Share News

Tirupati Stampede: స్విమ్స్‌ నుంచి 32 మంది డిశ్చార్జి

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:34 AM

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న 37 మందిలో పూర్తిగా కోలుకున్న 32 మందిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. వీరందరినీ తిరుమలకు పంపి శ్రీవారి దర్శనం కల్పించి, ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించేందుకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఏర్పాట్లు చేశారు.

Tirupati Stampede: స్విమ్స్‌ నుంచి 32 మంది డిశ్చార్జి

వీఐపీ బ్రేక్‌లో వైకుంఠద్వార దర్శనం

స్వస్థలాలకు తరలించడానికి ఏర్పాట్లు

ఆస్పత్రిలో మరో ఐదుగురికి చికిత్స

తిరుపతి(వైద్యం)/తిరుమల, జనవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న 37 మందిలో పూర్తిగా కోలుకున్న 32 మందిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. వీరందరినీ తిరుమలకు పంపి శ్రీవారి దర్శనం కల్పించి, ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు తరలించేందుకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఏర్పాట్లు చేశారు. వైజాగ్‌కు చెందిన దంపతులు నాగరాజు(46), ఈశ్వరమ్మ(36), అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురానికి చెందిన సిద్దపుగారి నరసమ్మ(35), తిమ్మక్క(40), రెడ్డెమ్మ(32) ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ముగ్గురి కుటుంబానికే చెందిన రఘు, గణేష్‌, వెంకటేశ్‌, నందీశ్‌, చిన్నపయ్యకు స్వల్పగాయాలయ్యాయి. తమవారికి తోడుగా వీరూ ఆస్పత్రిలోనే ఉన్నారు. చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఒకట్రెండు రోజుల్లో వీరినీ డిశ్చార్జి చేసి, శ్రీవారి దర్శన భాగ్యం కల్పించి స్వగ్రామాలకు పంపిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని కూడా అందరికీ అందిస్తామని చెప్పారు. మున్సిపల్‌ కమిషనర్‌ మౌర్య, స్విమ్స్‌ డైరెక్టర్‌ ఆర్వీకుమార్‌ పాల్గొన్నారు. కాగా, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ శుక్రవారం వీఐపీ బ్రేక్‌ కోటాలో వైకుంఠద్వార దర్శనం కల్పించింది. స్విమ్స్‌ నుంచి డిశ్చార్జి అయిన 32మందితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కలిపి మొత్తం 52 మందికి వేకువజామున వీఐపీలతో పాటే దర్శనం చేయించారు. అనంతరం క్షతగాత్రులు ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ఏదో పొరపాటున తొక్కిసలాట జరిగిందని, దానికి ఎవరూ బాఽధ్యులు కాదని తెలిపారు. సీఎం చంద్రబాబు సకాలంలో స్పందించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో పాటు మంచి దర్శనం కల్పించారని సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో బతికి బయటపడ్డామని, తమను బాగా చూసుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ బోర్డు, అధికారులందరికి ధన్యవాదాలు తెలిపారు. కంటికి రెప్పలా చూసుకుని తిరిగి ఇంటికి పంపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వీరందరినీ ఆస్పత్రి నుంచే అధికారులు ప్రత్యేక వాహనాల్లో తిరుమలకు తీసుకొచ్చారు.

Updated Date - Jan 11 , 2025 | 03:34 AM