సంక్రాంతికి 1600 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:36 AM
పండగ వేళ ప్రయాణికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగకు ముందు, తర్వాత 1,600 ప్రత్యేక సర్వీసులు నడపడానికి సిద్ధమైంది. వీటిలో 1,370 బస్సులను రిజర్వేషన్ ప్రాతిపదికన, మరో 230 సర్వీసులను ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఆధారంగా అప్పటికప్పుడు నడిపేలా ప్లాన్ చేసింది. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, రాయలసీమ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది.
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం
1,370 సర్వీసులకు రిజర్వేషన్ అవకాశం
రిజర్వులో మరో 230 స్పెషల్ బస్సులు
పండగకు వచ్చే వారికి 780, తిరుగు ప్రయాణాలకు 590 సర్వీసులు
హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, రాయలసీమ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు
సంక్రాంతి స్పెషల్ బస్సుల షెడ్యూల్ విడుదల చేసిన ఆర్టీసీ
పండగ వేళ ప్రయాణికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగకు ముందు, తర్వాత 1,600 ప్రత్యేక సర్వీసులు నడపడానికి సిద్ధమైంది. వీటిలో 1,370 బస్సులను రిజర్వేషన్ ప్రాతిపదికన, మరో 230 సర్వీసులను ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఆధారంగా అప్పటికప్పుడు నడిపేలా ప్లాన్ చేసింది. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, రాయలసీమ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
సంక్రాంతి పండగకు ఆర్టీసీ భారీగా స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ సారి సెలవులు పది రోజుల పాటు ఉండటంతో సొంతూళ్లకు వచ్చే వారి సంఖ్య ఎక్కువుగా ఉంటుందన్న ఉద్దేశంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా 1600 స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతి స్పెషల్ బస్సుల షెడ్యూల్‌ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. వీటిలో 1,370 బస్సులు రిజర్వేషన్ ప్రాతిపదికన నడిపేలా ప్లాన్ చేసింది. మరో 230 బస్సులను అప్పటికప్పుడు వచ్చే రద్దీ (ఆన్ డిమాండ్ రష్)కి అనుగుణంగా నడిపేందుకు వీలుగా రిజర్వులో ఉంచాలని నిర్ణయించింది. గతేడాది సంక్రాంతికి హైదరాబాద్ నుంచి భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. అప్పట్లో ఆర్టీసీ అధికారులు 1,310 బస్సులను నడిపారు. అయితే డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను నడపలేకపోయారు.
పక్కాప్లాన్‌తో ముందుకు..
గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆర్టీసీకి 150 (కాలం తీరిపోవడం, స్ర్కాప్‌కు పంపించడం) బస్సుల వరకు తగ్గాయి. దీంతో స్పెషల్ బస్సులు నడిపేంత స్థాయిలో ఆర్టీసీ దగ్గర బస్సులు లేకపోవడంతో సమస్య ఏర్పడుతోంది. అయినప్పటికీ గతేడాది కంటే 290 బస్సులను అదనంగానే నడపటానికి ప్లాన్ చేసింది. సంక్రాంతి పండగకు ముందు 780 బస్సులు, పండగ తర్వాత తిరుగు ప్రయాణాల కోసం 590 బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. కిందటిసారి హైదరాబాద్ నుంచి భారీగా ట్రాఫిక్ వచ్చింది. తెలంగాణ, ఏపీకి చెందిన బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు కార్ల మీద పెద్ద సంఖ్యలో వచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కు ఈ సంక్రాంతికి ముందు 296 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 9న 45, 10న 70, 11న 70, 12న 70, 13న 23 స్పెషల్ బస్సుల చొప్పున హైదరాబాద్‌కు ఇక్కడి నుంచి పంపించనుంది. సాధారణ షెడ్యూల్ బస్సులు 200 వరకు యథావిధిగా రాకపోకలు సాగిస్తాయి. పండగ తర్వాత తిరుగు ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌కు 325 బస్సులను నడపాలని ప్లాన్ చేసింది. జనవరి 14న 12, 15న 58, 16న 81, 17న 38, 18న 27, 19న 78, 20న 31 స్పెషల్ బస్సుల చొప్పున నడపనుంది.
రాజమండ్రి, వైజాగ్‌కు స్పెషల్ బస్సులు
పండగకు ముందు హైదరాబాద్ తర్వాత రాజమండ్రికి 13వ తేదీ వరకు 235 స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయించింది. తిరుగు ప్రయాణాలకు మాత్రం స్పెషల్ బస్సులు నడపడం లేదు. విశాఖపట్నం రూట్‌లో పండగకు ముందు 80 స్పెషల్ బస్సులు, పండగ తర్వాత 42 స్పెషల్స్ చొప్పున మొత్తం 122 బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. బెంగళూరుకు పండగకు ముందు 14 బస్సులు, పండగ తర్వాత రద్దీ నిమిత్తం 23 బస్సులు చొప్పున మొత్తంగా 37 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. చెన్నైకు పండగకు ముందు 13, పండగ తర్వాత 14 బస్సులు వెరసి 27 స్పెషల్స్ నడపనుంది. రాయలసీమ జిల్లాలకు పండగకు ముందు 142, పండగ తర్వాత 186 చొప్పున మొత్తం 328 స్పెషల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల నుంచి వచ్చే ప్రయాణికులంతా విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. అలాగే విజయవాడలో పీఎన్‌బీఎస్‌కు వచ్చే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎటు వెళతారన్నది ఆ సందర్భంలో కానీ తెలియదు. అందుకే వారి కోసం రిజర్వుడుగా 230 స్పెషల్ బస్సులను ఉంచాలని నిర్ణయించింది.