Share News

South Coast Railway: రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్‌

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:58 AM

విశాఖ కేంద్రంగా జోన్‌ కార్యాలయం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక తర్జనభర్జనలు, చర్చలు, ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్‌ను ఏపీ కోసం ఏర్పాటుచేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.

South Coast Railway: రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్‌

కొత్తగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు.. ప్రధాన కేంద్రం విశాఖ

అటు సికింద్రాబాద్‌.. ఇటు ఒడిశాలో

కలిసిన ఏపీ ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి

వాల్తేరు డివిజన్‌ రద్దు ఆలోచనకు స్వస్తి

ఇక విశాఖ డివిజన్‌గా అందుబాటులోకి

ఫలించిన కూటమి ఎంపీల ఒత్తిడి

కొత్త జోన్‌తో డివిజన్లలో మార్పులు

గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత

విజయవాడ డివిజన్‌ పరిధిలోకి

కొత్తగా కొండపల్లి - మోటుమర్రి సెక్షన్‌

విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్‌ కార్యాలయం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక తర్జనభర్జనలు, చర్చలు, ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్‌ను ఏపీ కోసం ఏర్పాటుచేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఏపీ పరిధిలో పనిచేస్తున్న డివిజన్లు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురికానున్నాయి. దేశంలోనే అత్యధిక ఆదాయం తెచ్చిపెడుతున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన కేంద్రంపై కూటమి ఎంపీల ఒత్తిడి ఫలించింది. ఈ డివిజన్‌ను ఇకపై విశాఖపట్నం డివిజన్‌గా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై నిజానికి గత నెల 10నే కేంద్రం నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆ వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్‌ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్‌లోను, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్‌ కేంద్రంగా నడుస్తున్న దక్షిణమధ్య రైల్వే జోన్‌లోను ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోని ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా జోన్‌’ ఏర్పాటుచేశారు. ఇందులో విశాఖపట్నం, (పాత వాల్తేరు డివిజన్‌లో కొంత భాగం), విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకల్లు డివిజన్‌కు కొంత కోత పడింది. ఇకపై రాష్ట్రంలో రైల్వేకు సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోనే పరిష్కారం లభించనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇదీ నేపథ్యం..: విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్‌ ఇస్తామని ఐదేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రకటించారు. నెల రోజుల క్రితం (జనవరి 8న) జోన్‌ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జోన్‌ ఏర్పాటులో భాగంగా 130 ఏళ్లుగా నడుస్తున్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు చాలాకాలం క్రితమే కేంద్రం ప్రకటించింది. దేశంలో అత్యధిక ఆదాయం సమకూర్చే పది డివిజన్లలో వాల్తేరు ఒకటి. ఏడాదికి రూ.10 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. దీనిని రద్దు చేస్తే విశాఖ జోన్‌కే అర్థం ఉండదని, ఆ డివిజన్‌ లేకుండా జోన్‌ అవసరం లేదని ఈ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌, శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ వాల్తేరు డివిజన్‌ ఉండాలని పట్టుబట్టారు. దీంతో ఎట్టకేలకు కేబినెట్‌ నిర్ణయాన్ని పక్కనపెట్టి రైల్వే బోర్డు ఇంకో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాల్తేరు డివిజన్‌ కొనసాగిస్తామని చెబుతూ, దానిని ఇకపై ‘విశాఖ డివిజన్‌’గా వ్యవహరిస్తామని వెల్లడించింది.

