Share News

75 ఏళ్ల బాబు

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:16 AM

చంద్రబాబు గొప్ప దార్శనికుడు అని ప్రపంచం కీర్తిస్తుంది. సంక్షోభాలను సైతం అనుకూలంగా మలచుకోగల నేర్పుగల నాయకుడు అని రాజకీయ పండితులు పొగుడుతారు. ఇంజనీరింగ్‌ చదువుకోలేదు కానీ టెక్నాలజీని ఔపోసన పట్టిన మేధావిగా అందరూ గుర్తిస్తారు. అభివృద్ధికి దారులు వెతకడానికి తపనపడే నారా చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలన్నీ చిన్ననాటి నుంచే ఉన్నాయి. నారావారిపల్లిలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు.. వెనుకబాటుతనంపై సీఎంగా చేస్తున్న పోరాటానికి బీజాలు బాల్యంలోనే ఉన్నాయని ఆయన చిన్ననాటి నేస్తాల మాటల్లో వెల్లడవుతోంది.. ఈ 75 ఏళ్ల నిత్య ఉత్సాహి బాల్య జ్ఞాపకాలను ఆంధ్రజ్యోతితో వారు పంచుకున్నారు.

75 ఏళ్ల బాబు
75 ఏళ్ల బాబు

మరో రెండు రోజుల్లో ఈ నవయవ్వనుడు 75వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నారు. పుట్టింది రైతు కుటుంబంలో. చదువుకున్నది ఎకనామిక్స్‌. వృత్తి రాజకీయం. అయినా టెక్నాలజీతో కలిసి పరుగులు తీస్తారు. నడిచేది వర్తమానంలో అయినా.. దృష్టి పాతికేళ్ల ముందుకే సారిస్తారు. ఈయన వయసును గెలిచిన రహస్యం.. బహుశా నిరంతర మేధోమథనం.

కయ్యాకాలువల్లో ఈతలు.. బడికి మైళ్ల నడకలు.. ఒళ్లొంచి చేసిన పొలం పనులు.. చదువుకునే రోజుల్లోనే

శ్రమదానాలతో పల్లెరోడ్లకు మెరుగులు.. బడికోసం జోలెపట్టి ఊరూరా, గడపగడపా తిరిగిన అనుభవం.. వెన్నంటి ఉండే స్నేహబృందాలు.. శీనయ్య మెస్‌లో భోజనాలు.. గురువులతో చర్చలు.. ప్రతి అడుగు నుంచీ చంద్రబాబు పాఠాలు నేర్చుకున్నారని ఆయన బాల్య స్నేహితులూ, ఆయనతో కాలేజీల్లో కలిసి చదువుకున్నవారూ, ఆయనకు చదువు చెప్పిన గురువులూ చెబుతున్నారు. విజనరీగా చంద్రబాబుకు బీజాలు చిన్ననాటి నుంచే పడ్డాయని వారు గుర్తు చేసుకుంటూ ఆంధ్రజ్యోతితో పంచుకున్న జ్ఞాపకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌ 20న చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన బంధుమిత్రుల ఇంటర్వ్యూలు ఈ రోజు నుంచీ వరుసగా అందిస్తున్నాం.

చంద్రబాబు గొప్ప దార్శనికుడు అని ప్రపంచం కీర్తిస్తుంది. సంక్షోభాలను సైతం అనుకూలంగా మలచుకోగల నేర్పుగల నాయకుడు అని రాజకీయ పండితులు పొగుడుతారు. ఇంజనీరింగ్‌ చదువుకోలేదు కానీ టెక్నాలజీని ఔపోసన పట్టిన మేధావిగా అందరూ గుర్తిస్తారు. అభివృద్ధికి దారులు వెతకడానికి తపనపడే నారా చంద్రబాబు నాయుడిలో ఈ లక్షణాలన్నీ చిన్ననాటి నుంచే ఉన్నాయి. నారావారిపల్లిలో మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు.. వెనుకబాటుతనంపై సీఎంగా చేస్తున్న పోరాటానికి బీజాలు బాల్యంలోనే ఉన్నాయని ఆయన చిన్ననాటి నేస్తాల మాటల్లో వెల్లడవుతోంది.. ఈ 75 ఏళ్ల నిత్య ఉత్సాహి బాల్య జ్ఞాపకాలను ఆంధ్రజ్యోతితో వారు పంచుకున్నారు.

ఆంధ్రజ్యోతి బ్యూరో తిరుపతి

భూములు, బావులున్నోడే!

చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడుకు రెండెకరాల భూమి మాత్రమే వుండేదని, అలాంటిది చంద్రబాబుకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని రాజకీయ ప్రత్యర్థులు తరచూ ఆరోపణలు, విమర్శలు చేస్తుంటారు. అవి విన్నప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది. మాది ఎ.రంగంపేట. చంద్రబాబుది నారావారిపల్లి. ఇద్దరం ఆరో క్లాసు నుంచీ కలసి చదువుకున్నాం. ఇప్పటికీ మా ఫ్రెండ్‌షిప్‌ కొనసాగతానే వుంది. మేము హైస్కూల్లో చదువుకునేటప్పటికే చంద్రబాబు వాళ్ళకు 15 ఎకరాల భూములు వున్నాయి. చెరకు, వరి, వేరుశెనగ పంటలు వేసేవాళ్ళు. ఎంతమంది ఎన్ని అన్నా చంద్రబాబు నోరు మెదపడు. నా చిన్నతనంలోనే 15 ఎకరాలు వుండేదని చెప్పి ప్రత్యర్థుల నోళ్ళు మూపించచ్చు కదా! కానీ అలా చేయడు. అదీ చంద్రబాబు!

పావలా వడ్డీకి అప్పులిచ్చేవాడు ఖర్జూరనాయుడు

చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు ఆ రోజుల్లోనే చుట్టుపక్కల రైతులకు అప్పులిచ్చేవాడు. నాకు బాగా గుర్తుంది. అవసరానికి వచ్చి అప్పు అడిగే వాళ్ళకు, ఆయన ఆ కాలంలోనే పావలా వడ్డీకి అప్పులిచ్చేవాడు.పంచె అంచు పక్కకు లాగి డ్రాయరు జేబు లో నుంచీ నోట్లు తీసి లెక్కబెట్టి ఇవ్వడం ఎన్నో సార్లు చూసినా.

12 కిలోమీటర్లు నడిచి బడికి

చంద్రబాబూ నేనూ రోజూ అడ్డదావన ఆరు కిలోమీటర్లు నడిచి చంద్రగిరి హైస్కూలుకు పోయేవాళ్ళం. మళ్ళా సాయంకాలం ఆరు కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరేవాళ్ళం. నారావారిపల్లి నుంచీ దర్శిపల్లి దళితవాడ, పుల్లయ్యగారిపల్లి, కొట్టాల గరండాలు (రైలు వంతెన), రెండు గుట్టల మధ్య ఆంజనేయస్వామి గుడి దాటి చంద్రగిరి హైస్కూలు గ్రౌండ్‌లోకి వెనక దారి నుంచీ చేరుకుంటా వుంటిమి. స్కూల్లో చంద్రబాబుది బి సెక్షన్‌. నాది సి సెక్షన్‌. క్లాసులోనే విడిగా కుర్చునేది. మిగిలిన సమయమంతా ఇద్దరం కలిసే తిరిగే వాళ్ళం.

పాస్‌ చేయలేదని స్కూలే మారిపొయినాడు

చంద్రగిరి హైస్కూలులో చంద్రబాబు చదివింది తొమ్మిది దాకానే. తొమ్మిదో తరగతి పరీక్షల్లో చంద్రబాబుకి మ్యాథ్స్‌లో పాస్‌ మార్కుల కంటే ఒక మార్కు తగ్గింది. పదహైదు ఇరవై మందిమి కలసి హెడ్‌మాస్టర్‌ పద్మనాభరెడ్డి దగ్గరికి పోయినాం. ఒక్క మార్కే..సార్‌.. పాస్‌ చేయండి సార్‌.. అని బతిమిలాడినాం. ఆయన మొండోడు. కాదనేసినాడు. ఇంక ఊళ్ళో పెద్దోళ్ళంతా కలసి ఆర్‌ఎంఎస్‌ నాయుడును కలిసి అడిగినారు. ఆయనా కుదరదనేసినాడు. దీంతో చంద్ర బాబు ‘నాకు చంద్రగిరి హైస్కూలే వద్దు’ అని టీసీ తీసుకునేసినాడు. తిరుపతిలో టీపీపీఎం హైస్కూలో చేరిపోయినాడు. చంద్రబాబుకు అంత పౌరుషం, పట్టుదల వుండేది.

