Share News

APSPDCL : మంత్రి మెహర్బానీ ఖరీదు రూ.343 కోట్లు!

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:09 AM

అవసరం లేనప్పటికీ కొత్తగా 33/11 కేవీ లైన్‌ వేసేందుకు.. రూ.343 కోట్లను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నుంచి అప్పు తెచ్చి మరీ ఖర్చు చేసేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సిద్ధమైంది. రాయల సీమలో అత్యంత కీలకమైన జిల్లాకు చెందిన ఒక

APSPDCL : మంత్రి మెహర్బానీ ఖరీదు రూ.343 కోట్లు!

అవసరం లేకున్నా 33/11 కేవీ లైన్‌ పనులు

కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో

చేపట్టేందుకు టెండర్‌ నోటిఫికేషన్‌

తెరవెనుక ఏం జరిగిందా అని సిబ్బంది ఆరా

లోవోల్టేజీతో బల్బులు పోతున్నాయంటూ

డిస్కంకు ముగ్గురు ఎమ్మెల్యేల లేఖలు

విద్యుత్‌ కెపాసిటీ పెంచాలని సూచన

లేఖ రాసినందుకు తలో రూ.కోటి?

ఈ తతంగం వెనుక సీమ మంత్రి

సీఎంవోకు చేరిన సమాచారం!

చర్యలకు అధికారులు సన్నద్ధం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అవసరం లేనప్పటికీ కొత్తగా 33/11 కేవీ లైన్‌ వేసేందుకు.. రూ.343 కోట్లను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నుంచి అప్పు తెచ్చి మరీ ఖర్చు చేసేందుకు దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సిద్ధమైంది. రాయల సీమలో అత్యంత కీలకమైన జిల్లాకు చెందిన ఒక మంత్రి కోసం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులను తమ సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించి.. వారి నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఆయన పూనుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డిస్కం పరిధిలోనే గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్మార్ట్‌మీటర్లు, ట్రాన్స్‌మిషన్‌ వైర్లు వంటివాటి కొనుగోలులో రూ.వేల కోట్ల అవినీతి చోటు చేసుకుంది. ఈ మంత్రి కూడా ఇప్పుడదే తరహాలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు సమాయత్తమయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది.


ఎవరున్నారని కూపీ లాగితే..

అవసరం లేకున్నా డిమాండ్‌ను చూపిస్తూ.. కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో 33 కేవీ లైన్‌ పనులు సృష్టించారని విద్యుత్‌ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇందుకోసం రూ.343 కోట్ల వ్యయంతో పరికరాల కొనుగోలుకు ఎస్పీడీసీఎల్‌ టెండర్లు పిలిచింది. టెండర్‌ నోటిఫికేషన్‌ చూశాక.. కొందరు డిస్కం ఉద్యోగులు దీని వెనుక ఉన్న పెద్దలెవరా అని ఆరా తీశారు. పెద్ద గూడుపుఠాణీయే ఉందని వారికి తెలిసింది. ఈ మూడు జిల్లాల్లో విద్యుత్‌ ప్రవాహం తగ్గిపోతోందని.. లోవోల్టేజీ సమస్య కారణంగా బల్బులు కాలిపోతున్నాయని.. విద్యుత్‌ ఉపకరణాలు చెడిపోతున్నాయంటూ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎస్పీడీసీఎల్‌కు లేఖ రాశారు. విద్యుత్‌ ప్రవాహ సామర్థ్యాన్ని (కెపాసిటీ)ని పెంచితే.. లోవోల్టేజీ సమస్య ఉండదని సూచించారు. ఆ ఎమ్మెల్యేల సిఫారసు మేరకు రూ.343 కోట్లతో ఈ మూడు జిల్లాల్లో 33 కేవీ లైన్‌ వేసేందుకు ఎస్పీడీసీఎల్‌ కార్యాచరణ సిద్ధం చేసి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ తతంగాన్ని రాయలసీమ మంత్రి దగ్గరుండి నడిపించారని.. డిస్కంకు లేఖలు రాసినందుకు.. ఆ ఎమ్మెల్యేలకు తలో రూ.కోటి చెల్లించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లేఖకు కోటి ఇచ్చేటట్లయితే.. తమను కూడా అడిగితే ఇచ్చేవారిమని మరికొందరు ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు. ఇప్పుడు లేఖకు కోటి సంపాదించిన ఎమ్మెల్యేల గురించే రాయలసీమలో చర్చ జరుగుతోంది.

పనుల కార్యాచరణ ఇదీ..

పాత లైన్‌ స్థానంలో కొత్తది వేసేందుకుగాను పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి అప్పు తెచ్చి మరీ 33 కేవీ లైన్‌ను, 157 చదరపు మీటర్ల ఏఎల్‌ కండక్టర్‌ను వేసేందుకు ఎస్పీడీసీఎల్‌ సిద్ధమైంది. ఇందులో కడప డివిజన్‌ పరిధిలో 28 కిలోమీటర్లు, అన్నమయ్య జిల్లాలో 25 కిమీ, ప్రొద్దుటూరు డివిజన్‌ పరిధిలో 52.5 కిమీ మేర వైర్లను వేసేందుకు కార్యాచరణ రూపొందించింది. కొత్తగా 11 కేవీ ఇంటర్‌ లింకింగ్‌ పనుల కోసం వైర్లు, టవర్ల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న సమాచారం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) దృష్టికి వెళ్లిందని విద్యుత్‌ రంగ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చర్యలు చేపట్టేందుకు ఉన్నత స్థాయి అధికారులు సిద్ధపడుతున్నారని అంటున్నాయి.

Updated Date - Feb 14 , 2025 | 06:09 AM

News Hub