పులివెందుల సమస్యల కోసం జగన్‌కు సీఎం అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా: బీటెక్ రవి
ABN , Publish Date - Feb 21 , 2025 | 06:29 AM
పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా’ అని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అన్నారు.

వేంపల్లె, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్ తన నియోజకవర్గం పులివెందుల సమస్యల పరిష్కారం కోసం సీఎం వద్దకు వస్తానంటే చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తా’ అని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి అన్నారు. వేంపల్లెలోని గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచితంగా కళ్ల జోళ్లు పంపిణీ చేసిన బీటెక్ రవి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నో ఏళ్ల నుంచి ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలంటే మాజీ సీఎం జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదు. అక్కడ ఎన్నో సమస్యలున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు ఉంది. ఆయన అసెంబ్లీకి పోకపోవడం వల్ల పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఉప ఎన్నికల్లో మళ్లీ జగన్ నిలబడ్డా గెలిచి అసెంబ్లీకి వెళ్లేది లేదు’ అని బీటెక్ రవి అన్నారు.