మా సైకిలు జోరు

చంద్రబాబుకు వాళ్ళ నాయన తొమ్మిదో తరగతిలో కొత్త సైకిల్‌ కొనిచ్చినాడు. నాకు ఎనిమిదిలోనే సైకిల్‌ కొనిచ్చినారు. చంద్రబాబు, నేను ఇద్దరం కొత్త సైకిల్‌ మీద తెగ తిరిగేవాళ్ళం. అప్పట్లో చంద్రగిరి హైస్కూల్లో సరస్వతీ పూజకి పూలు తేవల్రా అని టీచర్లు చెప్పినారు. ఇంకేం కొత్త సైకిలు ఉండనే ఉంది. రయ్యిమని ఇద్దరం నారావారి పల్లికి చేరుకున్నాం. పుల్లయ్యగారిపల్లి కాలవలో గన్నేరు పూలు, మొగిలి పూలు పెరుక్కుని తిరిగి స్కూలుకు బయల్దేరినాము.ఎ.రంగంపేట దాటినాక జోడుబావుల దెగ్గిర సైకిల్‌ మీద నుంచీ పడిపోయినాం. ఇద్దరం ఒళ్లంతా దెబ్బలు తగిలించుకున్నాం. ఆ దినం కుంటుకుంటా పోతే స్కూల్లోనూ, ఇంట్లోనూ కూడా తిట్లు తప్పలా.

పీయూసీలోనే జన్మభూమి

చంద్రబాబు సీఎం అయినాక శ్రమదానం, జన్మభూమి కార్యక్రమాలు పెట్టింది రాష్ట్రంలో అందరికీ తెలుసు. అయితే మేము చదువుకునేటప్పుడే మా పల్లెల్లో అభివృద్ధి పనులకు శ్రమదానం చేయించాడు చంద్రబాబు. శేషాపురం, కందులవారిపల్లి, నారావారిపల్లి,ఎ.రంగంపేట గ్రామాల మీదుగా కొంటి కాలువ, బాపన కాలువ పారేవి. పీయూసీలో వుండగా అప్పటికి ఈ రెండు కాలువలూ పూడిపోయి, ముండ్ల చెట్లు పెరిగిపోయినాయి. కాలువలు కనిపించకుండాపోయాయి. అది చూసి చంద్రబాబు మమ్మల్నందరినీ వుడ్డ చేసి శ్రమదానంతో కాలువలు బాగు చేయిచ్చినాడు. అంతా పిల్లోల్లమే.. కాలవల్లోకి దిగి పూడిక తీసి, చెట్లన్నీ కొట్టేసి తిరిగి నీళ్ళు పారేదానికి అనువుగా చేసినాము.

మహర్జాతకుడు

చంద్రబాబు పుట్టింది తిరుపతి ప్రభుత్వాస్పత్రిలో...

మాది కందులవారిపల్లి. నారావారిపల్లికి ఫర్లాంగు దూ రంలో వుంటుంది. మా అక్క అమ్మణ్ణమ్మను నారావారిపల్లిలో ఇచ్చినారు. మా ముగ్గురు అన్నదమ్ముల్లో నేనే కడగొట్టు. అప్పటికి నేను పసోన్ని. అక్కకు సాయంగా వుండమని నన్ను నారావారిపల్లికి పంపిచ్చిరి. చంద్రబాబు పుట్టింది తిరపతి ప్రభుత్వాస్పత్రిలో. అప్పటికి రుయాస్పత్రి లేదు. చంద్రబాబుకు, నాకు వయసులో పెద్ద అంతరం లేదు. వాళ్ళింట్లోనే ఇద్దరం కలిసి పెరిగినాము. మా అక్క వాళ్ళది నా చిన్నతనంలోనే పెద్ద సేద్యం. పది ఆవులతో పాటు ఎనుములు, గొర్రెలు, పొట్టేళ్ళు వుండేటివి. గొర్రెలు, పొట్టేళ్ళు మేపే పని నాదే.

సాప మీద చంద్రబాబు... ఇంట్లోకి దూరిన పాము

చంద్రబాబు రోజుల బిడ్డగా వున్నపుడు కందులవారిపల్లిలోని మా ఇంట్లోనే అక్క వుండేది. ఇంట్లో సాప మీద చంద్రబాబును పడుకోబెట్టి బయట పనులు చేసుకుంటా వుంటే నాగుపాము ఇంట్లోకి దూరింది. ఆడోళ్ళంతా భయపడి గగ్గోలు పెట్టారు. మగోళ్ళు వచ్చి పామును పట్టి బయటకు తీసుకెళ్ళారు. దాని గురించి ఆడోళ్ళు గుర్తు చేసుకుని చెప్పుకునేది. అప్పట్లోనే వానికి (చంద్రబాబుకు) ఏందో మహర్జాతకం వుందనే వాళ్ళు.

