Share News

జగన్‌ పత్రిక రోత రాతలపై సీఐడీ కదలాలి!

ABN , Publish Date - Jan 30 , 2025 | 05:06 AM

కేసును నీరుగార్చే ప్రయత్నాన్ని చేస్తోందంటూ జగన్‌ రోత పత్రికలో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ జీవీరెడ్డి విజయవాడలో డిమాండ్‌ చేశారు.

జగన్‌ పత్రిక రోత రాతలపై సీఐడీ కదలాలి!

ఏ అధికారులను ప్రభుత్వం బెదిరించిందో నిగ్గు తేల్చాలి

తప్పుడు కథనాన్ని రాసినందుకు నోటీసులివ్వాలి

ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ జీవీ రెడ్డి డిమాండ్‌

మాజీ చైర్మన్‌, ఎండీలైన గౌతంరెడ్డి, మధుసూదనరెడ్డిపై కేసు పెడతామని వెల్లడి

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన ఫైబర్‌నెట్‌ కేసులో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి, కేసును నీరుగార్చే ప్రయత్నాన్ని చేస్తోందంటూ జగన్‌ రోత పత్రికలో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఫైబర్‌నెట్‌ చైర్మన్‌ జీవీరెడ్డి విజయవాడలో డిమాండ్‌ చేశారు. తొలుత ఫైబర్‌నెట్‌కు సాంకేతిక సహకారాన్ని అందించిన టెర్రా సాఫ్ట్‌పై కేసును పెట్టి తర్వాత దానిలో ఎ-1గా చంద్రబాబు పేరును పెట్టడంలోనే పెద్దకుట్ర దాగి ఉందన్నారు. కేసు పెట్టాలని ఫైబర్‌నెట్‌ చైర్మన్‌గా ఉన్న గౌతం రెడ్డి ఫిర్యాదు చేస్తే... ఎఫ్‌ఐఆర్‌లో ఆ సంస్థ మాజీ ఎండీ మధుసూదన రెడ్డి పేరు రాయడంలోనే చంద్రబాబును ఇరికించాలన్న కుట్ర బయటపడుతుందని ధ్వజమెత్తారు. దొంగ కేసులు పెట్టిన గౌతంరెడ్డి, మధుసూదనరెడ్డిపై క్రిమినల్‌ కేసును నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఫైబర్‌ నెట్‌లో జరిగిన అవినీతిపై కేసు పెట్టినందుకు అప్పటి ఐఏఎస్‌ అధికారులతో సహా.. మరికొందరని చంద్రబాబు వేధిస్తున్నారంటూ జగన్‌ పత్రికలో కథనాన్ని ప్రచురించడంపై సీఐడీ దర్యాప్తు చేయాలని, తప్పుడు కథనం ప్రచురించిన జగన్‌ పత్రిక యాజమాన్యానికి సీఐడీ నోటీసులు ఇవ్వాలన్నారు. సీఆర్డీఏ పూర్వ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను బెదించారంటూ కథనాలు ఒకవైపు రాస్తూనే.. మరోవైపు ఆ అధికారి చంద్రబాబు మనిషి అంటూ పేర్కొనడం ఏమిటంటూ నిలదీశారు. ఫైబర్‌నెట్‌ పూర్వ ఎండీ మధుసూదనరెడ్డి తన సొదరుడికి రూ.100 కోట్ల పనులు అప్పగించి సంస్థకు నష్టం చేశారని.. వాటన్నింటిపై అంతర్గత పరిశీలన జరుగుతుందని జీవీరెడ్డి తెలిపారు. ఈ అవకతవకలపై త్వరలోనే మధుసూదనరెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - Jan 30 , 2025 | 05:06 AM