Prisoner Release: జీవిత ఖైదీలకు శుభవార్త
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:24 AM
జీవిత ఖైదు అనుభవిస్తున్న సత్ప్రవర్తన గల ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఖైదీల జాబితాను కమిటీ సమీక్షించి, కొత్త మార్గదర్శకాల ప్రకారం విడుదల జరగనుంది
సత్ప్రవర్తన కలిగిన వారి విడుదలకు ఉత్తర్వులు జారీ
అర్హుల పేర్లు పంపాలని జైళ్ల డీజీకి హోంశాఖ ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్లలో వివిధ కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శిక్ష నుంచి మినహాయింపు ఇస్తూ గురువారం రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలకు అర్హులైన ఖైదీల పేర్లు పంపాలంటూ జైళ్ల శాఖ డీజీని ఆదేశించింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, న్యాయశాఖ కార్యదర్శి, సీఐడీ డీజీ, ప్రధాన న్యాయ సలహాదారు, ఇంటెలిజెన్స్ చీఫ్, జైళ్ల శాఖ డీజీ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ జాబితాను సమీక్షించి, ఖరారు చేస్తుందని పేర్కొంది. ప్రతి ఖైదీకి సంబంధించిన కేసులు, శిక్ష, ఇతరత్రా నిబంధనలకు అనుగుణంగా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఏటా మూడు విడతల్లో.. ఫిబ్రవరి, జూన్, అక్టోబరులో ఖైదీలను విడుదల చేసేలా కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. అర్హులైన ఖైదీలు రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. శిక్షాకాలం పూర్తయ్యే వరకూ స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి వద్ద ప్రతి 3నెలలకు ఒకసారి హాజరవ్వాలి. విడుదల తర్వాత ఏదైనా నేరానికి పాల్పడితే క్షమాబిక్ష రద్దవుతుందని కుమార్ విశ్వజీత్ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.