Sankranti: భోగి రోజునే సంక్రాంతి
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:14 AM
ఆ ఊరిలో భోగి రోజున సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. అదే విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామం ప్రత్యేకత.
విజయనగరం జిల్లా అంతకాపల్లి గ్రామంలో ఆనవాయితీ
వందేళ్లుగా భోగి మంటలు కనిపించని ఊరు
(రాజాం రూరల్-ఆంధ్రజ్యోతి):
ఆ ఊరిలో భోగి రోజున సంక్రాంతి వేడుకలు జరుపుకొంటారు. అదే విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామం ప్రత్యేకత. ఈ గ్రామంలోని వాకముళ్ల ఇంటిపేరు గల కుటుంబీకులు భోగి రోజునే సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో నివాసం ఉంటున్న 70 కుటుంబాలతోపాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం భోగి రోజున గ్రామానికి చేరుకుని వాకముళ్ల వారి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ కుటుంబాలు మినహా గ్రామస్థులంతా మకర సంక్రాంతి వేడుకలను సంక్రాంతి రోజున జరుపుకొంటున్నారు. వాకముళ్ల కుటుంబీకులు గ్రామంలోని బంధుమిత్రులను భోగి రోజున విందుకు ఆహ్వానించగా, గ్రామంలోని వారి బంధుమిత్రులు సంక్రాంతి పర్వదినాన వాకముళ్ల కుటుంబీకులను విందుకు ఆహ్వానిస్తారు. ఈ పద్ధతి దశాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే, గత వందేళ్లుగా ఈ ఊరిలో భోగి మంటలు వెలగలేదు. వందేళ్ల క్రితం గ్రామంలో వేసిన భోగి మంటల్లో పిల్లి పడి మరణించింది. దీంతో ఆ తర్వాతి ఏడాది నుంచి గ్రామంలో భోగి వేడుకలు నిలిపివేశారు. తాతలు, తండ్రులు అనుసరించిన విధానానికి గౌరవమిస్తూ ఇప్పటికీ అదే ఆనవాయితీని గ్రామస్థులు కొనసాగిస్తున్నారు.