వారంపాటు బాబు బిజీ
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:26 AM
కొత్త సంవత్సరంలో వరుసగా వారం రోజులు సీఎం చంద్రబాబు పర్యటనల్లో బిజీగా గడపనున్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది.
నేడు మంత్రివర్గ సమావేశం
4న విశాఖలో నేవీ డేకు హాజరు
6, 7 తేదీల్లో కుప్పం టూరు
8న విశాఖలో మోదీ పర్యటనకు
నాలుగో వారంలో దావో్‌సకు
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో వరుసగా వారం రోజులు సీఎం చంద్రబాబు పర్యటనల్లో బిజీగా గడపనున్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. మూడో తేదీ రాత్రి హైదరాబాద్ వెళ్లి తెలుగు సభల కార్యక్రమంలో పాల్గొంటారు. 4న విశాఖలో నేవీ డే వేడుకలకు హాజరవుతారు. ఆరు, ఏడు తేదీల్లో తన నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. 8న విశాఖ జిల్లాలో జరిగే ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొంటారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో పర్యటించనున్నారు. అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. మంత్రులు లోకేశ్, టీజీ భరత్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ప్రైవేట్ సెక్రటరీ కృష్ణ కపర్థి రావి, సీఎస్‌వో శ్రీనాథ్ బండారు, వైద్యాధికారి ఎండీ. అజారుద్దీన్‌తో కూడిన బృందం 19నే దావో్‌సకు బయల్దేరుతుంది. వీరి పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్’ అనే థీమ్‌తో నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. వారి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు దావో్‌సను వేదికగా ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సహజ వనరులు, అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తారు. వివిధ చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక పాలసీలు, సుస్థిర అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, మాన్యుఫాక్చరింగ్, ఐటీ తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం మార్గదర్శకాల ప్రకారం దావోస్ సదస్సు వద్ద ఏపీ ప్రభుత్వం ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు 500 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం రిజర్వ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రజల నుంచి వినతులు
సీఎం చంద్రబాబు మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సాయంత్రం వరకు ఆయన ఫొటోలు దిగారు. పలువురు దివ్యాంగులు, బాధితులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వగా, పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
త్వరలో మరింత మంచి చూస్తారు!
భవిష్యత్ తెలుగువాళ్లదే..: సీఎం
విజయవాడ, జనవరి 1(ఆంధ్రజ్యోతి): తెలుగువారికి మంచి జరిగేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని.. భవిష్యత్ మన తెలుగు వాళ్లదేనని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే మరింత మంచి చూస్తారన్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున సీఎం ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ‘తెలుగు వారికి, భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందేలా దుర్గమ్మ చల్లని చూపు మనపై ఉంది.. అందరికీ ఆదాయం పెరిగి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా.. అందరికీ శుభం, మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించా’ అని తెలిపారు.