గొలుసు దొంగలు మళ్లీ విజృంభించారు!
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:08 AM
గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లే ముఠా జిల్లాలో వరుసగా ఏడు దొంగతనాలు చేసి చెలరేగిపోయింది. పూతలపట్టులో అయితే ఓ మహిళ తన చైన్‌ను రక్షించుకోబోయి దొంగల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. 25 రోజుల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మకాం వేసిన పోలీసుల స్పెషల్ టీమ్ నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుంది.
విజయపురం, నగరి, సోమల ప్రాంతాల్లో వరుస దొంగతనాలు
గత అక్టోబరు, నవంబరులో ఏడు ఘటనలు
రక్షించుకోబోయి ఓ మహిళ మృతి
బయట తిరగాలంటే భయపడుతున్న మహిళలు
చిత్తూరు, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): గతేడాది అక్టోబరు, నవంబరు నెలల్లో మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కెళ్లే ముఠా జిల్లాలో వరుసగా ఏడు దొంగతనాలు చేసి చెలరేగిపోయింది. పూతలపట్టులో అయితే ఓ మహిళ తన చైన్‌ను రక్షించుకోబోయి దొంగల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. 25 రోజుల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మకాం వేసిన పోలీసుల స్పెషల్ టీమ్ నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుంది. అలాంటి దొంగతనాలే మళ్లీ జిల్లాలో ప్రారంభమయ్యాయి. విజయపురం, నగరి, సోమల ప్రాంతాల్లో వరుసగా మహిళల మెడల్లో బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దీంతో మహిళలు బయట తిరగాలంటేనే భయపడుతున్నారు.
సోమల మండలం వంగసానివారిపల్లెకు చెందిన సంపూర్ణమ్మ ఊర్లో నుంచి పొలం వద్దకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరింది. సోమల- పెద్దఉప్పరపల్లె రోడ్డులో వెళ్తుండగా.. ఇద్దరు యువకులు బైకులో వచ్చి ఆమెతో మాటలు కలిపారు. మెడలోని 33 గ్రాముల చైనును లాక్కెళ్లి పోయారు. దీంతో ఆమె సోమల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నగరి మండలం అనంతప్పనాయుడు కండ్రిగ సమీపంలో తమిళనాడుకు చెందిన ప్రియ, సెల్వరాజ్ దంపతులు ఎప్పటిలాగే గత ఆదివారం నగరిలోని చర్చికి వచ్చారు. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి బైకులో వెళ్తుండగా.. ఇద్దరు యువకులు బైకులో వచ్చి ప్రియ మెడలోని 24 గ్రాముల చైనును లాక్కెళ్లిపోయారు.
15 రోజుల కిందట విజయపురం మండలం పన్నూరు సబ్‌స్టేషన్ వద్ద సామరెడ్డికండ్రిగకు చెందిన అనిత నగరికి వెళ్లేందుకు బస్సు కోసం నిల్చొని ఉంది. ఇద్దరు యువకులు హిందీలో మాట్లాడుతూ ఆమె వద్దకు వచ్చి మెడలోని 23 గ్రాముల గోల్డ్ చైను లాక్కెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
ఫ ముఠాతో పోరాడి మరణించిన ప్రమీల
ఐరాల మండలం వైఎస్ గేటుకు చెందిన ప్రమీల (55) గతేడాది అక్టోబరు 26న స్కూటీలో పూతలపట్టుకు బయల్దేరింది. చిత్తూరు- పీలేరు హైవేపై తలపులపల్లె వద్ద వస్తుండగా.. ఎదురుగా కేటీఎం బైకులో వస్తున్న ఇద్దరు యువకులు ఆమెను అడ్రస్ కోసమంటూ నిలిపారు. అనుమానం వచ్చిన ప్రమీల మెడలోని చైన్‌ను గట్టిగా పట్టుకుంది. అయినా ఆ దుండగులు ఆమె మెడను గట్టిగా పట్టుకుని లాక్కెళ్లారు. చైన్‌ను మాత్రం తీసుకెళ్లలేకపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ రాణిపేట సీఎంసీలో చికిత్స పొందుతూ మరణించింది.
కొత్త ముఠానా? పాతదేనా?
గతేడాది జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి చిత్తూరు స్పెషల్ బ్రాంచి పోలీసు బృందం సుమారు 25 రోజుల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మకాం వేసి అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుంది. వారిలో శివకుమార్ అనే ముఠా నాయకుడిపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 40కిపైగా కేసులున్నాయి. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. సమయం కూడా ఎక్కువగా పట్టింది. తాజాగా జరుగుతున్న దొంగతనాలకు, ఆ ముఠాకు సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ముఠా వరుస ఘటనలకు పాల్పడుతుంది, పెద్ద చైన్లనే టార్గెట్ చేసుకుంటుంది. తాజా దొంగతనాల్లో పాత ముఠా ఆనవాళ్లు కనిపించడం లేదు.
గతేడాదిలా పట్టించుకోని పోలీసులు...
గతేడాది చివర్లో జరిగిన వరుస దొంగతనాలు పోలీసులను ఓ రకంగా ఇబ్బంది పెట్టాయి. వరుసగా దొంగతనాలు జరగడం ఓ అంశమైతే, మహిళ ఏకంగా ప్రాణాలు కోల్పోవడం మరో అంశం. అందులోనూ ఆ ముఠా ఎక్కడా ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని స్పెషల్ బ్రాంచి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలను పోలీసులు సీరియ్‌సగా తీసుకోలేదని తెలుస్తోంది. నగరి, విజయపురం, సోమల సంఘటనలపై స్థానిక పోలీసులే విచారిస్తున్నారు. గతేడాది తరహాలో తీవ్ర నష్టం జరక్కముందే జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులు దృష్టి సారించి ముఠాను పట్టుకోవాల్సిన అవసరం ఉంది.