ఇంకెంతకాలం ఈ బాధలు?
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:13 AM
వేల ఎకరాలకు సాగునీరందిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లక్రితం పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె, సోమల మండలం ఆవులపల్లె, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది.ఈ రిజర్వాయర్ల పనుల కాంట్రాక్టు నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ సంస్థ చేజిక్కించుకుంది.వీటిలో నేతిగుట్లపల్లె వద్ద ఒక టీఎంసీ నీటి సామర్ధ్యంతో 900 ఎకరాల ముంపుభూమిలో 2400 మీటర్ల పొడవు, దాదాపు 5 మీటర్ల ఎత్తుతో రూ.717.80 కోట్ల అంచనాతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను 80 శాతం పూర్తి చేసింది.
-భూ పరిహారం కోసం నేతిగుట్లపల్లె
రిజర్వాయర్ ముంపు బాధితుల ఆవేదన
-వైసీపీ సర్కారు హయాంలో అష్టకష్టాలు
-రిజర్వాయర్ పనులతో సేద్యానికి
పనికిరాకుండా పోయిన పొలాలు
ఏడాదికి మూడుపంటలు పండే భూములు.....90శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు....గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో వందల ఎకరాల పొలాలు లాక్కున్నారు.ముందు పరిహారం సంగతి తేల్చండంటూ అడ్డుపడ్డ రైతులపై దౌర్జన్యాలు జరిపారు.రిజర్వాయర్ పనులు కోర్టు ఉత్తర్వులతో ఆగిపోయినా అప్పటికే జరిగిన పనులతో సేద్యానికి పనికిరాకుండా పోయిన భూములను చూసి నిస్సహాయంగా మిగిలిపోయిన రైతులు ప్రస్తుత ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారు.
పుంగనూరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : వేల ఎకరాలకు సాగునీరందిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లక్రితం పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె, సోమల మండలం ఆవులపల్లె, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టింది.ఈ రిజర్వాయర్ల పనుల కాంట్రాక్టు నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ సంస్థ చేజిక్కించుకుంది.వీటిలో నేతిగుట్లపల్లె వద్ద ఒక టీఎంసీ నీటి సామర్ధ్యంతో 900 ఎకరాల ముంపుభూమిలో 2400 మీటర్ల పొడవు, దాదాపు 5 మీటర్ల ఎత్తుతో రూ.717.80 కోట్ల అంచనాతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను 80 శాతం పూర్తి చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా పనులు
రిజర్వాయర్ నిర్మాణానికి రైతులకు చెందిన భూమి ఎంతకావాలనేది ముందు నిర్ణయించాలి.ఎంతమంది ఆస్తులు, ఇళ్లు కోల్పోతారో తేల్చాలి.వారందరికీ నోటీసులు ఇవ్వాలి. మార్కెట్ ధర ప్రకారం ఎంత పరిహారం ఇచ్చేది తెలియజేయాలి.అయితే ఇవేమీ లేకుండా పనులు చేపట్టారు. 845 మంది రైతులకు చెందిన 827 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు.రిజర్వాయర్ ముంపులో కట్టసమీపంలోనే ఏటిగడ్డ కమ్మపల్లె(జోగులగడ్డ)లో 16 ఇండ్లలో దాదాపు 80 మంది జీవిస్తున్నారు. గ్రామంలోని రైతులు 20 వ్యవసాయ బోర్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు.