CID : తులసిబాబుకు షరతులతో బెయిల్
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:33 AM
హైకోర్టు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టడీ వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆయన దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో నిందితుడు కామేపల్లి తులసిబాబుకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, ఐవో కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు గురువారం తీర్పు ఇచ్చారు. రఘురామపై సీఐడీ కస్టడీలో దాడి వ్యవహారంలో గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు అయిన తులసిబాబు.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఇప్పటికే రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని విచారించారని, రఘురామను చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో తన పాత్రపై నిర్ధిష్ఠ ఆధారాలు లేవన్నారు. రఘురామ అరెస్టులో కీలకపాత్ర పోషించిన అప్పటి దర్యాప్తు అధికారి సీఐడీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ బెయిల్‌పై విడుదల అయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటామని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
For More AP News and Telugu News