Share News

బ్యాంకు లోన్లు.. ఇంటి అవసరాలకు..

ABN , Publish Date - Jan 08 , 2025 | 01:38 AM

మాయమైన బియ్యం విక్రయించగా వచ్చిన నగదును బ్యాంకు లోన్ల చెల్లింపునకు, ఇంటి అవసరాలకు వాడినట్టు గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌ తేజ్‌ పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ నుంచి బియ్యం మాయం కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకుని ఏడు గంటలపాటు విచారించారు. ఉదయం 10 గంటలకు సబ్‌జైలు నుంచి వారిని ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

బ్యాంకు లోన్లు.. ఇంటి అవసరాలకు..

బియ్యం మాయం కేసులో నగదు వాడుకున్నట్టు చెప్పిన మేనేజర్‌ మానస్‌తేజ

పోలీస్‌ కస్టడీకి బియ్యం కేసు నిందితులు

గోడౌన్‌ మేనేజర్‌, మిల్లు యజమాని, లారీ డ్రైవర్‌ను విచారించిన పోలీసులు

ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ

నేడు జిల్లా కోర్టులో పైముగ్గురు నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ

మచిలీపట్నం, జనవరి7 (ఆంధ్రజ్యోతి): మాయమైన బియ్యం విక్రయించగా వచ్చిన నగదును బ్యాంకు లోన్ల చెల్లింపునకు, ఇంటి అవసరాలకు వాడినట్టు గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌ తేజ్‌ పోలీసు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ నుంచి బియ్యం మాయం కేసులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకుని ఏడు గంటలపాటు విచారించారు. ఉదయం 10 గంటలకు సబ్‌జైలు నుంచి వారిని ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ, మిల్లు యజమాని బొర్రా బాల ఆంజనేయులు, లారీ డ్రైవర్‌ బోట్ల మంగారావును సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ చేసిన పోలీసులు అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి పోలీసులు మీపై ఒత్తిడి తెచ్చేలా ప్రవర్తించారా.. మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని నిందితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు వీరిని మచిలీపట్నం స్పెషల్‌ సబ్‌జైలుకు తరలించారు.

బియ్యం మాయంపై లోతుగా విచారణ

బియ్యం మాయం కేసులో కస్టడీకి తీసుకున్న నిందితులను రాబర్ట్‌సన్‌పేట(ఆర్‌పేట) సీఐ ఏసుబాబు, మరికొందరు పోలీస్‌ అధికారులు ఏడుగంటల పాటు విచారించారు. విచారణ తీరును వీడియో తీశారు. న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ కొనసాగింది. ‘‘గోడౌన్‌ నుంచి బియ్యం తరలించాలని ఎవరు చెప్పారు. ఎప్పుడెప్పుడు, ఎక్కడికి బియ్యం తరలించారు. ఎవరికి విక్రయించారు. కిలోబియ్యం ఎంత ధరకు విక్రయించారు. వచ్చిన సొమ్మును ఎవరి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.’’ అనే అంశాలపై పోలీసులు నిందితులను ప్రశ్నించినట్లు తెలిసింది. గోడౌన్‌ యజమాని పేర్ని నాని, ఆయన భార్య పేర్ని జయసుధ బ్యాంకు ఖాతాలకు నగదు జమచేశారా అనేదానిపై లోతుగా విచారించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. బియ్యం విక్రయించగా వచ్చిన నగదులో కొంతమేర బ్యాంక్‌ లోన్‌లు కట్టేందుకు, ఇంటి అవసరాల నిమిత్తం వాడుకున్నట్లు ఈ కేసులో ఏ-2గా ఉన్న గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. కాగా, రిమాండ్‌లో ఉన్న పైముగ్గురు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ గురువారం జిల్లా కోర్టులో జరగనుంది. ఈ కేసులో ఏ-3గా ఉన్న పౌరసరఫరాలశాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డికి ఇప్పటికే బెయిల్‌ మంజూరైంది.

మేనేజర్‌, లారీ డ్రైవర్‌లను బలిపశువులను చేసేలా...

మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్‌ల నుంచి బియ్యం మాయం కేసులో కీలకపాత్రధారులను తప్పించేందుకు కొత్త కథనాలు తెరపైకి వస్తున్నాయి. గోడౌన్‌ మేనేజర్‌, లారీ డ్రైవర్‌లను బలి పశువులను చేసి పేర్ని కుటుంబం బయటపడేలా వ్యూహరచన జరుగుతున్నట్టు తెలుస్తోంది. గోడౌన్‌ పేర్ని నాని భార్య జయసుధ పేరున ఉండటంతో బియ్యం మాయం కేసులో ఆమెను ఏ1గా చేర్చారు. ఆమెకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఈ కేసులో గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌తేజను ఏ2గా, పౌర సరఫరాల శాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కోటిరెడ్డిని ఏ3గా, మిల్లు యజమాని బొర్రా బాల ఆంజనేయులును ఏ4గా, లారీడ్రైవర్‌ బోట్ల మంగారావును ఏ5గా చేర్చారు. గోడౌన్‌ మేనేజర్‌ మానస్‌ తేజ పోలీసులకు చిక్కిన సమయంలో తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి పేర్ని నాని పేరును ఏ6గా చేర్చి ఆయనపైనా కేసు నమోదు చేశారు. బియ్యం రవాణాలో, తూకంలో తేడాలుంటాయని, వాటిని ఎవరూ పట్టించుకోరని, అవకాశం ఉన్నపుడే ఎంతోకొంత సొమ్ము సంపాదించుకోవాలని గోడౌన్‌ మేనేజర్‌కు బియ్యం మాయం కేసులో నిందితుడిగా ఉన్న లారీడ్రైవర్‌ సూచించడంతోనే బియ్యంను అధికమొత్తంలో గోడౌన్‌ మేనేజర్‌ రవాణా చేయడానికి సహకరించారనే ప్రచారాన్ని వైసీపీ నాయకులు తెరపైకి తెస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నానిభార్య ఈ కేసులో ఏ1గా, ఏ6గా పేర్నినాని ఉండటంతో ఈ కేసులో వారి ఇరువురి ప్రమేయం లేదని చూపేలా తెరవెనుక ఒప్పందం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మానస్‌ తేజ పేర్ని కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు కావడంతోపాటు, వారివద్దనే ఏళ్లతరబడి పనిచేస్తుండటంతో ఈ కేసులో జైలుశిక్షపడినా అతని కుటుంబ పోషణకు ఇబ్బంది రానీయమని, తమపేర్లు ప్రస్తావించవద్దని తెరవెనుక ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గోడౌన్‌ మేనేజర్‌ను ఈ కేసులో మంగళవారం పోలీసులు విచారణ చేసిన సమయంలో గోడౌన్‌ యజమానులుగా ఉన్న పేర్ని నాని, ఆయన భార్య పేర్ని జయసుధ పేర్లు ప్రస్తావనకు వచ్చినపుడు సరైన సమాచారం చెప్పకుండా దాటవేత ధోరణితో వ్యవహరించినట్లు తెలుస్తోంది. పేర్ని నాని కుటుంబం ఈ కేసులో నుంచి ఎలాగైనా తప్పించుకునేందుకు తెరవెనుక పలువిధాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

నాని బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ 20కి వాయిదా

బియ్యం మాయం కేసులో ఏ6గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6న ఈ కేసు విచారణకు రాగా మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం ఈ కేసు విచారణను మరలా ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jan 08 , 2025 | 01:38 AM