రిజర్వాయర్ నిర్మాణంతో తమ ఇళ్లు , పొలాలు నీటమునుగుతాయని , కాబట్టి తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.భారీ వర్షాలు కురిసి పైభాగంలోని ఏతాలవంక నుంచి వరదనీరు వస్తే గ్రామం నీటిలో మునిగిపోతుందని వివరించారు.అయితే అప్పటి పాలకులు కానీ, అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు.అధికారుల బృందం హడావుడిగా పొలాలపై పడి రైతులను సంప్రదించకుండానే సర్వేలు చేసి హద్దులు ఖరారు చేయడం, విద్యుత్ లైన్లు తొలగించడం, మట్టి తవ్వకాలు చేపట్టడం జరిగిపోయింది.చెప్పాపెట్టకుండా తమ పొలాల్లో జొరబడడం ఏంటని సర్వే జరిగిన ప్రాంతాల్లో పొలాల యజమానులు అడ్డుకున్నారు. ఎవరికి చెందిన పొలం ఎంత ముంపునకు గురవుతుంది, ఎంత పరిహారం ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, తమ జీవనానికి ప్రత్యామ్నాయంగా ఏమిస్తారు....తదితర ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవరకు పనులు నిలిపేయాలని రైతులు ఆక్షేపించారు.అయితే ఆందోళనలు అరణ్యరోదనే అయ్యాయి. పీఎల్‌ఆర్ ప్రాజెక్టు భారీ యంత్రాలను రంగంలోకి దించి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ఉన్నతాధికారులు సైతం వారికి అడ్డుచెప్పే పరిస్థితి లేకపోవడంతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది.వారి పొలాల్లోకి కూడా స్వేచ్ఛగా వెళ్లలేక అక్కడ పనిచేసే వారి అనుమతితో వెళ్లాల్సిన దీనస్థితి నెలకొంది. గట్టిగా మాట్లాడితే వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెట్టించడంతో పాటు దౌర్జన్యాలకు దిగేవారని, మీ భూములను ఆన్‌లైన్ నుంచి తొలగిస్తామని, పరిహారం ఇవ్వబోమని, భూమి అసలు మీది కాదు వేరే వారిదంటూ పెద్దిరెడ్డి పేరుచెప్పి భయపెట్టేవారని రైతులు ఆవేదన చెందేవారు. తమ పొలాల్లో పైౖపులు తొలగిస్తామని, డ్రిప్ పరికరాలు తీసుకుంటామని, చెట్లు కొట్టుకుంటామని రైతులు ప్రాధేయపడినా మీకు సంబంధం లేదని, ముందు వెళ్లకపోతే ఇక్కడే పూడ్చేస్తామంటూ భయపెట్టేవారని వారు చెప్పేవారు.నేతిగుట్లపల్లె రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం ముంపు, సమీప పొలాల్లో భారీ యంత్రాలతో పెద్దపెద్ద గోతులు తవ్వడంతో ప్రస్తుతం ఆ భూములు వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయి. అప్పటి కలెక్టర్ హరినారాయణ, ఆర్డీవోలు, జలవనరులశాఖ అధికారులు రిజర్వాయర్ పనులను పరిశీలించడం తప్ప ముంపు రైతులతో చర్చించలేదు. రైతులు పరిహారం గురించి అడిగితే నెల రోజుల్లో ఇస్తామని చెప్పడం తప్ప ఒక్క రైతుకూ ఇవ్వలేదు.ఏటిగడ్డకమ్మపల్లె, ఇర్లవాండ్లపల్లె,దిగువకొండమీద ఇళ్లు, ఆరంట్లపల్లె, ఆవులవారిపల్లె, ఎర్రగుంట్లపల్లె, నేతిగుట్లపల్లె, దిగువ చింతలవారిపల్లె, పట్రపల్లె గ్రామాలకు చెందిన 150 మంది రైతులకు చెందిన దాదాపు 800 ఎకరాలు భూమి, దాదాపు 50 వ్యవసాయ బోర్లుకు పరిహారం ఇవ్వాల్సిఉంది.
