ఆర్యవైశ్యులను మోసం చేసిన వైసీపీ: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:51 AM
మంత్రి టీజీ భరత్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఆర్యవైశ్యులను మోసం చేసిన కారణంగా పార్టీ పరాజయాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. అనంతపురంలోని వైశ్య హాస్టల్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో, హాస్టల్ ఆధునికీకరణ పనులను ప్రారంభించారు

అధికారికంగా వాసవీమాత ఆత్మార్పణ దినం: ఎంపీ అంబికా
అనంతపురం కల్చరల్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘ఆర్యవైశ్యులను గత వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. అందుకే 11 సీట్లకే పరిమితమైంది’ అని మంత్రి టీజీ భరత్ విమర్శించారు. అనంతపురంలోని వైశ్య హాస్టల్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వసతి గృహం ఆవరణలో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆయనతోపాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. హాస్టల్‌లో ఆధునికీకరించిన గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ... ‘గత వైసీపీ పాలనలో ఆర్యవైశ్య మహాసభను నిర్వీర్యం చేయాలని చూశారు. అది వారి వల్ల కాలేదు. టీడీపీ హయాంలో కియ పరిశ్రమ ఏర్పాటుతో అనంతపురం జిల్లా రూపురేఖలే మారిపోయాయి. పక్కనే ఉన్న కర్నూలు జిల్లా కన్నా ఇక్కడి భూముల ధరలు నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది’ అని అన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఎన్నడూలేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో వాసవీమాత ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.