పారదర్శక టెండర్లతో తిరుపతి కార్పొరేషన్‌కు పెరిగిన ఆదాయం
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:54 AM
వైసీపీ జమానాలో చిన్నా చితకా వాటికి కూడా టెండర్లు గోప్యంగా జరిగిపోయేవి. ముఖ్యంగా తిరుపతి కార్పొరేషన్‌లో జరిగే టెండర్లలో గోల్‌మాల్ అంతా ఇంతా కాదు. బహిరంగ వేలం పేరు పెట్టి ‘ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి..’ అనే మాటలు లేకుండానే పనికానిచ్చేశారు.

వైసీపీ హయాంలో గుట్టుచప్పుడు కాకుండా నొక్కుడు
ఒక్క మార్కెట్లోనే రూ.రెండు కోట్లకుపైగా వ్యత్యాసం
తిరుపతి, ఆంధ్రజ్యోతి
వైసీపీ జమానాలో చిన్నా చితకా వాటికి కూడా టెండర్లు గోప్యంగా జరిగిపోయేవి. ముఖ్యంగా తిరుపతి కార్పొరేషన్‌లో జరిగే టెండర్లలో గోల్‌మాల్ అంతా ఇంతా కాదు. బహిరంగ వేలం పేరు పెట్టి ‘ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి..’ అనే మాటలు లేకుండానే పనికానిచ్చేశారు. వేలంలో బయటవారు రాలేరు. వద్దామంటే అసలు టెండరు ఎప్పుడు జరుగుతుందో తెలియదు. తెలుసుకునేలోపు నాలుగు గోడల మధ్య చీటీలు వేసి పంచుకునేసేవారు. అన్న క్యాంటీన్లు మొదలకుని, కపిలతీర్థం సర్కిల్ మెరిడియన్ హోటల్ వరకు, స్ర్కాప్ టెండర్ నుంచి మార్కెట్ టెండర్ల వరకు, ఇంజనీరింగ్ పనులైతే ఏక్‌నిరంజన్ పనికానిచ్చేవారు.
తాజాగా కార్పొరేషన్ పరిధిలో జరిగిన టెండర్లను పరిశీలిస్తే వైసీపీ హయాంలో అడ్డగోలుతనం బయటపడింది. 2024 వరకు ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ టెండరు రూ2.58కోట్లు మాత్రమే. కూటమి అధికారంలోకి వచ్చాక జీఎస్టీతో కలిపి దాదాపు రూ.5 కోట్లకు ధర పలికింది. పాలకపక్షం పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే మార్కెట్ అసలు ధర ఎంతో ఇప్పుడు బయటపడింది. అంటే గత వైసీపీ పాలనలో ఒక్క మున్సిపల్ మార్కెట్‌పైనే ఏడాదికి రూ.2 కోట్లకుపైగా కార్పొరేషన్ ఆదాయానికి గండి పడిందంటే తక్కినవాటిలో ఎంత నొక్కేసారో అర్థం చేసుకోవచ్చు.
పార్కింగ్ అడ్డాలనూ దోచేశారు
తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాలనూ వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా దోచేశారు.
ఫ 2022-23లో భారతి బస్టాండు పార్కింగ్ టెండరు రూ3.37లక్షలు. 2023-24కు దీనిని రూ2.23లక్షలకు తగ్గించి కట్టబెట్టారు. ఇదే బస్టాండుకు 2024-25లో రూ7.12లక్షలు, తాజాగా రూ10.40లక్షలు ధర పలికింది. అంటే వీటినుంచీ కార్పొరేషన్ ఆదాయానికి వైసీపీ హయాంలో గండికొట్టేశారు.
ఫ జీఎస్ మాడవీధి పార్కింగ్ స్థలాలు టెండరులోనూ భారీ వ్యత్యాసం కనిపించింది. వైసీపీ హయాంలో రూ1.25లక్షలు ఉన్న మాడావీధి టెండరు ప్రస్తుతం రూ3.35లక్షలతో రెండింతలు పలికింది.
రాజకీయ జోక్యం లేకపోవడంతో..
కార్పొరేషన్ పరిధిలో జరిగే టెండర్లలో రాజకీయ జోక్యం లేకపోవడం వల్లే పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించడంతో భారీగా ఆదాయం సమకూరింది. గతంలో వైసీపీ పెద్దలు చెప్పినట్టే అధికారులు తలలు ఆడించడంతో అయినవారికి కార్పొరేషన్ ఆస్తులను చౌకగా కట్టబెట్టేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జనబాహుల్యంలో ఉన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి విస్తృత ప్రచారం చేసి టెండరు నిర్వహించడం వల్ల పాట దారుల్లో పోటీతత్వం పెరిగినట్టు కనిపిస్తోంది.