ఎన్జీటీతో ఆగిన రిజర్వాయర్ పనులు
సోమల మండలం ఆవులపల్లె వద్ద సీతమ్మ చెరువుపై రిజర్వాయర్ నిర్మిస్తే రైతుల భూములు, గ్రామాలు నీట మునగడమేకాక వేలసంఖ్యలో చెట్లు నాశనమవుతాయని, కట్ట వెనుక ప్రభుత్వ భూమిలో నిర్మిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)లను ఆశ్రయించారు.దీంతో రిజర్వాయర్ల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని 2023 మే 11వ తేది ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ పనులు ఆపేయాలని తీర్పు ఇచ్చింది. ఒకే జీవోతో ఆవులపల్లె, నేతిగుట్లపల్లె, ముదివేడు రిజర్వాయర్లు మంజూరు కావడంతో మూడుచోట్లా పనులు ఆగిపోయాయి. నేతిగుట్లపల్లె వద్ద రిజర్వాయర్ పనులు 80శాతం పూర్తి కావడంతో రైతుల పరిస్థితి ఘోరంగా మారింది.రిజర్వాయర్ పనులు ఆగిపోయినా పొలాల రూపురేఖలు మారిపోయి సేద్యానికి పనికిరాకుండా పోయాయి.అటు పరిహారం అందక...ఇటు సేద్యం చేసుకోలేక జీవనాధారం కోల్పోయిన రైతులు కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పదెకరాల భూమి లాక్కున్నారు
రిజర్వాయర్ కట్టకిందే మాకు పదెకరాల భూమి ఉండేది. మాకు తెలియకుండానే సర్వే చేసుకున్నారు. భూమిలోకి చొరబడి పనులు చేపట్టారు. అడ్డుకునేందుకు వెళితే దౌర్జన్యం చేసి తరిమేశారు.వీఆర్వో నుంచి కలెక్టర్ వరకూ ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఎవరూ పట్టించుకోలేదు.గతంలో రిజర్వాయర్ వద్ద తిరగాలన్నా భయపెట్టే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. మా భూములకు పరిహారం ఇచ్చి చంద్రబాబు ఆదుకోవాలి.
- కె.వెంకట్రమణ, ఆరంట్లపల్లె
ఇప్పుడైనా న్యాయం జరిగేనా?
ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఎందుకూ పనికిరాకుండా గోతులతో దర్శనమిస్తున్నాయి. రైతుల పేరు చెప్పి కాంట్రాక్టు పనులు దక్కించుకున్న పెద్దలు మా నోట్లో మట్టి కొట్టారు. పరిహారం ఖరారు చేయకుండా కాంట్రాక్ట్ పనులు మాత్రం 80శాతం చేశారు. ఇప్పుడైనా మా భూములకు పరిహారం ఇచ్చి, పునరావసం కల్పించాలి.
- రమణమూర్తి, ఏటిగడ్డకమ్మపల్లె
పెద్దిరెడ్డి ఖాళీ చేసుకుని వెళ్లారు
మా భూములకు పరిహారం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పనులతో పెద్దిరెడ్డి ఖజానా ఖాళీ చేసుకుని వెళ్లారు. అప్పట్లో మమ్మల్ని చెడగొట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వద్ద పరిహారం ఇప్పించుకోవాలని సలహాలిస్తున్నారు.పరిహారం వారం రోజుల్లో వస్తుందని,సంతకాలు పెట్టాలని గతంలో తహసీల్దార్ చెప్పడంతో పెట్టాం. కానీ ఇంతవరకు పరిహారం ఒక్కపైసా రాలేదు.ఆర్టీవోను అడిగితే బిల్లు పాసుకాలేదన్నారు.చంద్రబాబు మాకు న్యాయం చేయాలి.
- కృష్ణమూర్తి, ఏటిగడ్డ కమ్మపల్లె
అడ్డొస్తే పూడ్చేస్తామన్నారు
మాకున్న పదెకరాల మామిడితోటను,పంటలను నాశనం చేస్తుండగా అడ్డుకున్నాం.దౌర్జన్యం చేసి ఇక్కడే పూడ్చేస్తామని బెదిరించడంతో భూములు పోయినా ప్రాణాలుంటే చాలని గమ్మునుండిపోయాం.అడవిలో ఒక్కో రైతుకు రెండెకరాల భూమి, బోర్లు, కరెంటు, రోడ్లు వేయిస్తామని అప్పట్లో మంత్రి పెద్దిరెడ్డి చెప్పినా ఏమీ జరగలేదు.రిజర్వాయర్‌తో కాంట్రాక్టర్లే బాగుపడ్డారు.పదెకరాల భూమి ఉన్నా జీవనం కష్టమై కూలీ పనులకోసం వలస వెళ్లిపోయాం. ఎన్నికల ముందే తిరిగొచ్చాం.కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- చంద్ర, ఆరంట్లపల్లె