రెండేండ్ల వయసులో

నీళ్ళ తొట్టిలో పడిపోయినాడు!

రెండేండ్ల వయసులో చంద్రబాబు నీళ్ళ తొట్టిలో పడిపోయినాడంట. వాళ్ళ చిన్నాయన గభాల్న బయటకు తీసినాడంట. ఆ తీసేటబ్బుడు తలకిందలుగా కాళ్ళు పట్టుకుని ఎలదీసినాడంట. దానికి వాళ్ళ నాయన ‘తలకిందలగా కాళ్ళు పట్టుకుని పైకెత్తతావా నా బిడ్డని’ అని తమ్ముని మీద గలాటకు పోయినాడంట.

చంద్రబాబు నొస్టన గాయం!

ఓ రోజు మా బావ ఖర్జూరనాయుడు సంతకు పోయుండి టెంకాయ తెచ్చినాడు. అప్పుడు నాకు పన్నెండేండ్లు వుంటాయి. చంద్రబాబుకు ఏడేండ్లు వుంటుంది. ఇంటి ముందర తిన్నె మీద టెంకాయ గొట్టినా. పగిలి సగం చిప్ప పైకి ఎగిరింది. అది పొయ్యి చంద్రబాబుకు నొస్టన తగిలింది. నెత్తురు బొడబొడా కారింది. అదిజూసి నాకు భయం పెరుక్కునింది. మా అక్కా బావ కొడతారేమోనని దూరంగా పరిగెత్తుకునిపొయినా. ఇప్పుటికీ చంద్రబాబుకు నొస్టన ఆ మచ్చ కనిపిస్తుంది.

రెండూళ్లలో పెరిగిన బిడ్డ

నారావారిపల్లికి, కందులవారిపల్లికి మధ్య పొలాలే అడ్డు. ఫర్లాంగు దూరానికి మించదు. మా అమ్మ, నాయన, మా అన్నలు ఇద్దురూ (చంద్రబాబు అమ్మమ్మ, తాత, మేనమామలు) చంద్రబాబును మురిపంగా చూసేవాళ్ళు. తక్కవంటే రోజులో రెండు సార్లన్నా ఆటికీ ఈటికీ తిరుగులాడేవాడు. రెండూర్లలో పెరిగినాడు.

ప్రతి శనివారం అడ్డదావన కొండకు

శనివారం వచ్చిందంటే అందురం కొండకు పోవల్సిందే. పెద్దా చిన్నా అంతా గుంపుగా బయల్దేరేది. నారావారిపల్లి నుంచీ ఉత్తరంగా అడ్డదారిన అడివి గుండా శ్రీవారి మెట్టు చేరుకుని అక్కడ నుంచీ మెట్ల దారిన కొండ ఎక్కుతా వుంటిమి.స్వామి దర్శనం చేసుకుని మళ్ళా అదే దావన ఇంటికి చేరుకు ంటా వుంటిమి.తిరుమల శనివారాలు వస్తే ప్రతి శనివారం పల్లిలో వాళ్ళు, చుట్టుపక్కల పల్లెల నుంచీ వచ్చే వాళ్ళతో కలసి గోయిందలు పెడతా కొండకు పోతా వుంటిమి. ఇంటి కాడ పెద్దోళ్ళు మనిషికి అర్ధరూపాయి,రూపాయి లెక్కన ఇచ్చేవాళ్ళు.మేము అది కూడా కర్చుపెట్టకుండా అట్నే ఎనిక్కి తెస్తావుంటిమి. కాలేజీలో చేరేదాకా చంద్రబాబు ప్రతి శనివారం కొండకు మాతో పాటు వచ్చేది.

ఎజ్డీ డబులింజను బైకు బుల్లోడు

మడక దున్నేవాడు!

చంద్రబాబు మా సొంత పెద్దనాయన కొడుకు. నాకంటే ఐదేండ్లు పెద్దోడు.వ్యవసాయ పనులు బాగా చేసేవాడు. చెరుకు సాగుకు వెనక మడక దున్నడం, కోతలయ్యాక వాది కట్టడం వంటి పనులు చేసేవాడు. అప్పట్లో చెరుకు గానుగ రెండు నెలలు ఆడతావుంటిమి.గానుగలో చెరుకు పెట్టే పని కూడా చంద్రబాబు ఇష్టంగా చేసేవాడు. అయితే ఇంట్లో వాళ్ళు చంద్రబాబుకు పెద్దగా సేద్యం పనులు చెప్పేవాళ్ళు కాదు. మేనమామలు కూడా ఆయన్ను బాగా ప్రేమగా చూసుకునేవారు.

పొట్టేళ్ళమ్మిన ఖర్జూర నాయుడు

చంద్రబాబు చదువుకునేటప్పటికి వాళ్ళకు పది ఆవులతో పాటు ఎనుములు, గొర్రెలు, పొట్టేళ్ళు వుండేవి.వాటిని నేనే మేపతా వుంటి. మళ్ళ రాన్రానూ మా పెద్దనాయన మనం మేపలేములేరా అని పాలికి వదిలేది మొదులుపెట్టినాడు. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినపుడు మనకెందుకని మా పెద్దనాయన ఏమాత్రం అడ్డం చెప్పలేదు. వున్న పొట్టేళ్ళన్నీ అమ్మేసి ‘ఎలక్షన్లలో ఖర్చు పెట్టుకో నాయనా’ అని రూ. 60 వేలు ఇచ్చినాడు. అప్పటికి ఇంట్లో రెండు లోడ్ల బెల్లం స్టాకు వుంది. అయితే రేటు లేదని బెల్లం అమ్మలేదు. లేకపోతే అదిగూడా ఇచ్చేసి ఉండేవాడు.

ఈత నేర్పించింది చంద్రబాబే!

చదువుకునేటప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లోల్లందరం బావులకాడికి పరిగెత్తేవాళ్ళం.గంటల కొద్దీ ఈతాడేవాళ్ళం. మా ఊరి పక్కనే తెల్లాకల శెట్టి బావి వుంది. ఆ బాయిలోనే అందరం ఈతాడేది. నా చిన్నప్పుడు ఊర్లో పిల్లకాయలందరినీ చంద్రబాబే వెనకంటీ పెట్టుకోని బాయి కాడకు పిల్చకపోయేవాడు. అప్పట్లో పిల్లోల్లకు ఈత నేర్పించింది ఆయనే.

పీజీలో ఎజ్డీ డబులింజన్‌ బైక్‌

చంద్రబాబు తిరపతిలో పీజీ చేసేటపుడు ఎప్పుడు చూసినా వెనకంటీ పదీ ఇరవై మంది పిల్లోల్లు వుండేది. ఎప్పుడన్నా ఇంటికొస్తే కూడా వెనకంటీ పది మందికి తక్కవ లేకుండా వచ్చేవాళ్ళు. మా పెద్దనాయన కొడుకును అట్ల చూస్తే చానా సంతోషపడిపోయేవాడు. కొడుకు నలుగురిలో దర్జాగా వుండల్లని ఎజ్డీ బైక్‌ కొనిచ్చినాడు. అది డబులింజన్‌ బండి. బుల్లెట్‌ కంటే ఎక్కువ సౌండ్‌ వచ్చేది. బడబడమని సౌండ్‌తో ఆ బండి మీద కొడుకు పొయ్యేది చూసి మా పెద్దనాయన మురిసిపొయ్యేవాడు.

బడికోసం జోలె పట్టాడు

శ్రమదానంతో సొంతూరికి రోడ్డు

నారావారిపల్లి నుంచీ మా కందులవారిపల్లి అర కిలోమీటరు దూరంలో వుంటుంది. మేమిద్దరం శేషాపురంలో ప్రైమరీ స్కూలు, తర్వాత తిరుపతిలో పీయూసీ, డిగ్రీలలో క్లాస్‌మేట్స్‌. అంతకంటే దగ్గర బంధువులం కూడా. దానివల్ల చిన్నప్పటి నుంచీ కలసి పెరిగాము. కలసి చదువుకున్నాం. చంద్రబాబుతో జ్ఞాపకాలు ఒకటా రెండా?

