Share News

Alcohol Prices: జే ట్యాక్స్‌ పోయిందిగా

ABN , Publish Date - Jan 13 , 2025 | 03:33 AM

కాలం గడిచేకొద్దీ ఏ వస్తువుకైనా ధర పెరుగుతుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా తయారీదారులు ఎమ్మార్పీలను పెంచుతూ ఉంటారు.

Alcohol Prices: జే ట్యాక్స్‌ పోయిందిగా

మరింత దిగొస్తున్న మద్యం ధరలు

తగ్గింపునకు కంపెనీల క్యూ

ఇప్పటికే 10 బ్రాండ్ల ధరల తగ్గింపు

మరో 6 కంపెనీలు దరఖాస్తు

క్వార్టర్‌పై రూ.20-80 తగ్గుదల

గత ఐదేళ్లూ ఇవే బ్రాండ్లపై దోపిడీ

అదనపు రేట్ల మొత్తం తాడేపల్లికి

కూటమి ప్రభుత్వంలో కమీషన్లు బంద్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కాలం గడిచేకొద్దీ ఏ వస్తువుకైనా ధర పెరుగుతుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా తయారీదారులు ఎమ్మార్పీలను పెంచుతూ ఉంటారు. మద్యం కంపెనీలు కూడా అలాగే ఎప్పటికప్పుడు తమ బ్రాండ్ల ధరలు పెంచుకోవాలని చూస్తాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీన్‌ రివర్స్‌ అయింది. ధరలు పెంచడం సంగతి అటుంచితే, ఉన్న ధరలనే తగ్గించాలని మద్యం కంపెనీలు కోరుతున్నాయి. అది కూడా నోటి మాటగా కాకుండా ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే.. జే ట్యాక్స్‌ లేకపోవడమే! జగన్‌ ప్రభుత్వంలో తాడేపల్లికి కప్పం కట్టాల్సి ఉండటంతో ధరలను అదనంగా పెంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జే ట్యాక్స్‌ కట్టాల్సిన పని లేకపోవడంతో ధరలు తగ్గించుకునేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. గత రెండు నెలల కాలంలోనే 16 మద్యం కంపెనీలు ధర తగ్గింపునకు దరఖాస్తు చేశాయి. వాటిలో పది బ్రాండ్లకు ఇప్పటికే ధరలు తగ్గించారు. సవరించిన ధరలతో ఆ కంపెనీలు మద్యం కూడా సరఫరా చేస్తున్నాయి. తమ బ్రాండ్ల ధరలు కూడా తగ్గించాలని మిగిలిన కంపెనీలు కోరుతున్నాయి. వాటిలో కొన్నింటి తగ్గింపునకు అనుమతి పొందినా, లేబుల్‌ కోసం ఎదురు చూస్తున్నాయి.

గత ప్రభుత్వంలో మద్యం అక్రమాల వ్యవహారంలో పాత్ర ఉందని భావిస్తున్న మరికొన్ని కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సీఐడీ విచారణను కారణంగా చూపి అనుమతుల జారీ అంశాన్ని పరిశీలనలో పెట్టింది. కాగా మరికొన్ని ఇతర కంపెనీలు కూడా ధరలు తగ్గించుకునేందుకు ముందుకొస్తున్నట్లు సమాచారం. మద్యం ధరలు తగ్గించుకుంటామని కంపెనీలు క్యూ కట్టడం ఇదే తొలిసారి కావడంతో ఎక్సైజ్‌ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలు కోరకపోయినా ప్రభుత్వం వాటికిచ్చే ధరలను పెంచేసింది. లిక్కర్‌ కేసుపై రూ.200, బీరు కేసుపై రూ.50 చొప్పున అదనంగా చెల్లించింది. అలా అదనంగా చెల్లించించిన మొత్తాన్ని తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పంగా వసూలు చేసింది. తద్వారా కంపెనీలపై భారం పడకుండానే వైసీపీ పెద్దలకు కమీషన్లు వచ్చాయి. చివరికి మద్యం వినియోగదారుల జేబుకు చిల్లు పడింది. ఇలా దాదాపు ఐదేళ్ల పాటు కమీషన్ల ప్రక్రియ సాగింది. ప్రభుత్వం మారగానే ఈ దందాకు ఫుల్‌స్టాప్‌ పడింది. దీంతో కొన్ని కంపెనీలు తమకు ఇంత రేటు ఇవ్వాల్సిన అవసరం లేదని, కొంత తక్కువకే సరఫరా చేస్తామంటూ స్వచ్ఛందంగా ధరలు తగ్గించుకునేందుకు ముందుకొచ్చాయి. ఎక్సైజ్‌ శాఖ కూడా అనుమతిచ్చింది. దీనివల్ల మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇది వ్యాపారపరంగా పోటీ కావడంతో అన్ని కంపెనీలు క్రమంగా తామూ ధరలు తగ్గించేస్తామంటూ ముందుకొస్తున్నాయి.


భారీగా తగ్గింపు

లిక్కర్‌ బ్రాండ్లలో క్వార్టర్‌పైనే రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నాయి. మాన్సన్‌ హౌస్‌ కంపెనీ క్వార్టర్‌ సీసాపై రూ.30 తగ్గించింది. అరిస్ర్టోకాట్‌ ప్రీమియం సుపీరియర్‌ విస్కీ ధర ఏకంగా రూ.50 తగ్గింది. కింగ్‌ఫిషర్‌ బీరు రూ.10 తగ్గింది. బ్యాగ్‌పైపర్‌ గోల్డ్‌ రిజర్వ్‌ విస్కీ ఒకేసారి రూ.80 తగ్గించుకునేందుకు దరఖాస్తు చేసింది. ఇక, ఇప్పుడు రేట్లు తగ్గిస్తున్నారంటే ఇప్పటి వరకూ అదనంగా వసూలు చేసినట్లేగా అని ప్రశ్నిస్తున్నారు. కంపెనీలు ధరలు తగ్గించుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గిపోతాయి. కంపెనీల కంటే ప్రభుత్వం పన్నుల ద్వారా కోల్పోయేదే ఎక్కువ.

Updated Date - Jan 13 , 2025 | 03:33 AM