Minister Gottipati Ravi Kumar సోలార్ హబ్‌గా ఉమ్మడి అనంత
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:39 PM
అనంత జిల్లాను సోలార్ హబ్ చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని విద్యుతశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో శుక్రవారం ఆయన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్‌తో కలిసి సుడిగాలి పర్యటన చేశారు.
నియోజకవర్గానికి పదివేల సూర్యాఘర్ కనెక్షన్లు
విద్యుతశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
నీచ రాజకీయం జగనకే సాధ్యం: మత్రి అనగాని
చంద్రబాబు వల్లే జిల్లా అభివృద్ధి: మంత్రి సవిత
కూటమితో రాష్ట్రం మరింత అభివృద్ధి: మంత్రి సత్యకుమార్
మడకశిర/మడకశిరటౌన, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అనంత జిల్లాను సోలార్ హబ్ చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని విద్యుతశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. నియోజకవర్గంలో శుక్రవారం ఆయన రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్‌తో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా నాలుగు సబ్‌స్టేషన్లను ప్రారంభించారు. మరో మూడు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. తొలుత మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి, మాట్లాడారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులకు విద్యుత సమస్యలు లేకుండా చేసేందుకు నాలుగు 33/11 కేవీ విద్యుత సబ్ స్టేషన్లు ప్రారంభించి, మరో మూడు సబ్ స్టేషన్ల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుతను అందిస్తున్నట్లు తెలిపారు. అందుకోసం త్వరలో సోలార్ ప్రాజెక్టులు కూడా రానున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం సూర్యఘర్ పథకం కింద ఇళ్లపై సోలార్ విద్యుత ఉత్పత్తి కోసం రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు మంజూరు చేసిందన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 10 వేల కనెక్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. మడకశిర ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటుకు అనువైన ప్రాంతం కావడంతో రాబోయే రోజుల్లో ఇక్కడికి పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టులు వస్తాయన్నారు. ప్రతి సబ్ స్టేషన సమీపంలో సోలార్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం టెండర్లు కూడా పిలిచినట్లు వెల్లడించారు.
పెద్దిరెడ్డి అక్రమాలను బయటకు తీస్తాం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ అక్రమాలను, రెవెన్యూ రికార్డుల దహనం వంటి వాటిని వెలికి తీస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన బాగోతాలు బయటపడటం, దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి ఆస్తులను ఈడీ అటాచమెంట్‌తో తెరపైకి టీటీడీ గోశాలను తెచ్చారని ఆరోపించారు. ఇంత నీచ రాజకీయం జగన ఒక్కడికే సాధ్యమన్నారు. వైసీపీ నాయకులకు హిందూతత్వం మీద నమ్మకం లేదన్నారు. అందుకే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
విజన ఉన్న నాయకుడు చంద్రబాబు
విజన ఉన్న నాయకుడు చంద్రబాబు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి ఆయనతోనే సాధ్యమన్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న మడకశిరకు ఈ రోజు సాగు, తాగునీరు అందుతున్నాయంటే అందుకు కారణం చంద్రబాబు అని తెలిపారు. 2014-2019 గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించారని, కియ పరిశ్రమ తెచ్చారని, తద్వారా జిల్లా అభివృద్ధికి బాటలు వేశారన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కృషి వల్ల నియోజకవర్గం రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు.
రూ.7వేల కోట్లతో సోలార్‌పార్క్
మడకశిర నియోజకవర్గంలో రూ.7వేల కోట్లతో సోలార్‌పార్క్ నిర్మించబోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు ఎంఎస్‌రాజు చేసిన పోరాటం అభినందనీయం అన్నారు. సూర్యాఘర్ పథకం వల్ల వినియోగదారుడుగా ఉన్న సామాన్యుడు విద్యుత ఉత్పత్తిదారుడుగా మారుతాడన్నారు. భవిషత్తులో ఎనడీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆవుల మృతిపై భూమన కరుణాకర్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే గోశాల సందర్శనకు ఎందుకు వెళ్లలేదని, ఇంటి దగ్గరే ఉండి రోడ్డుపై ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ప్రణాళికాబద్ధంగా ముందుకు
మడకశిర నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం అన్నారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అనుభవంతో నియోజకవర్గాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కందికుంట ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, దగ్గుపాటి వెంకటప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు అంజినప్ప, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, విద్యుతశాఖ ఎస్‌ఈ సురేంద్ర, డీఈ భూపతి, ఏడీ రఘునాథ్, ఏఈ సిద్దేశ్వర, విద్యుతఅధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఘన స్వాగతం
విద్యుత సబ్‌స్టేషన్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు వైబీ హళ్లికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రులకు గజమాలలు వేసి స్వాగతం పలికారు. గ్రామం నుంచి సబ్‌స్టేషన వరకు ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రొళ్ల మండలంలోని రంగనపల్లి గ్రామంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మార్కెట్‌యార్డు చైర్మన గురుమూర్తి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.
నియోజకవర్గం అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి: మంత్రి అనగాని సత్యప్రసాద్
జిల్లాలో నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యేల నుంచి వచ్చే ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ చేతనను రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా శుక్రవారం మడకశిర ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన తన సహచర మంత్రులతో కలిసి కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల పట్ల సానుకూలంగా స్పందించడంతోపాటు వేగంగా ఫైల్ పూర్తి చేయాలన్నారు.
పార్టీ బలోపేతానికి అంకితం కావాలి: మంత్రులు
ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రివ్యూ మీటింగ్ అనంతరం జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్, గొట్టిపాట్టి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ముందుగానే గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కమిటీలను పూర్తి చేయాలని సూచనలు చేశారు.
సబ్‌స్టేషన్లు ప్రారంభించినది
మడకశిర మండలం వైబీహళ్లి, కదిరేపల్లి
అగళి మండలం ఇనగలూరు
అమరాపురం మండలం శివరం గ్రామం
భూమిపూజ చేసినది
రొళ్ల మండలం రంగనపల్లి గ్రామం
గుడిబండ మండలం కేకే పాళ్యం గ్రామం
మడకశిర మండలం గుండుమల గ్రామం