Tourist Places in AP and Telangana: తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం.. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిచ్చే పర్యాటక ప్రాంతాలు ఇవే
ABN , Publish Date - Mar 24 , 2025 | 07:12 AM
వేసవి కాలం వచ్చేసింది.. ఈ సమ్మర్‌లో తక్కువ ఖర్చుతో అద్భుతమైన సందర్శనీయ స్థలాలు చూడాలని భావిస్తున్నారా.. అయితే తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లేసెస్ లిస్ట్ మీ కోసం..

వేసవి కాలం మొదలవుతోంది. మరి కొన్ని రోజులైతే విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు సమ్మర్ హలీడేస్ ప్రారంభం అయ్యాయి. మొత్తానికి ఏప్రిల్ చివరి నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. చాలా మంది వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. రోజు వారి జీవితానికి కాస్త గ్యాప్ ఇచ్చి.. వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తుంటారు. అయితే వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉంటే.. ఈ వేసవిలో.. చాలా తక్కువ ఖర్చుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మీ వెకేషన్‌ను ఎంజాయ్ చేయవచ్చు. మరి ఆ ప్రదేశాలు ఏంటి.. ఎలా వెళ్లాలి.. ఎంత ఖర్చవుతుంది వంటి వివరాలు..
అరకు వ్యాలీ
ఆంధ్రప్రదేశ్‌లో ట్రిప్పుకు వెళ్లాలనుకునేవారికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు అరకు వ్యాలీ. విశాఖపట్నం నుంచి 120 కిమీ దూరంలో ఉండే ఈ ప్రాంతం చల్లని వాతావరణం, పచ్చని కొండలు, కాఫీ తోటలతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. అరకు వ్యాలీ వెళ్లాలనుకునే వారి కోసం రైలు, బస్సు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ధరలు కూడా రూ.300-రూ.500 మాత్రమే ఉంటుంది. ఇక అక్కడ వసతి చూసుకుంటే.. గెస్ట్‌హౌస్‌లలో రోజుకు రూ.800-రూ.1200లోపు గదులు అందుబాటులో ఉంటాయి. అరకు వ్యాలీ వెళ్లే వారు.. బొర్రా గుహలు, కాటికి జలపాతం కూడా సందర్శించవచ్చు. ఇక భోజనం విషయానికి వస్తే.. స్థానికంగా ఉండే దుకాణాల్లో రూ.100-రూ.150 లోపు రుచికరమైన ఆహారం లభిస్తుంది.
లంబసింగి..
ఏపీలోని సందర్శనీయ ప్రదేశాల్లో అరకు వ్యాలీ తర్వాత వినిపించే పేరు లంబసింగి. ఇది విశాఖపట్నం నుంచి 100 కి.మీ దూరంలో ఉంటుంది. ‘ఆంధ్రా కాశ్మీర్’గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో.. 15-20 డిగ్రీల చల్లదనంతో ఆహ్లాదం కలిగిస్తుంది. ఇక్కడకు చేరుకోవడానికి బస్సు టికెట్ ధర రూ.200-రూ.400 మధ్య ఉంటుంది. అక్కడ బస చేయాలనుకుంటే.. రోజుకు రూ.1000లోపు హోమ్‌స్టేలు అందుబాటులో ఉన్నాయి. స్థానిక కూరగాయలు, పండ్ల మార్కెట్‌లు, చిన్న ట్రెక్కింగ్ స్పాట్‌లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు. భోజనం కూడా రూ.80-రూ.120లో అందుబాటులో ఉంటుంది.
హార్స్‌లీ హిల్స్
ఏపీలోని మరో పర్యాటక ప్రదేశం హార్స్‌లీ హిల్స్ . తిరుపతి నుంచి 150 కి.మీ.దూరంలో మదనపల్లి సమీపంలో ఉంటుంది. తక్కువ బడ్జెట్‌తో ట్రిప్పుకు వెళ్లాలనుకుంటే.. ఇది కూడా బెస్ట్ ప్లేస్‌గా చెప్పవచ్చు. ఇక్కడకు బస్సులో వెళ్లాలంటే టికెట్ రూ.300-రూ.500 మధ్య ఉంటుంది. వసతి కోసం రోజుకు రూ.1000లోపు గదులు దొరుకుతాయి. కొండల మధ్య సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఇక భోజనం కూడా రూ.100-రూ.150లో లభిస్తుంది.
అనంతగిరి హిల్స్
తెలంగాణలోని సందర్శనీయ ప్రాంతాల విషయానికి వస్తే.. ముందుగా వినిపించే పేరు అనంతగిరి హిల్స్. ఇది హైదరాబాద్ నుంచి 80 కి.మీ దూరంలో ఉంటుంది. తక్కువ ఖర్చుతో, త్వరగా వెకేషన్‌కు వెళ్లి రావాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక. ఇక్కడి అడవులు, చల్లని గాలి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బస్సు, షేర్డ్ క్యాబ్‌లో రూ.150-రూ.300లో ఇక్కడకు చేరుకోవచ్చు. రోజుకు రూ.700-రూ.1000లో గదులు లభిస్తాయి. నాగార్జునసాగర్ సమీపంలోని ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్, పక్షుల వీక్షణ ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానిక భోజనం రూ.100లోపే లభిస్తుంది.
ఈ ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అత్యంత సమీపంలోనే ఉండటమే కాక.. రూ.3000-రూ.5000లోపు 2-3 రోజుల ట్రిప్‌ను ఆస్వాదించేందుకు బెస్ట్ ఆప్షన్స్. ఈ వేసవిలో ఖర్చు గురించి ఆలోచించకుండా, సమీప గమ్యస్థానాలను సందర్శించి, కూల్‌గా ఎంజాయ్ చేసి రండి.
ఇవి కూడా చదవండి:
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి