‘కొండ’కు వెళుతున్నారా?
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:17 AM
తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కార్లలో వస్తున్నారా? అయితే కార్ల యజమానులు, డ్రైవర్లు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధనరాజు సూచించారు.
వాహన చోదకులూ జాగ్రత్తలు తీసుకోండి
కార్ల దగ్ధం నేపథ్యంలో ఎస్పీ సూచన
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కార్లలో వస్తున్నారా? అయితే కార్ల యజమానులు, డ్రైవర్లు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్ధనరాజు సూచించారు. ఇటీవల రెండు కార్ల దగ్ధం నేపథ్యంలో డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల ఎండా కాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇలా కార్లు కాలడానికి కారణాలపై నిపుణులను సంప్రదించగా పలు కారణాలు చెబుతున్నారు. సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇంజన్ అప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది. ఆ వెంటనే తిరుమల ఘాట్ ఎక్కడం ప్రారంభిస్తే ఇంజన్, ట్రాన్సిమిషన్‌కు అధిక వేడి వస్తుంది. దీంతో పాటు వంకర రోడ్లు, ఘాట్ రోడ్డు ఎక్కాలంటే అధిక ఇంజన్ శక్తి అవసరం. డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేరులో వెళుతుంటారు. దీనివల్ల ఆర్‌పీఎం పెరిగి వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలూ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. తీర్థ యాత్రల్లో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్ళడం సాధారణం. పాత వాహనాలు, సరిగా సర్వీసు చేయని వాహనాల్లో కూలెంట్ లీక్‌లు, తక్కువ స్థాయి కూలెంట్ ఉండడం, పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు, థెర్మోస్టాల్ లోపాలు, పాడైన ఇంజన్ ఆయిల్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. టూర్‌కు వచ్చే ముందుగా బండిని సర్వీసింగ్ చేయించాలి. రేడియేటర్ లీకేజీలు తనిఖీ చేయాలి. ఫ్యాన్ బెల్టు సరిచూసుకోవాలి. బ్యాటరీల్లో డిస్టిల్ వాటర్ తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ప్రతి రెండు గంటలకు ఒకసారి అయిదు నిమిషాల పాటు వాహనం ఆపాలి. వాహనాల డ్యాష్ బోర్డుల మీద థర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తుండాలి. ఘాట్ ఎక్కే సమయంలో ఏసీ ఆఫ్ చేయాలి’ అని ఎస్పీ హర్షవర్ధనరాజు వివరించారు.