Marcury కుళ్లిపోతున్న శవాలు..!
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:43 PM
పంచనామా నిమిత్తం నిత్యం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి శవాలను తీసుకు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజులు మార్చురీలో పెట్టాల్సి వస్తుంది.
మార్చురీలో ఫ్రీజర్లు కరువు
నేలపైనే మృతదేహాలు
ఎలుకలు చీమలు
తిన్నా పట్టించుకునేవారేరీ..?
‘పురం’ ఆసుపత్రిలో దయనీయం
హిందూపురం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పంచనామా నిమిత్తం నిత్యం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి శవాలను తీసుకు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజులు మార్చురీలో పెట్టాల్సి వస్తుంది. ఒకేసారి రెండు మూడు మృతదేహాలు వస్తే నేలపైనే ఉంచాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. దశాబ్దాల క్రితమే జిల్లా ఆసుపత్రిగా పేరు గాంచింది. ప్రస్తుతం నూతన జిల్లా ఏర్పడ్డాక ఇక్కడికే అధిక సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇలాంటి ఆసుపత్రిలో మార్చురీ గది లేకపోవడం దారుణం. కొన్నేళ్ల క్రితం నిర్మించిన మార్చురీ గది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దాని పక్కన ఉన్న దోబీకి కేటాయించిన చిన్నపాటి గదిలో శవాలను ఉంచుతున్నారు. ఇప్పటి వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేయలేదు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోకి లేపాక్షి చిలమత్తూరు, పరిగితో పాటు కొన్ని సందర్భాల్లో మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోని మృతదేహాలను సైతం ఇక్కడికే తరలిస్తారు.
అధ్వాన్నంగా మార్చురీ
హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి రోజూ ఒకటి రెండు మృతదేహాలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మూడు నాలుగు కూడా వస్తుంటాయి. ఇందులో ఆత్మహత్యలు చేసుకున్న వారు, అనాథ శవాలు, రోడ్డు ప్రమాదాలు, ఎంఎల్‌సీ, నాన ఎంఎల్‌సీ కేసుల్లో మృతదేహాలు మార్చురీకి తరలిస్తారు. నెలలో కనీసం ఐదారుగురు రైలు కింద పడి మృతి చెందుతుంటారు. ఇందులో అధిక శాతం గుర్తుతెలియని వారే ఉంటారు. మార్చురీలో శవాలను భద్రపర్చడానికి వసతి లేదు, అంతకు మించి ఫ్రీజరు లేదు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించకనే అనాథ శవాలుగా ఖననం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. మార్చురీ గది ఓ మూలకు ఉంది. దీంతో అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి కంపచెట్లు ఉన్నాయి. దీని వల్ల మృతదేహాలను నేలపై ఉంచితే చీమలు, ఎలుకలు తిన్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని మృతుల బంధువులు ఆవేదన చెందుతున్నారు.
నూతన మార్చురీ గది నిర్మిస్తేనే..
ఏదైనా అనుకోని పరిస్థితులు, రోడ్డు ప్రమాదాల్లో, ఇతర కారణాలతో ఎంతటి వారు మరణించినా ఇక్కడ ఇదే గదిలో ఉంచాలి. మృతదేహాలను ఖననం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సుదూర ప్రాంతాల్లోని బంధువులు రావడానికి ఆలస్యమైతే అంతవరకు మృతదేహాన్ని భద్రపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో మృతదేహాలను భద్రపర్చడానికి గది లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చేసరికి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ నూతన మార్చురీ గది నిర్మాణానికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
గది నిర్మాణానికి నివేదికలు పంపాం
ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ గది నిర్మాణం కోసం నివేదికలు పంపాం. కొత్త మార్చురీ గదితో పాటు ఫ్రీజర్లు కూడా కావాలని ఉన్నతాధికారులకు నివేదించాం. స్థానిక ఎమ్మెల్యే ద్వారా నిధులు తొందర్లోనే వస్తాయి.
- లింగన్న, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్, హిందూపురం