Chandrababu Naidu: పేదరిక నిర్మూలనకు పీ-4
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:36 AM
సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు అవకాశాలు కల్పించి, వారిని పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు.
అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వండి
ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలకు సీఎం పిలుపు
‘జీరో పావర్టీ’.. స్వర్ణాంధ్ర-2047లో తొలి సూత్రం
పేదరికం లేని సమాజం మా నినాదం.. మా విధానం
ఉన్నత స్థానాల్లోని వారు తమ వంతు తిరిగివ్వాలి
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు అవకాశాలు కల్పించి, వారిని పైకి తెచ్చేందుకు ముందుకు రావాలని ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా.. తమ మాతృభూమిలో ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక సమూహానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో చేయూతనందించి, వారి జీవన ప్రమాణాలు పెంచవచ్చన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకొంటున్న వారందరికీ సీఎం ఆదివారం ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన మన సంస్కృతి, సంప్రదాయాలు వర్ధిల్లాలని, ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఆకాంక్షించారు. ‘జీరో పావర్టీ-పీ4 విధానం’ గురించి వివరించారు. ‘ఆర్థిక అసమానతలు తగ్గించి, సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. స్వర్ణాంధ్ర-2047 విజన్‌లోని పది సూత్రాల్లో మొదటిది.. జీరో పావర్టీ.. పేదరిక రహిత సమాజం.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్దేశించిన విధానమే పీ-4.. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్‌నర్‌షిప్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 1995లో అమలు చేసిన సంస్కరణలు, తెచ్చిన పాలసీలతో కోట్లాది మంది జీవితాలు మారాయి. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా నాడు తీసుకొచ్చిన పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (పీ-3) విధానంతో ఉపాధి, సంపద సృష్టి జరిగింది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లు సైతం నాటి అవకాశాలతో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అనేక వర్గాల వారు దేశ, విదేశాల్లో మంచి స్థానాలకు వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికీ మన రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎంతో మంది కటిక పేదరికంలో ఉన్నారు. విద్య, వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితిలో ఉన్నారు. దీనిని మార్చేందుకు, సమాజాన్ని శక్తిమంతం చేసేందుకు పీ-4 విధానాన్ని ప్రతిపాదించి, విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తున్నాం. తమ శక్తియుక్తులతో, ప్రభుత్వ పాలసీతో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10 శాతం మంది ప్రజలు.. అట్టడుగున ఉన్న 20 శాతం మందికి చేయూతనిచ్చి, పైకి తేవాలని కోరుతున్నాను. నాడు జన్మభూమి స్ఫూర్తితో చేపట్టిన కార్యక్రమాలు గ్రామాల్లో అద్భుత ఫలితాలిచ్చాయి. నాడు నేనిచ్చిన పిలుపుతో ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున ముందుకొచ్చి, అనేక గ్రామాల రూపురేఖలు మార్చారు. నేడు కూడా అదే స్ఫూర్తితో అట్టడుగున ఉన్న పేదలను పౖకి తెచ్చేందుకు ముందుకు రావాలి’ అని కోరారు.
ప్రతి ఒక్కరూ చర్చించండి..
‘పేదరికం లేని సమాజం మా నినాదం. మా విధానం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న పేదరికాన్ని రూపుమాపడం తమ లక్ష్యమని.. ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా భాగస్వాములైతే దీనిని చేరుకోవచ్చని తెలిపారు. రాష్ట్రప్రజలతో పాటు పండుగకు సొంత ఊళ్లకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీనిపై చర్చించాలని కోరుతున్నా. పొరుగు వారికి సాయం చేస్తే మీరు సాధించిన విజయానికి సార్థకత చేకూరుతుంది. పేదల జీవితాలు మార్చే కార్యక్రమంలో నేను సైతం.. అని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా సంక్రాంతి రోజున సంకల్పం తీసుకోవాలని కోరుతున్నాను. తద్వారా ఆరోగ్య, ఆనంద, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌ను సాధిద్ధాం’ అని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో యువశక్తి
‘శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది’ అంటూ అద్భుత సందేశమిచ్చిన స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొంటున్న యువతీ,యువకులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల్పంచారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో, సమసమాజ స్థాపనలో యువశక్తి భాగస్వామి కావాలని ‘ఎక్స్’లో ఆకాంక్షించారు.
మనం బాగుండాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారందరూ బాగుండాలి. అప్పుడే నిజమైన పండుగ.
తమకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకుని, ఆయా రంగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న వాళ్లు సమాజానికి తమ వంతు తిరిగిచ్చే ఆలోచన చేయాలి.
పీ-4 విధానంపై ప్రతి ఒక్కరి సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలు తీసుకునేందుకు మేం సిద్ధం. దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్ తీసుకొచ్చి, 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలనూ స్వీకరిస్తాం. ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ లక్ష్యాన్ని చేరుకుందాం.
- సీఎం చంద్రబాబు