Share News

Gosala Management Defended: గోశాలపై విష ప్రచారం తగదు

ABN , Publish Date - Apr 17 , 2025 | 05:23 AM

గోశాల నిర్వహణపై టీటీడీ నిర్లక్ష్యం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. ఆవుల సహజ మరణాలను రాజకీయ ఉద్దేశాలతో చిత్రీకరించడం తగదని ఆయన హెచ్చరించారు

Gosala Management Defended: గోశాలపై విష ప్రచారం తగదు

  • నిర్వహణలో టీటీడీ నిర్లక్ష్యం ఎక్కడా కనిపించలేదు

  • సహజ మరణాలను అసహజంగా చిత్రీకరించడం సరికాదు

  • హరినాథరెడ్డి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోండి

  • గోశాలను పరిశీలించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

తిరుపతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘గోశాలకు టీటీడీ ఎలాంటి లోటు లేకుండా చూస్తోంది. ఆవుల సహజ మరణాలను అసహజంగా చిత్రీకరించి, విషప్రచారం చేయడం సరికాదు. మా పరిశీలనలో టీటీడీ నిర్లక్ష్యం ఏమాత్రం కనపడలేదు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలోని గోశాలను ఆయన సందర్శించి, దాదాపు గంటపాటు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వివాదానికి గల కారణాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గోశాల వివాదం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. భారతీయులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. మనుషులతో పాటు ఆవులకూ సహజ మరణం ఉంటుంది. ఇక్కడ దాణాకు లోటు లేదు. పౌష్టికాహారం, వైద్యులు నిరంతరం అందుబాటులోనే ఉన్నారు. దాతలు ఇచ్చేవి, బయటనుంచి కొనుగోలు చేసిన గోవులను మందలో కలపడం లేదు. దానివల్ల వాటినుంచి వచ్చే వ్యాధులు కూడా తక్కువే. గోశాలను నిశితంగా పరిశీలిస్తే టీటీడీ నిర్లక్ష్యం ఎక్కడా కనిపించలేదు. స్థానికంగా ఉండేవారు ఎవరైనా కొండకు యాత్రికులు పెరిగే విధంగా ప్రయత్నించాలి. కానీ విషప్రచారంతో భయపెట్టకూడదు. రాజకీయంగా ఏదైనా ఉంటే వేరే అంశాలతో విభేదించండి. చర్చాగోష్ఠిల్లో సవాళ్లు విసురుకోండి. అంతేగానీ స్వార్థ రాజకీయాల కోసం గోశాలను ఎన్నుకోకూడదు.


మన వ్యవస్థలను మనమే ధ్వంసం చేయకూడదు’ అని నారాయణ హితవు పలికారు. ‘టీటీడీ వంటి సంస్థల్లో ఆవులతో పాటు అక్కడ పనిచేసే వాళ్లను కూడా కాపాడండి. జీతాలు మంచిగా ఇవ్వండి. కనీస వేతనాలు ఇచ్చేలా చేయండి. హరినాథరెడ్డి ఉన్నప్పుడు దాణాలో పురుగులు ఉన్నాయని సిబ్బంది చెబితే పిచ్చిపిచ్చి సామెతలు చెప్పాడట. అదే ఆహారం గోవులకు పెట్టమని చెప్పినట్లు తెలిసింది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. గత పాలకుల హయాంలో 25 ఆవులు వరుసపెట్టి చనిపోయాయని, రూ.60వేలు ఉన్న ఆవును రూ.2లక్షలు పెట్టి కొనుగోలు చేశారని కూడా తెలిసింది. వీటిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలి’ అని నారాయణ డిమాండ్‌ చేశారు.

ఆయన హయాంలోనే అవకతవకలు

గోశాలలో 35 ఏళ్లుగా పనిచేస్తున్నా. పశువులను బిడ్డల్లా చూసుకుంటాం. వందలాది పశువుల్లో ఎక్కడో బక్కచిక్కి, వయసు దాటిన ఆవులు చనిపోవడం సర్వసాధారణం. అలాంటివి ఫొటోలు తీసి రాజకీయం చేస్తున్నారు. ఇంతకుముందున్న డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డి ఇదంతా చేశారనిపిస్తోంది. ఆయన హయాంలోనే అవకతవకలు జరిగాయి. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది కాకుండా 82మంది టైంస్కేల్‌ ఉద్యోగులం ఉన్నాం. మమ్మల్ని పర్మినెంట్‌ చేస్తామని రూ.25 వేలు చొప్పున వసూలు చేశారు. ఎంతకీ చేయకపోతే నాలుగేళ్ల తర్వాత మా డబ్బు తిరిగి తీసుకున్నాం.

- మునిరత్నం, వర్కర్‌, గోశాల

గోమాతపై రాజకీయం తగదు

ఆరోగ్యం బాగాలేక, వయసుపైబడి ఆవులు చనిపోయి ఉంటాయి. బయటనుంచి వచ్చిన ఆవులను గోకులంలో కొద్దిరోజులు ఉంచి వైద్య పరీక్షల తర్వాతే మందలోకి తోలుతారు. అంత జాగ్రత్తగా గోశాల నిర్వహణ ఉంటుంది. గోమాతపై రాజకీయం తగదు.

- రవి, వర్కర్‌, గోశాల

Updated Date - Apr 17 , 2025 | 05:23 AM