అర్ధరాత్రి నడిరోడ్డుపై అమ్మ..
ABN, Publish Date - Nov 04 , 2024 | 12:39 PM
పత్తికొండ పట్టణం ట్రాన్స్‌కో కార్యాలయం సమీపంలోని ఓ కాలనీలో నడవలేని స్థితిలో ఉన్న 75 ఏళ్ల వృద్ధురాలు ప్లాస్టిక్ కుర్చీపై చలికి వణికిపోతూ బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది. కనీసం లేచి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి ఆమెది. వీధిలో వాళ్లు ‘ఏం అవ్వా.. ఎవరు నువ్వు? ఇక్కడ కూర్చున్నావు..’ అంటూ అడిగే సరికి కళ్లలో నీళ్లు తిరిగే సమాధానమిచ్చింది...
పత్తికొండ: మానవ సంబంధాలు బలహీన పడుతున్నాయి. కన్న తల్లిదండ్రులు పిల్లలకు భారమైపోతున్నారు. జీవితాంతం పిల్లల కోసం కష్టపడి పనిచేసి, చదివించి, ప్రయోజకులను చేస్తే కన్న పేగును పట్టించుకోవడం లేదు. పెళ్లి చేసుకుని కుమార్తెలు వెళ్లిపోతే.. తన కుటుంబ పోషణే సరిపోతుందంటూ కుమారులు చెబుతున్న మాట. ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నో చూశాం. తాజాగా పత్తికొండ పట్టణంలో ఓ తల్లికి ఎక్కడా లేని బాధ వచ్చింది. తల్లి భారమైందని అర్ధరాత్రి నడిరోడ్డుపై కుమారుడు వదిలేసి వెళ్లిపోయాడు. ఆ పెద్దావిడ మాటలు విన్న ప్రతి ఒక్కరూ చెమ్మగిల్లిపోయి కన్నీరు పెట్టుకుంటున్నారు.
పత్తికొండ పట్టణం ట్రాన్స్‌కో కార్యాలయం సమీపంలోని ఓ కాలనీలో నడవలేని స్థితిలో ఉన్న 75 ఏళ్ల వృద్ధురాలు ప్లాస్టిక్ కుర్చీపై చలికి వణికిపోతూ బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది. కనీసం లేచి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి ఆమెది. వీధిలో వాళ్లు ‘ఏం అవ్వా.. ఎవరు నువ్వు.. ఇక్కడ కూర్చున్నావు..’ అంటూ అడిగే సరికి కళ్లలో నీళ్లు తిరిగే సమాధానమిచ్చింది. ‘అర్ధరాత్రి నా కొడుకు ఆటోలో తీసుకొచ్చి ఈడ వదిలేసి పోయినాడమ్మా. అరవలేను. పిలవలేను. నడవలేను తల్లీ.. కాసిన్ని నీళ్లు ఇవ్వండమ్మా..’ అంటూ కన్నీటి సుడులతో ఆ వృద్ధురాలి నుంచి పొడిపొడిగా వచ్చిన మాటలివి. ఆమె పరిస్థితి తెలిసి స్థానికుల గుండె తరుక్కుపోయింది. వివరాలివీ.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన తిరుపతమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు శ్రీనివాసులు గుంతకల్లులో ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. పెద్దకుమార్తె పత్తికొండలో, చిన్న కుమార్తె బళ్లారిలో కుటుంబాలతో ఉంటున్నారు. ఎవరికీ భారం కాకూడదని భావించిన తిరుపతమ్మ.. బళ్లారి సమీపంలో ఓ వృద్ధాశ్రమంలో చేరి తనకు వచ్చే పింఛన్‌పైనే ఆధారపడి జీవించేది. ఇటీవల కిందపడి గాయపడిన ఆమె మంచంపట్టింది. దీంతో చిన్నకూతురు, కుమారుడు వైద్యఖర్చులు భరించి ఆపరేషన్ చేయించారు. అటుతర్వాత గుంతకల్లులో కొడుకు ఇంటివద్దే తిరుపతమ్మ ఉంటోంది. ఈ క్రమంలో తల్లిని భారంగా భావించిన కొడుకు శ్రీనివాసులు..
కూతురి వద్దకు వెళ్లాలంటూ తిరుపతమ్మను గుంతకల్లు నుంచి పత్తికొండకు అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చాడు. ఓ ఇంటి ఎదుట ప్లాస్టిక్ కుర్చీలో తల్లిని కూర్చోబెట్టి.. ‘ఇదే నీ పెద్ద కూతురు ఇల్లు. తెల్లవారి వాళ్లు నిద్రలేచాక నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తారు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో రాత్రంగా చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయింది. ఉదయం కాలనీ వాసులు వృద్ధురాలికి సపర్యలు చేసి అల్పాహారం తినిపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జయన్న అక్కడికి చేరుకుని తిరుపతమ్మ నుంచి వివరాలు సేకరించారు. పక్క వీధిలోనే ఉన్న కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చి పిలిపించి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లిని తన ఇంటికి తీసుకెళ్లేందుకు కుమార్తె నిరాకరించింది. కుమారుడైన శ్రీనివాసులుకు పోలీసులు ఫోన్‌చేయగా స్విచ్‌ఆఫ్ వస్తోంది. తల్లిని ఆదరించాల్సిన కొడుకు అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్లిని వదిలేయడం, కుమార్తె ఇంటికి తీసుకెళ్లేందుకు ససేమిరా అనడంతో వృద్ధురాలిని 108 లో పోలీసులు పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుంతకల్లులో ఉన్న కుమారుడు, ఇద్దరు కుమార్తెలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారిస్తామని సీఐ జయన్న తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శివాలయానికి పోటెత్తిన భక్తులు..
మాజీ సర్పంచ్‌ల అరెస్టులను ఖండిస్తున్న.. : హరీష్‌రావు
సోమవారం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యాటన..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 04 , 2024 | 12:39 PM