Share News

తప్పు సరిదిద్దమంటే ఒకటిన్నర లక్ష అడిగారు

ABN , Publish Date - Apr 20 , 2025 | 02:21 AM

సదుం ఇన్‌చార్జి తహసీల్దారు ఎస్‌.ఎం.హుస్సేన్‌, అమ్మగారిపల్లె వీఆర్వో మహబూబ్‌ బాషా ఏసీబీ తనిఖీల్లో పట్టుబడ్డారు.శనివారం మధ్యాహ్నం జరిపిన తనిఖీల్లో వీఆర్వో మహబూబ్‌ బాషా రూ.75 వేల లంచం సొమ్ముతో పట్టుబడినట్లు ఏసీబీ ఏఎస్పీ వీహెచ్‌ విమలకుమారి తెలిపారు.

తప్పు సరిదిద్దమంటే ఒకటిన్నర లక్ష అడిగారు
తహసీల్దారు ఎస్‌.ఎం.హుస్సేన్‌, వీఆర్వో మహబూబ్‌ బాషా

-ఏసీబీ వలలో సదుం తహసీల్దారు,అమ్మగారిపల్లె వీఆర్వో

సదుం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : సదుం ఇన్‌చార్జి తహసీల్దారు ఎస్‌.ఎం.హుస్సేన్‌, అమ్మగారిపల్లె వీఆర్వో మహబూబ్‌ బాషా ఏసీబీ తనిఖీల్లో పట్టుబడ్డారు.శనివారం మధ్యాహ్నం జరిపిన తనిఖీల్లో వీఆర్వో మహబూబ్‌ బాషా రూ.75 వేల లంచం సొమ్ముతో పట్టుబడినట్లు ఏసీబీ ఏఎస్పీ వీహెచ్‌ విమలకుమారి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూసంరక్ష పథకం నిర్వహణలో భాగంగా స్థానిక రైతు షఫీవుల్లాకు చెందిన సెటిల్మెంట్‌ భూమి 5.60 ఎకరాలకు అదనంగా ఆయనకు చెందని 27 సెంట్ల భూమిని కలిపి డీకేటీ భూమిగా చూపిస్తూ పట్టాలు అందించారు. దీనిపై తన సెటిల్మెంట్‌ భూమిని డీకేటీగా చూపించారని,తప్పును సరిదిద్దాలని షఫీవుల్లా డిప్యూటీ తహసీల్దారు,ఇన్‌చార్జి తహసీల్దారు ఎస్‌.ఎం.హుస్సేన్‌ను కోరాడు.రెండు నెలల పాటు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారుల్లో స్పందన లేదు. చివరికి రూ.1.50 లక్షలు లంచం డిమాండ్‌ చేయగా అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డ షఫీవుల్లా బేరసారాలాడి రూ.75 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.అయితే లంచం ఇవ్వడం ఇష్టపడని షఫీవుల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.దీంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు శనివారం మధ్యాహ్నం తహసీల్దారు కార్యాలయ ఆవరణలో వీఆర్వో మహబూబ్‌ బాషా చేతికి షఫీవుల్లా రూ.75 వేలు అందజేస్తుండగా పట్టుకున్నారు.ఇన్‌చార్జి తహసీల్దారు ఎస్‌.ఎం.హుస్సేన్‌ సూచన మేరకే తాను డబ్బు తీసుకున్నట్లు వీఆర్వో మహబూబ్‌ బాషా చెప్పడంతో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు సమక్షంలో విచారణ చేపట్టినట్లు ఏఎస్పీ తెలిపారు.ఏసీబీ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి బాధితులు మండలంలో ఎవరైనా ఉంటే తమను 9440446130, 9440446190 నెంబర్లలో సంప్రదించాలని ఏఎస్పీ సూచించారు.

Updated Date - Apr 20 , 2025 | 02:21 AM