తిరుపతిలో హైడ్రామా
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:01 AM
తిరుపతిలో గురువారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న భూమన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోశాల సందర్శనపై సవాళ్లు.. ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కింది. గోశాలను కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు సందర్శించారు. గుంపుగా కాకుండా ఐదుగురు నేతలు, వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే గోశాలకు రావాలని పోలీసులు సూచించినా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి మాత్రం గుంపుగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది.
తిరుపతిలో గురువారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందాయన్న భూమన ఆరోపణల నేపథ్యంలో వివాదం రాజుకుంది. గోశాల సందర్శనపై సవాళ్లు.. ప్రతిసవాళ్లతో రాజకీయం వేడెక్కింది. గోశాలను కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, నేతలు సందర్శించారు. గుంపుగా కాకుండా ఐదుగురు నేతలు, వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే గోశాలకు రావాలని పోలీసులు సూచించినా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి మాత్రం గుంపుగా బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది.
భారీగా మొహరించిన పోలీసులు
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): అటు వైసీపీ.. ఇటు కూటమి పార్టీల నేతలు తిరుపతిలోని టీటీడీ గోశాల సందర్శన నేపథ్యంలో పోలీసులు భారీగా మొహరించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోశాలలోకి కూటమి నేతలు వెళ్లి వారు బయటకు వచ్చాక.. వైసీపీ నాయకులను అనుమతిస్తామని ఎస్పీ ప్రకటించారు. దీంతో ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా ముందస్తుగా వారి ఇళ్ల వద్ద పోలీసులు మొహరించారు. ఎస్పీ అనుమతులు లేనిదే వారిని ఇళ్లలో నుంచి బయటకు రానీయకుండా ముందస్తు భద్రత ఏర్పాటు చేశారు. రెండు పార్టీల నేతలను వేర్వేరుగా.. శ్రేణులతో కాకుండా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తామని ఎస్పీ హర్షవర్ధనరాజు స్పష్టంచేశారు. కానీ, మందీమార్బలంతో తన ఇంటి నుంచి బయలుదేరిన భూమనను అక్కడే అడ్డుకున్నారు. ఇక, గోశాల ప్రవేశ ద్వారం వద్ద పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ రవిమనోహరాచ్చారి, డీఎస్పీలు భక్తవత్సలం (తిరుపతి), చెంచుబాబు (నాయుడుపేట), కొందరు సీఐలు గోశాలలోనూ కూటమి నేతల వెంటే ఉన్నారు. మధ్యాహ్నం 1.26 గంటలకు గోశాల నుంచి వీరంతా బయటకు వచ్చారు. ఇక, భూమన అభినయ్ గోశాల వద్దకు వచ్చినా లోపలకు అనుమతించలేదు. దీనిపై అతను ఆందోళనకు ఉపక్రమించే ఆలోచన ఉందని తెలుసుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద వదలిపెట్టారు. ఇక, గోశాల వద్దకు వచ్చిన ఎంపీ గురుమూర్తికి, కూటమి ఎమ్మెల్యేలకు మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది. ఎస్పీ జోక్యం చేసుకుని ఎంపీని లోపలకు పంపడంతో వివాదం సద్దుమణిగింది.
తిరుపతి(జీవకోన), ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): పార్టీ శ్రేణులు, నేతలతో కలిసి బయలుదేరిన తనను పోలీసులు అడ్డుకున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేలపై పడుకుని నిరసన తెలిపారు. ఉదయం 9.30 నుంచి 45 నిమిషాలకు పైగా ఈ నిరసన చేపట్టారు. గోశాల ఘటనపై ఇంత జరుగుతున్నా సనాతన ధర్మం అంటూ మాట్లాడే పవన్ ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. గోశాలకు వెళ్లాలనుకున్న భూమనను పోలీసులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఈ ఏడాది మార్చి వరకు 191 ఆవులు చనిపోయాయంటూ గోశాల మేనేజరు అధికారికంగా ప్రకటన విడుదల చేశారంటూ మీడియాకు భూమన కరుణాకరరెడ్డి చూపారు. గోశాలకు ఎప్పుడైనా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, భూమన అభినయ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.