Share News

CM Chandrababu: తీవ్రంగా కలిచివేసింది

ABN , Publish Date - Jan 09 , 2025 | 04:37 AM

తిరుపతిలో దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం పట్ల దిగ్ర్భాంతి చెందారు. ఈ ఘటన తనకు తీవ్ర బాధ కలిగించిందని అన్నారు.

CM Chandrababu: తీవ్రంగా కలిచివేసింది

సీఎం చంద్రబాబు ఆవేదన.. ఉన్నతాధికారులతో సమీక్ష

సమన్వయ లోపంపై అసహనం.. అధికారుల తీరుపై ఆగ్రహం

తిరుపతికి హుటాహుటిన ముగ్గురు మంత్రులు.. నేడు సీఎం రాక

టోకెన్లతో తంటా!.. వైసీపీ హయాంలో కొత్త పద్ధతి

పదిరోజులు వైకుంఠ ద్వార దర్శనం.. టోకెన్ల జారీ కేంద్రాలు

ఏర్పాటు.. 2022 నుంచి ప్రతిసారీ తొక్కిసలాటే

తొక్కిసలాట ఘటన బాధాకరం: ప్రధాని మోదీ, రాహుల్‌

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం పట్ల దిగ్ర్భాంతి చెందారు. ఈ ఘటన తనకు తీవ్ర బాధ కలిగించిందని అన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై బుధవారం రాత్రి డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరమని సీఎం అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంపై అధికారులపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖల మధ్య సమన్వయ లోపంపై మండిపడ్డారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులు సీఎంకు వివరించగా, మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వారిని సీఎం ఆదేశించారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని స్పష్టం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే అధికారులతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, పరిస్థితిని సీఎం తెలుసుకున్నారు. ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


తిరుపతికి మంత్రులు

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముగ్గురు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, అనిత తిరుపతికి హుటాహుటిన బయలుదేరారు. అక్కడ పోలీసు, రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల మధ్య సమన్వయం కోసం వారిని సీఎం పంపారు. గురువారం మరి కొంతమంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కూడా అక్కడికి పంపనున్నారు. మూడు రోజులు అక్కడే ఉండే ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు. తిరుపతిలో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, బాధితులకు అండగా నిలుస్తామన్నారు.

నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు

మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 9.30 గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్లనున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సదుపాయం గురించి వైద్యులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను సందర్శించనున్నారు. తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో ఈవోతోనూ, అధికారులతోనూ సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు.

Updated Date - Jan 09 , 2025 | 04:37 AM