Share News

కోళ్లు..కోట్లు

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:32 AM

కోడి పుంజులు కత్తులు కట్టుకుని బరిలో దిగాయి. గెలుపుపై పందేలు పరుగులు తీశాయి. పేకాట, గుండాట వంటి జూద శిబిరాలు యథేచ్ఛగా కొనసాగాయి. షాపుల్లో విక్రయించాల్సిన మద్యం బరుల్లో ఏరులై పారింది. ఇది సంక్రాంతి సంబరాల్లో భోగి రోజున ఉమ్మడి కృష్ణాజిల్లాలో కనిపించిన దృశ్యాలు. జగ్గయ్యపేట నుంచి ‘జంక్షన్‌’ వరకు, బెజవాడ నుంచి బందరు వరకు ఎటుచూసినా కోడిపందేల సందడే సందడి. జూదాలు నిర్వహిస్తే లోపల వేస్తామని హెచ్చరికలు జారీ చేసిన పోలీస్‌శాఖ రాజకీయ బలం ముందు తలవంచింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల ముసుగులో కోట్ల రూపాయలు చేతులుమారాయి.

కోళ్లు..కోట్లు

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా కోడి పందేలు

తొలిరోజు రూ.20 కోట్లపైనే..

బరుల వద్ద బరితెగించిన ‘బెల్టు’

కంకిపాడులో పోటాపోటీగా బరులు

పందేలకు జతగా పేకాట, గుండాట

తెలంగాణ, ఒడిశా నుంచి వచ్చిన సందర్శకులు

కోడి పుంజులు కత్తులు కట్టుకుని బరిలో దిగాయి. గెలుపుపై పందేలు పరుగులు తీశాయి. పేకాట, గుండాట వంటి జూద శిబిరాలు యథేచ్ఛగా కొనసాగాయి. షాపుల్లో విక్రయించాల్సిన మద్యం బరుల్లో ఏరులై పారింది. ఇది సంక్రాంతి సంబరాల్లో భోగి రోజున ఉమ్మడి కృష్ణాజిల్లాలో కనిపించిన దృశ్యాలు. జగ్గయ్యపేట నుంచి ‘జంక్షన్‌’ వరకు, బెజవాడ నుంచి బందరు వరకు ఎటుచూసినా కోడిపందేల సందడే సందడి. జూదాలు నిర్వహిస్తే లోపల వేస్తామని హెచ్చరికలు జారీ చేసిన పోలీస్‌శాఖ రాజకీయ బలం ముందు తలవంచింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాల ముసుగులో కోట్ల రూపాయలు చేతులుమారాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం):

ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాలో తొలిరోజున రూ.20 కోట్ల వరకు పందేలు సాగాయి. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న బూదవాడ, గరికిపాడు, జగ్గయ్యపేటల్లో సోమవారం ఒక్కరోజే రూ.కోటి వరకు పందేలు నడిచాయి. ఎన్టీఆర్‌ జిల్లాతో పోల్చుకుంటే కృష్ణాజిల్లాలో అత్యధిక సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ఇక్కడ పందేలూ అదేస్థాయిలో జరిగాయి. బాపులపాడు మండలం అంపాపురం, కంకిపాడు మండలం ఈడుపుగల్లులో భారీగా పందేలు నడిచాయి. అంపాపురంలో రూ.10 లక్షలు ఆ పైబడిన పందేలకు రెండు ప్రత్యేక బరులను ఏర్పాటు చేశారు. తొలి రోజు 11 పందేలు జరిగాయి. రూ1-5లక్షల లోపు పందేల కోసం ఐదు బరులను కేటాయించారు. తెలంగాణ, ఒడిశా రాషా్ట్రలకు చెందిన మహిళలు ఇక్కడకు వచ్చి పెద్దఎత్తున పందేలు కాశారు. నాలుగు చిన్నబరులు, పదికిపైగా పేకాట శిబిరాలతోపాటు కేసినో ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మొదటి రోజున మూడు కోట్ల రూపాయల వరకు నగదు చేతులు మారింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున కార్లలో పందెం రాయుళ్లు ఇక్కడకు తరలివచ్చారు. నగదు రూపంలో కాకుండా టోకెన్లు అందించి మరీ పందెం రాయుళ్లను లోపలికి అనుమతించారు. అంపాపురంలో ఉన్న బరుల వద్ద క్యాసినో నిర్వహణకు రెండు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ అనుమతి ఉన్న వారిని మాత్రమే లోపలకు అనుమతించడానికి బౌన్సర్లను ఏర్పాటు చేశారు. పేకాట, లోపల-బయట, గుండాట, కోతముక్కల జూదాన్ని నిర్వాహకులు బహిరంగంగా నిర్వహించారు.

