్యకర్తలు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకూ ర్యాలీ నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు మందకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి బషీర్ బాగ్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని, మాదిగలను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లు సీఎం మాట్లాడుతున్నారు తప్ప ఆచరించడం లేదని ధ్వజమెత్తారు. మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పీసీసీ చీఫ్‌గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారంటూ మందకృష్ణ మండిపడ్డారు.
Updated at - Oct 08 , 2024 | 09:26 PM