హీట్‌వేవ్ @ 2024
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:47 AM
గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం 1901 నుంచి 2020 వరకూ నమోదైన వార్షిక సగటు కంటే గడచిన ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రత 0.65 డిగ్రీలు అధికంగా నమోదైంది.
శతాబ్ద కాలంలో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు
దేశ వార్షిక సగటు కంటే 0.65 డిగ్రీలు ఎక్కువ
గత వేడి సంవత్సరం 2016ను మించి అధిక ఉష్ణోగ్రత
ప్రపంచవ్యాప్తంగానూ ఎక్కువే
విశాఖపట్నం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం 1901 నుంచి 2020 వరకూ నమోదైన వార్షిక సగటు కంటే గడచిన ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రత 0.65 డిగ్రీలు అధికంగా నమోదైంది. గతంలో అత్యంత వేడి సంవత్సరంగా 2016 రికార్డయ్యింది. ఆ ఏడాది భూ ఉపరితల ఉష్ణోగ్రతలు వార్షిక సగటు కంటే 0.54 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, 2024 సంవత్సరం ఆ రికార్డును అధిగమించింది. వరల్డ్ వెదర్ ఎట్రిబ్యూషన్, క్లైమేట్ సెంట్రల్ సంస్థలు 2024 సంవత్సరంపై అధ్యయనం చేశాయి. వాటితో పాటు భారత వాతావరణ శాఖ వద్ద ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకుంటే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలుస్తోందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రా వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలకు సంబంధించి 1901 నుంచి 2020 వరకు నమోదైన దీర్ఘకాలిక వార్షిక సగటు కంటే 0.90 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. వాతావరణపరంగా దేశంలో 2024లో ఎక్కువ రోజులు వేడిగాలులు వీయడం, అస్థిరమైన వర్షపాతం, విపరీతమైన వాతావరణ అనిశ్చితి నెలకొంది.
ప్రపంచ వ్యాప్తంగా అదే పరిస్థితి..
ప్రపంచవ్యాప్తంగా 2024 అత్యంత వేడి సంవత్సరమని యూరోపియన్ క్లైమేట్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు కూడా ప్రకటించారు. పారిశ్రామిక విప్లవానికి ముందు నమోదైన సగటు వార్షిక ఉష్ణోగ్రతల కంటే 2024లో తొలిసారిగా 1.5 డిగ్రీలు ఎక్కువ నమోదైనట్టు వెల్లడించారు. ఇంకా 41 రోజులు ప్రమాదకరమైన వేడిని ప్రపంచ ప్రజలు అనుభవించారని పేర్కొన్నారు. ఈ పరిణామం అసాధారణమని, ఇందుకు 2024 జూన్ వరకు కొనసాగిన ఎల్‌నినో, వాతావరణంలో అనూహ్య మార్పులు, విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ కారణాలుగా విశ్లేషించారు.
జనవరిలో చలి వణికించదు..
ఈ ఏడాది జనవరిలో చలి పెద్దగా ఉండదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఉత్తరాంధ్ర తప్ప రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇక, ఈశాన్య రుతుపవనాల సీజన్ (అక్టోబరు నుంచి డిసెంబరు)లో దక్షిణ భారతంలోని తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తా, కేరళ, దక్షిణ కర్ణాటకల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. 1901 నుంచి ఇప్పటివరకూ ఉన్న వివరాలు పరిశీలిస్తే 2024 మూడో అత్యధిక వర్షపాతం నమోదైన సంవత్సరం (ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో మాత్రమే)గా నిలిచింది.