పోటాపోటీగా బరులు

కంకిపాడు మండలంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా బరులను ఏర్పాటు చేశారు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడిలోని పాముల కాల్వ వద్ద టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన బరులను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. పందేలు, జూదంతో బరుల వద్ద జాతర వాతావరణం కనిపించింది.

బరుల వద్ద మినీబార్‌లు

బరుల వద్ద మద్యం ఏరులై పారింది. బిర్యానీ స్టాల్‌, కూల్‌డ్రింక్స్‌, ఐస్‌క్రీమ్‌ స్టాల్స్‌ను పాటలు నిర్వహించి మరీ కేటాయించారు. సంక్రాంతి సంబరాల్లో ముక్క, మందు సాధారణం కావడంతో మద్యం స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మద్యం వ్యాపారులే ఈ స్టాల్స్‌ను నిర్వహించుకున్నారు. కొంతమంది మద్యం దుకాణాల్లో మందు కొనుగోలు చేసి సరుకును బరుల వద్దకు తీసుకొచ్చారు. అధిక ధరలకు ఈ మద్యాన్ని విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించారు.

- గుడివాడ నియోజకవర్గంలోని గౌతమ్‌ స్కూల్‌ వెనుక, బొమ్ములూరు, నందివాడ మండలం నందివాడ, పుట్టగుంట, పోలుకొండ, రుద్రపాక శివారుగొల్లగూడెం, తమిరిశలలో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు.. గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు, కౌతవరం, డోకిపర్రు, కూరాడ, కుచ్చికాయలపూడిలో బరులు ఏర్పాటు చేశారు. బరులవద్ద టోకెన్లు ఇచ్చి మరీ పేకాటలు నిర్వహించారు.

- మచిలీపట్నంలోని మేకావానిపాలెం, గోపువానిపాలెం, శ్రీనివాసనగర్‌, గోకవరం, రుద్రవరంలో బరులను ఏర్పాటు చేశారు. పేకాట కోసం ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి టోకెన్లు అందించి మరీ పేకాటను ఆడించారు. కోడిపందేల బరులకన్నా గుండాట శిబిరాలను అధికంగా ఏర్పాటు చేశారు.

- పెడన నియోజకవర్గంలో తోటమూల, కొంకేపూడి, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, అర్తమూరులో కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు. బంటుమిల్లి, పెందుర్రు, నాగేశ్వరరావుపేట, తుమ్మిడి తదితర ప్రాంతాల్లో బరులు సిద్ధం చేశారు. గూడూరు మండలం గూడూరు-పెడన రహదారి వెంబడి, పోసినవారిపాలెంలో బరులు ఏర్పాటు చేసి జోరుగా పందేలు, పేకాట శిబిరాలను కొనసాగించారు.

- అవనిగడ్డ నియోజవర్గంలోని పులిగడ్డ, పులిగడ్డపల్లెపాలెం, అవనిగడ్డ, పాతఎడ్లంక, గొట్టంమిల్లుల వద్ద బరులు ఏర్పాటు చేశారు. నాగాయలంక మండలంలో పాలిటెక్నిక్‌ కళాశాల పక్కనే కోడిపందేల బరిని ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. నియోజకవర్గంలో చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, కోడూరు, నాగాయలంక మండలాల్లో 20కిపైగా కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు.

- పామర్రు నియోజకవర్గంలో కొత్తపెదమద్దాలి, పెదపారుపూడిమండలం యలమర్రు, పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం, హనుమంతపురం, మొవ్వమండలం కోసూరు, భట్లపెనుమర్రు, తోట్లవల్లూరు మండలం గరికపర్రు, కొమ్ముమూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరులో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 14 , 2025 | 01:33 AM