సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ
ABN , Publish Date - Jan 11 , 2025 | 04:08 AM
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మంచి సేవలకు అవకాశం
ప్రతి సచివాలయంలో యాస్పిరేషనల్ కార్యదర్శి
ప్రతి ఇల్లూ జియోట్యాగింగ్ చేయాలి: సీఎం
కనీసం 2,500 మంది జనాభాకు..
లేదంటే 5 కిమీ పరిధిలో ఓ సచివాలయం
అవసరమైతే ఏజెన్సీల్లో అదనంగా పెంచాలి
సర్టిఫికెట్లపై నా ఫొటోలు వద్దు: చంద్రబాబు
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ సిబ్బంది కొన్నిచోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియతో దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు శుక్రవారమిక్కడ గ్రామ/వార్డు సచివాలయ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వాటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా.. చాలా ప్రాంతాల్లో తక్కువ మందితోనే నడిపిస్తున్నారు. రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీ్‌సగా వారిని విభజించాలనే ప్రతిపాదన ఉంది. మల్టీపర్పస్ విభాగంలోకి గ్రామ సచివాలయ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్-ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు వస్తారు. వార్డు సచివాలయంలో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి, విద్య-డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్-డెవల్‌పమెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు. టెక్నికల్ విభాగంలో.. గ్రామ సచివాలయ పరిధిలో వీఆర్వో, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. వార్డు సచివాలయంలోకి వార్డు రెవెన్యూ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, శానిటేషన్, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు. ప్రతి 2,500-3,500 మంది జనాభాకు ముగ్గురు మల్టీపర్పస్ సిబ్బంది, నలుగురు టెక్నికల్ సిబ్బంది కలిపి ఏడుగురు ఉంటారు. 3,500కి మించి జనాభా ఉంటే.. నలుగురు మల్టీపర్పస్, నలుగురు టెక్నికల్ ఉద్యోగులు కలిపి 8 మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే.. 2,500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ/వార్డు సచివాలయాలు ఉంటాయి. 2,500-3,500 జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 సచివాలయాలు ఉంటాయి. 3,500కు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6,054 గ్రామ/వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ/వార్డు సచివాలయాలు ఉంటారు.
యాస్పిరేషనల్ సెక్రటరీ..
ప్రతి సచివాలయంలో ఒక సెక్రటరీని యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని, వారి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్ చేయాలన్నారు. కనీసం 2,500 మంది జనాభాకు.. లేదా 5 కి.మీ పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలన్నారు. ఏజెన్సీల్లో అవసరమైతే అదనంగా పెంచాలని తెలిపారు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం.. మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ఉన్న వీరినే సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలుపరిస్తే 15 వేల మంది సచివాలయ సిబ్బంది అదనంగా ఉంటారు. వీరిలో సాంకేతిక అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ కార్యదర్శిగా నియమించాలని సీఎం చెప్పారు. సమాచారం లేనివారి నుంచి పూర్తి వివరాలు తీసుకునే ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. సచివాలయాల పనితీరును అంచనా వేసిన వారికి బహుమతి ఇవ్వాలన్నారు. ‘సచివాలయ విభాగానికి పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలనా కార్యదర్శి అధిపతిగా ఉంటారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలి. ఈ నెల 20నాటికి గృహాలన్నీ జియోట్యాగింగ్ పూర్తి చేయాలి. సచివాలయాల ద్వారా జారీచేసే సర్టిఫికెట్లపై నా ఫొటోలు ముద్రించవద్దు. వాటిపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి. పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15కల్లా పూర్తి చేయాలి’ అని సూచించారు.