Government Land : ‘రూ.80 కోట్ల ఆస్తిపై’ కదిలిన యంత్రాంగం
ABN , Publish Date - Jan 09 , 2025 | 05:06 AM
కందుకూరు పట్టణ నడిబొడ్డున ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రూ.కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కొందరు చేస్తున్న యత్నాలపై ‘రూ.80 కోట్ల ఆస్తిపై గద్దలకన్ను’
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కందుకూరులో కలకలం
సమగ్ర నివేదికకు సబ్ కలెక్టరు ఆదేశం
కందుకూరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): కందుకూరు పట్టణ నడిబొడ్డున ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న రూ.కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేందుకు కొందరు చేస్తున్న యత్నాలపై ‘రూ.80 కోట్ల ఆస్తిపై గద్దలకన్ను’ అనే శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. అధికార యంత్రాంగం తక్షణ నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. పట్టణంలోని ఫాదర్ బంగ్లా స్థలం వ్యవహారంపై కోర్టు ఉత్తర్వులు, 2012లో ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని అందులోని భవనాలను సీజ్‌చేస్తూ అప్పటి జిల్లా కలెక్టరు ఇచ్చిన ఆదేశాలు, ఇతర వివరాలతో తక్షణం సమగ్ర నివేదిక అందజేయాలని కందుకూరు సబ్ కలెక్టరు తిరుమణి శ్రీపూజ కందుకూరు తహసీల్దార్‌ను, సబ్ కలెక్టరు కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆస్తి 22ఏ నిషేధిత జాబితాలో లేకుండా ఎలా పోయిందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. బుధవారం ఈ వ్యవహారంపై ఆమె మాట్లాడుతూ.. రికార్డుల సమగ్ర పరిశీలన అనంతరం కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులకు నివేదించి తక్షణం సర్వే నంబరు 232-2లో ఉన్న 8.70 ఎకరాల ప్రభుత్వ భూమిని 22ఏ నిషేధిత జాబితాలో చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రికార్డులు చూశాక ఫాదర్ బంగ్లాను సందర్శించి చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.