కుప్పంలో స్మార్ట్ పోలీసింగ్!
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:01 AM
ఏఐ సీసీ కెమెరాలతో నేర నియంత్రణకు ప్రణాళిక పైలట్ ప్రాజెక్ట్ అమలుకు కసరత్తు 140 కెమెరాల కోసం ప్రతిపాదన రూ.2 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్
శాస్త్రసాంకేతికత ఎక్కడున్నా వొడిసిపట్టి పాలనలో చొప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నారు. ఏఐ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించే ప్రణాళిక సిద్ధమవుతోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా కుప్పంలో అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ అమలుకోసం కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా)కి ఇప్పటికే రూ.2 కోట్లు కేటాయించారు.
కుప్పం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): కుప్పంలో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. పట్టపగలే దొంగతనాలు జరుగుతున్నాయి. ఆరేడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనికిరాకుండా పోవడంతో నేరస్తులను, నేరాలను గుర్తించడం కూడా పోలీసులకు కష్టసాధ్యంగా మారుతోంది. ఇటీవల వరుసగా జరిగిన చోరీల్లో నేర పరిశోధన అందుకే నత్తనడకన సాగుతోంది. ఒక దశలో సాధారణమైన సీసీ కెమెరాలను తిరిగి కొత్తవి ఏర్పాటు చేయడానికి డిపార్టుమెంట్ తరఫున ప్రయత్నం జరిగింది. స్థానిక పోలీసు అధికారులు కొందరు దాతలను కూడా ఆశ్రయించారు. అయితే వారినుంచి స్పందన లభించకపోవడంతో అడుగులు ముందుకు పడలేదు. నేర శోధనలో పొరుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్న సమయంలో అక్కడున్న స్మార్ట్ పోలీసింగ్ వ్యవస్థ పోలీసు అధికారులను ఆకర్షించింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని అత్యాధునికమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థ ద్వారా కుప్పంలో జరిగిన చోరీకి బాధ్యుడైన ఒక నేరస్తుడిని గుర్తించగలిగారు కూడా. ఆ చోరీ ఇంకా పూర్తిస్థాయిలో డిటెక్ట్ కాకున్నా సరే, అక్కడి అత్యాధునిక నిఘా వ్యవస్థకు స్థానిక పోలీసులు ప్రభావితం అయ్యారు. ఈలోగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కుప్పంలో స్మార్ట్ పోలీసింగ్ భావన తెరమీదకు వచ్చింది. ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధికోసం కడాకు అనేక కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు రూ.2 కోట్ల నిధుల కేటాయింపు జరిగింది.
కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా
పోలీసు వ్యవస్థలో నేర నియంత్రణకు ఏఐ కెమెరాల ఏర్పాటు అనేది కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ ప్రైవేటు ఏజన్సీ ప్రతినిధులు సుమారు రెండు నెలల క్రితం కుప్పం వచ్చి, ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాలను గుర్తించారు. ఎస్సీ మణికంఠ ఆదేశాల మేరకు డీఎస్పీ పార్థసారథి, కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వారితోపాటు పట్టణమంతా తిరిగి ఆయా ప్రదేశాలను ఎంపిక చేశారు.కుప్పం పట్టణంలో కీలకమైన కూడళ్లు, పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటు చేయడానికి 140 ఏఐ సీసీ కెమెరాలు అవసరమవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. మరోవైపు కడా కార్యాలయం పై భాగాన అతి త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు కానుంది. పట్టణంలో ఏర్పాటు చేయబోయే ఏఐ సీసీ కెమెరాలను దీనికి అనుసంధానం చేస్తారు. ఇక్కడినుంచి స్మార్ట్ పోలీసింగ్ కొనసాగి నేరాల నియంత్రణ సులభసాధ్యమవుతుంది.
ఏఐ కెమెరాలతో స్మార్ట్ పోలీసింగ్ ఇలా
సాధారణ సీసీ కెమెరాలతో పోలిస్తే ఈ సీసీ కెమెరాలు వస్తువులను, మనుషులను, దృశ్యాలను గుర్తించి అర్థం చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగిస్తాయి. వస్తువులు, మనుషుల ముఖాలను గుర్తించడం, వాటి ప్రవర్తన, కదలికలను విశ్లేషించడం ద్వారా కచ్చితమైన , సమర్థవంతమైన నిఘా వ్యవస్థను అందిస్తాయి. ఏఐ కెమెరాలు తాము మెమరీలో భద్రపరిచిన గుర్తింపు ద్వారా రిపోర్టులను రూపొందించి, అవసరమైనప్పుడు హెచ్చరికలు జారీ చేస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి నిర్దిష్ట ప్రాంతాలనికి వెళ్తే లేదా వాహనం కదిలిస్తే హెచ్చరికలు పంపవచ్చు. ఈ విధానం వినియోగించి ఒక ప్రాంతంలో నేరం చేసిన వ్యక్తి దేశంలో ఏ ప్రాంతంలో తిరుగాడుతున్నా, గుర్తించి అరెస్టు చేయడం పోలీసులకు సులభసాధ్యమవుతుంది.
140 సీసీ కెమెరాలకు ప్రతిపాదనలు
కుప్పం పట్టణంలో 140 ఏఐ సీసీ కెమెరాల ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. ఇప్పటికే సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు కుప్పం పట్టణంలో పర్యటించి వెళ్లారు. ఏఐ సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థ మరింత పటిష్ఠమై, నేర నియంత్రణ సులభసాధ్యమవుతుంది.
- శంకరయ్య,కుప్పం అర్బన్ సీఐ