రోడ్డు బాగయ్యింది

చంద్రబాబు పీజీ పూర్తి చేశాక 1977లో యూత్‌ కాంగ్రె్‌ స్‌లో చురుగ్గా పనిచేశాడు.ఆ సంవత్సరంలోనే పులిచెర్ల సమితి యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడయ్యాడు. శ్రమదానంతో గ్రామాల్లో యువత అభివృద్ధి పనులు చేపట్టాలని అప్పట్లో సంజయ్‌ గాంధీ పిలుపిచ్చారు. దానిని చంద్రబాబు పట్టుదలగా తీసుకున్నాడు. అప్పట్లో ఎ.రంగంపేట నుంచీ నారావారిపల్లి, శేషాపురం మీదుగా భీమవరం వరకూ ఐదు కిలోమీటర్ల రోడ్డు చాలా అధ్వానంగా వుండేది. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లు పోవడం కూడా కష్టమయ్యేది. రోడ్డంతా బురదగా వుండేది.చంద్రబాబు స్నేహితులందరినీ పోగేసి ఈ రోడ్డు బాగు చేసే పనికి పూనుకున్నాడు. అందరం నడుములు వంచాం.ఆయా గ్రామాల్లోని యువకులు వచ్చి కలిశారు. ఇలా ఐదు కిలోమీటర్ల రోడ్డు బాగు చేశాం.

హైస్కూలు కోసం జోలె పట్టుకున్నాడు

ఎ.రంగంపేటలో అప్పర్‌ ప్రైమరీ స్కూలు మాత్రమే వుండేది. పిలకాయల పై చదువులకు ఇబ్బందిగా వుండేది. చంద్రగిరికి పోవల్లంటే వంకలు, కాలవలు దాటల్ల. తిరుపతి పోవల్లంటే దూరాభారం. దాన్ని హైస్కూలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని పెద్దోళ్ళంతా కలిసి చిత్తూరులో జడ్పీ ఆఫీసుకు పోయి అర్జీ ఇచ్చినారు. రూ. 8 వేలు కార్పస్‌ ఫండ్‌ కడితే అప్‌గ్రేడ్‌ చేస్తామని చెప్పినారంట. అంత దుడ్లు ఎవురిచ్చేది? చంద్రబాబు అప్పుడు తిరుపతిలో పీజీ చేస్తా ఉండాడు. మమ్మల్నందరినీ కలుపుకున్నాడు. రంగంపేట నుంచీ నారావారిపల్లి, కందులవారిపల్లి, శేషాపురం, భీమవరం దాకా జోలి పట్టుకుని తిరిగితే రూ. 5 వేలు వసూలైంది. తక్కువ పడిన మిగతా డబ్బు మేమందరం తలాకొంత వేసుకుని జడ్పీలో కట్టినాం.దాంతో రంగంపేట అప్పర్‌ ప్రైమరీ స్కూలు హైస్కూలు అయ్యింది.

కోళ్ళ ఫారం డబ్బంతా శీనయ్య మెస్‌కే!

చంద్రబాబుకు చుట్టూ దండిగా స్నేహితులుండాల్సిందే. పీయూసీ రోజుల నుంచీ ఇంతే. స్నేహితుల్లో ఎవరి చేతి లో డబ్బులున్నా అందరం పొలోమని శీనయ్య మెస్సుకు పోయి తినేసేది.డిగ్రీలో చేరినాక ఫ్రెండ్స్‌ ఇంకా ఎక్కువైనారు. శీనయ్య మెస్సుకు పొయ్యేది కూడా ఎక్కువైంది. అప్పట్లోనే చంద్రబాబు నారావారిపల్లిలో కోళ్ళఫారం పెట్టినాడు. వెయ్యి కోళ్ళు వుండేవి. ఆ కోళ్ళు అమ్మిన డబ్బంతా శీనయ్య మెస్సుకే ఖర్చు పెట్టుంటాడు.

చంద్రగిరి ఓట్ల ఆచారమే మార్చేసినాడు

చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు పోటీ చేయక ముందు దాకా ఎలక్షన్లలో పోటీ చేసిన నాయకులెవురూ ఇండ్లకు పోయి ఓట్లు అడిగిందే లేదు. ఊరికి ఒకరిద్దరు పెద్ద మనుషులుండేవాళ్ళు. వాళ్ళ ఇండ్లకు పోయి మాట్లాడుకోని వెళ్ళిపోయేవారు. ఆ ఊరి పెద్దలు చెప్పినట్టు ఊళ్ళో జనం ఓట్లు వేసేవాళ్ళు. 1978లో చంద్రబాబు ప్రతి ఇంటి గడపా తొక్కి ఓట్లు అడిగినాడు.ఇంటి ముందరకొచ్చి ఓటు అడిగినాడే అని చానా మంది ఆయనకు ఓట్లేసినారు.

Updated Date - Apr 18 , 2025 | 01:16 AM