కుదింపులు.. పొడిగింపులు..: వాల్తేరు రైల్వే డివిజన్‌ 1893లో ఏర్పాటైంది. దీని పరిధిలో దువ్వాడ-విశాఖపట్నం-పలాస మెయిన్‌లైన్‌ 213 కిలోమీటర్ల మేర ఉంది. ఆర్‌వీ లైన్‌గా వ్యవహరించే రాయగడ-విజయనగరం-సింగాపురం రోడ్‌-తేరుబడి మార్గం 137 కిలోమీటర్లు, కేకే లైన్‌గా వ్యవహరించే కొత్తవలస-కిరండూల్‌ మార్గం పొడవు 446 కిలోమీటర్లు, కేఆర్‌ లైన్‌గా వ్యవహరించే కొరాపుట్‌-రాయగడ మార్గం 164 కి.మీ, ఇవి కాకుండా కొత్తవలస-సింహాచలం 22 కి.మీ, బొబ్బిలి-సాలూరు 18కి.మీ, నౌపడ-గుణుపూర్‌ లైన్‌ 90 కి.మీ... కలిపి మొత్తం 1,052 కి.మీ. రైల్వే లైన్‌ వాల్తేరు డివిజన్‌లో ఉంది. ఇందులో కొత్తవలస-కిరండూల్‌, కూనేరు-తెరువలి జంక్షన్‌, సింగాపూర్‌ రోడ్‌-కోరాపుట్‌ జంక్షన్‌, పర్లాకిమిడి-గుణుపూర్‌ మార్గాలను...సుమారు 680 కి.మీ. లైన్‌ను తీసుకువెళ్లి కొత్తగా ఒడిశాలో ఏర్పాటుచేసిన రాయగడ డివిజన్‌లో కలిపేశారు. ఇది తూర్పు కోస్తాజోన్‌లో ఉంటుంది. మిగిలిన ప్రాంతాలతో వాల్తేరు డివిజన్‌ 410 కి.మీ.కు కుదించుకు పోయింది. దీనిని విశాఖపట్నం డివిజన్‌గా వ్యవహరిస్తారు.


విశాఖ డివిజన్‌లో...

పలాస-విశాఖపట్నం-దువ్వాడ

కూనేరు-విజయనగరం

నౌపడ జంక్షన్‌-పర్లాకిమిడి

బొబ్బిలి జంక్షన్‌-సాలూరు

సింహాచలం నార్త్‌- దువ్వాడ బైపాస్‌

వడ్లపూడి-దువ్వాడ-విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు-జగ్గయ్యపాలెం

కుదించినా.. కలిసి వచ్చే నిర్ణయమే

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో గుంతకల్లు రైల్వే డివిజన్‌ కొంతమేర కోతకు గురైంది. ఈ డివిజన్‌లోని రాయచూరు-నాల్వార్‌ రైల్వే సెక్షన్‌ సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌లోకి (సౌత్‌ సెంట్రల్‌) కొత్తగా మారింది. రాయచూరు-నాల్వార్‌ సెక్షన్‌కు గుంతకల్లు డివిజన్‌లో 107.58 కిలోమీటర్ల లైన్‌, 12 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాగా, గతంలో గుంటూరు రైల్వే డివిజన్‌, హుబ్లీ డివిజన్ల ఏర్పాటు సందర్భంగా కూడా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు కోత వేశారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌, విజయవాడ తర్వాత పెద్ద విస్తీర్ణం కలిగిన మూడో డివిజన్‌ ఇదే. జోన్‌ మార్పు కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ కుదింపునకు గురైంది. అయినా, కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. సౌత్‌ కోస్టు రైల్వే జోన్‌ ఏర్పాటు వల్ల విశాఖపట్టణం-విజయవాడ-గుంతకల్లు రైల్వే డివిజన్ల మధ్య కనెక్టివిటీ, ట్రాఫిక్‌ పెరుగుతుంది. దీని వల్ల రాష్ట్ర రాజధానికి రైళ్లు లేక ఇబ్బందిపడుతున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ ప్రయాణికులకు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మేలు జరగనుంది. రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు అమరావతి, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ మినహా రోజువారీ ఎక్స్‌ప్రె్‌సలు లేక ఇబ్బందులు పడుతున్న సీమ ప్రజలకు కష్టాలు తీరే అవకాశాలు ఉన్నాయి. గతంలో రద్దయిన యశ్వంతపూర్‌-విజయవాడ పాసింజరుతోపాటు, మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంది.

‘అమరావతి’కి హారతి..

దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల పునర్విభజనలో భాగంగా విజయవాడ డివిజన్‌లో మార్పులు జరగనున్నాయి. విజయవాడ డివిజన్‌ను నౌపడ వరకు పొడి గిస్తూ పాత డీపీఆర్‌లో పొందుపరిచారు. తాజాగా విశాఖ డివిజన్‌ను (కొన్ని కుదింపులతో పూర్వ వాల్తేరు డివిజన్‌) ప్రకటించడం వల్ల తిరిగి దువ్వాడ వరకు విజయవాడ డివిజన్‌ (పాత రూట్‌) పరిమితం కానుంది. అమరావతి రైల్వే లైన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి వరకు ఉన్న 65 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను విజయవాడ డివిజన్‌లో కలపనున్నారు. రాజధానిగా ఉండే అమరావతిలో నూతన రైల్వేలైన్‌ సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఉండటం సరికాదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 03:58 AM