Retion బఫర్ పరేషన..!
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:48 PM
ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా రేషన బియ్యం బఫర్ సమస్య పరిష్కారం కాలేదు. వైసీపీ డీలర్లు మి గులు బియ్యాన్ని అప్పగించకపోవడంతో కొత్త డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు, బఫర్ పోనూ మిగిలిన బియ్యాన్ని మాత్రమే డీలర్లకు అందజేస్తున్నారు.
వైసీపీ హయాంలో బియ్యం పక్కదారి
మిగులు కోత పెట్టి కొత్త డీలర్లకు సరఫరా
ప్రతి నెలా కార్డుదారులకు మొండి చేయి
పది నెలలైనా పరిష్కారం కాని సమస్య
పట్టించుకోని పౌర సరఫరాల శాఖ
అనంతపురం టౌన, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా రేషన బియ్యం బఫర్ సమస్య పరిష్కారం కాలేదు. వైసీపీ డీలర్లు మి గులు బియ్యాన్ని అప్పగించకపోవడంతో కొత్త డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు, బఫర్ పోనూ మిగిలిన బియ్యాన్ని మాత్రమే డీలర్లకు అందజేస్తున్నారు. మధ్యలో కార్డుదారులు నష్టపోతున్నారు. ప్రతి నెలా కొందరికి బియ్యం అందడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగానే ఆ పార్టీ మద్దతు డీలర్లు కొందరు స్వచ్ఛందంగా డీలర్‌షి్‌పను టీడీపీ మద్దతుదారులకు అప్పగించారు. మరికొన్నిచోట్ల అధికార పార్టీ వర్గీయులు బలవంతంగా లాగేసుకున్నారు. కానీ అప్పటి వరకూ మిగిలిన స్టాక్‌ను కొత్త డీలర్లకు అప్పగించలేదు. వైసీపీ హయాంలో మిగులు బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే బఫర్ సమస్య పరిష్కారం కావడం లేదని అంటున్నారు.
29,492 టన్నుల బియ్యం కోత
అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 6,66,330 రేషనకార్డులు ఉన్నాయి. వీటికి ప్రతినెలా 1,11,475 టన్నుల బియ్యం విడుదల చేయాల్సి ఉంటుంది. వైసీపీ హయాంలో పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. లెక్కల్లో మాత్రం మిగులుగా చూపించారు. ప్రభుత్వం మారిన తరువాత కొత్త డీలర్లు నిర్వహణ బాధ్యతలను తీసుకున్నారు. అప్పటికి దాదాపు 40 వేల టన్నుల బియ్యం బఫర్ చూపించారు. అదిపోనూ మిగిలిన కోటా బియ్యాన్ని మాత్రమే విడుదల చేశారు. దీంతో కొత్త డీలర్లు ఖంగుతిన్నారు. సమస్య పరిష్కారం కోసం కొందరు కొత్త డీలర్లు కార్డుదారులకు బియ్యానికి బదులు కేజీకి రూ.15 చెల్లించి.. వేలిముద్రలు వేయించుకున్నారు. అయినా ఇప్పటికీ బఫర్ సమస్య కొనసాగుతూనే ఉంది. అధికారులు చెబుతున్న మేరకు ప్రస్తుతం మార్చి నెల కోటా 1,11,475 టన్నుల బియ్యం మంజూరు చేయాల్సి ఉండగా, బఫర్ స్టాక్ 29,983 టన్నులు పోనూ 81,492 టన్నుల బియ్యం మాత్రమే విడుదల చేశారు. దీంతో ఈ నెల కూడా అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు తదితర ప్రాంతాలలో కార్డుదారులకు పూర్తిస్థాయిలో బియ్యం ఇవ్వలేదు. స్టాక్ లేదని, బియ్యం ఇవ్వలేమని డీలర్లు చేతులెత్తేశారు.
పరిష్కారం ఎప్పుడు..?
బఫర్ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి. అధికారులు, వైసీపీ నాయకుల కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బియ్యం కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బఫర్ స్టాక్ గురించి వైసీపీ డీలర్లను, పౌరసరఫరాల శాఖ అధికారులను కొత్త డీలర్లు ప్రశ్నించినా సమస్య పరిష్కారం కాలే దు. ‘మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి.. బఫర్ బియ్యం ఇచ్చేది లేదు’ అన్నట్లుగా పాత డీలర్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు సైతం గట్టిగా నిలదీయడం లేదు. అప్పట్లో జరిగిన అక్రమాల్లో అధికారుల పాత్ర ఉన్నందుకే మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బఫర్ వ్యవహారంపై కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. చివరకు వివాదం పోలీసుల వరకూ వెళ్లింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం పెట్టుకుని మరీ చర్చించారు. బఫర్ పేరిట బియ్యం కోతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదోరకం దోపిడీ
బఫర్ కారణంగా ఇప్పటికే చాలామందికి బియ్యం అందడం లేదు. తాజాగా ఈకేవైసీ చేయించలేదన్న కారణంగా కొందరు డీలర్లు బియ్యం ఎగవేస్తున్నారు. ఆ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఈకేవైసీ చేయించకపోయినా ఈ నెలలో బియ్యం కోత పెట్టవద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. అయినా కొందరు ఆ ముసుగులో బియ్యాన్ని కాజేస్తున్నారు.
ఇవీ జిల్లా గణాంకాలు
మొత్త రేషనకార్డులు: 6,66,330
లబ్ధిదారులు: 20,11,076
నెలావారీగా ఇవ్వాల్సిన బియ్యం: 1,11,475 టన్నులు
ఈ నెల మంజూరు చేసిన బియ్యం: 81,492గన్నులు
బఫర్ పేరుతో ఈనెలలో బియ్యం కోత
: 29,983 టన్నులు