Share News

Incharge Minister అపోహలకు తావివ్వొద్దు

ABN , Publish Date - Apr 18 , 2025 | 11:33 PM

కూటమి నేతల మధ్య అపోహలకు తావుండకూడదని జిల్లా ఇనచార్జ్‌ మంత్రి టీజీ భరత అన్నారు. మూడు పార్టీల నేతలు సమష్టిగా ముందుకు సాగాలని, వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని అన్నారు.

Incharge Minister అపోహలకు తావివ్వొద్దు
మాట్లాడుతున్న జిల్లా ఇనచార్జి మంత్రి టీజీ భరత

సమష్టిగా ముందుకు సాగండి

కూటమి నేతలకు జిల్లా ఇనచార్జ్‌

మంత్రి టీజీ భరత సూచన

ఎంపీ, ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన,

బీజేపీ నేతలతో సమావేశం

అనంతపురం, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): కూటమి నేతల మధ్య అపోహలకు తావుండకూడదని జిల్లా ఇనచార్జ్‌ మంత్రి టీజీ భరత అన్నారు. మూడు పార్టీల నేతలు సమష్టిగా ముందుకు సాగాలని, వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని అన్నారు. నగరంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, బండారు శ్రావణిశ్రీ, అశ్మిత రెడ్డి, అమిలినేని సురేంద్రబాబు, గుమ్మనూరు జయరాం, టీడీపీ, బీజేపీ, జనసేన జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్‌, కొనకొండ్ల రాజేష్‌, టీసీ వరుణ్‌, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, సీనియర్‌ నాయకుడు ముంటిముడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులతో శుక్రవారం ఆయన అంతర్గత సమావేశం నిర్వహించారు. పార్టీల పరంగా పలు అంశాల గురించి మంత్రి చర్చించారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు, కొన్ని నియోజకవర్గాల్లో ఆది నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు టీడీపీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చౌక డిపోల విషయంలో నియోజకవర్గాల్లో తలెత్తిన సమస్యను కొందరు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికీ వైసీపీ డీలర్లు వేలిముద్రలు వేస్తేనే సరుకులు పంపిణీ చేసే పరిస్థితి ఉందని, వీలైనంత ద్వరగా పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని ఎంపీ, ఎమ్మెల్యేలు కోరారు. ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఆదేశించాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయ్యేలా ఎమ్మెల్యేలు ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, వారి సమస్యలను పరిష్కరిస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించారు. పార్టీ నేతల మధ్య వైరుధ్యాలు, ఇతర సమస్యలను పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. కుటుంబ సాధికార సారఽథులు, గ్రామ, వార్డు కమిటీలు, మండల, పట్టణ కమిటీలను గడువులోపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ కమిటీల విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఈ నెల 23లోపు కుటుంబ సాధికార సారఽథుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని, ఆ తరువాత గ్రామ, వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలను కోరారు. ఈ రెండు కమిటీలు పూర్తయిన తరువాత మండల కమిటీలు, నియోజకవర్గస్థాయి కమిటీలు పూర్తి చేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఇనచార్జ్‌ మంత్రికి ఒకరిద్దరు ఎమ్మెల్యేల తీరుపై పలువురు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొంత అలజడి చోటుచేసుకుంది.

Updated Date - Apr 18 , 2025 | 11:33 PM