Share News

సోషల్‌ మీడియాను సక్రమంగా వాడదాం

ABN , Publish Date - Jan 02 , 2025 | 02:17 AM

‘మనం ఎవరినైనా ఏదైనా మాట అనే ముందు, వాళ్లు కూడా మనల్ని అలాగే అంటే మనకి బాధగా ఉంటుందా...

సోషల్‌ మీడియాను సక్రమంగా వాడదాం

అసభ్యకరమైన పోస్టులకు స్వస్తి చెబుదాం

చాగంటి కోటేశ్వరరావు సందేశం

అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ‘మనం ఎవరినైనా ఏదైనా మాట అనే ముందు, వాళ్లు కూడా మనల్ని అలాగే అంటే మనకి బాధగా ఉంటుందా... సంతోషం కలుగుతుందా? అన్నది ఆలోచించుకోవాలి’ అని ప్రవచన కర్త, ఆంధ్రప్రదేశ్‌ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రజలకు వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. ‘మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్లు బాధపడతారని తెలిసినప్పుడు అలాంటివి మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెళ్లా పెద్ద ధర్మం ఇదే. కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలి’ అని చాగంటి సూచించారు. ‘84 లక్షల జీవరాసుల్లో వాక్కు ఉన్నది ఒక్క మనుషుడికే. ఆ మనిషి తన వాక్కును పది మంది శాంతి... సంతోషాల కోసం వాడాలి. అంతేగాని ఇతరుల మనసులను గాయపర్చడానికి మాటల్ని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని సోషల్‌ మీడియాను సక్రమంగా వాడుకుందాం. ఇతరుల మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుంటుంబ సభ్యుల్ని, మహిళల్ని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనల్ని మనం నియంత్రించుకుని సభ్యత, సంస్కారాలను చాటుకుందాం’ అని చాగంటి పిలుపునిచ్చారు.

Updated Date - Jan 02 , 2025 | 02:17 AM