Amaravati: అమరావతిపై అదే ద్వేషం
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:27 AM
అది తిరిగి ఊపిరి పోసుకోవడమే గాక.. సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకోవడం సహించలేకపోతున్నారు. జరుగుతున్న, జరగబోయే నిర్మాణ పనుల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచబ్యాంకుకు లేఖలు రాసి రుణం రాకుండా అడ్డుకున్న జగన్..

రాజధాని రోడ్లపై జగన్ పత్రిక రోత రాతలు
ప్రధాన రహదారుల టెండర్లలో గోల్‌మాల్ జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు
వాస్తవాలు దాచిపెట్టి పిచ్చి రాతలు
జాతీయ రహదారులతో పోలిక పెట్టి అంచనాలు పెంచేశారంటూ అబద్ధాలు
రాజధాని రోడ్ల పునరుద్ధరణ పనులతో అనేక కాంపోనెంట్లను కలిపి టెండర్లు
వాటిలో వరద నీటి మళ్లింపు కాలువలు, నీటి సరఫరా, సీవరేజ్, యుటిలిటీ డక్ట్స్
సైకిల్ ట్రాక్, నడకదారులు, ప్లాంటేషన్, రీయూజ్ వాటర్ లైన్స్, స్ర్టీట్ ఫర్నిచర్ సైతం
వీటన్నిటికీ గంపగుత్తగా టెండర్లు పిలిస్తే.. అన్నీ దాచి రోడ్లకే పెంచారంటూ అసత్యాలు
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలను అడ్డుకోవడమే అసలు ఉద్దేశం!
గతంలో జగన్ విపక్షంలో ఉన్నప్పుడూ వరల్డ్ బ్యాంకుకు తప్పుడు లేఖలు
రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి చెందిన రోతపత్రిక యథాప్రకారం విషం కక్కుతోంది. మూడు ముక్కలాటతో అమరావతిని విధ్వంసం చేసిన జగన్.. అది తిరిగి ఊపిరి పోసుకోవడమే గాక.. సంపూర్ణంగా రూపురేఖలు మార్చుకోవడం సహించలేకపోతున్నారు. జరుగుతున్న, జరగబోయే నిర్మాణ పనుల్లో అవినీతి చోటుచేసుకున్నట్లు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రపంచబ్యాంకుకు లేఖలు రాసి రుణం రాకుండా అడ్డుకున్న జగన్.. ఇప్పుడు కూడా రాజధాని అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మంజూరు చేసిన రుణాలను రాకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలతో రాజధానిలో ప్రధాన రోడ్ల నిర్మాణ పనులకు, అంతర్గతంగా ఉన్న అనేక కాంపోనెంట్లకు కలిపి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ (ఏడీసీ)లు టెండర్లు పిలిచాయి. వీటిలో గోల్‌మాల్ జరిగిందంటూ జగన్ పత్రిక తాజాగా అసత్య కథనం ప్రచురించింది. రాజధానిలో పిలిచిన 11 రోడ్ల టెండర్ల ప్రక్రియ నుంచి క్షేత్రస్థాయిలో పనులు జరిగే వరకు అన్నీ ప్రపంచబ్యాంకు, ఏడీబీ కనుసన్నల్లో వాటి పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. జగన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. ప్రపంచబ్యాంకు, ఏడీబీలు కూడా రాజధాని అభివృద్ధి సంస్థల అధికారులతో కుమ్మక్కయితేనే గోల్‌మాల్ సాధ్యమవుతుంది. అయితే అప్పులు ఇచ్చే ప్రపంచ స్థాయి సంస్థలు వాటి ద్వారా ప్రయోజనాలు జరగాలని కోరుకుంటాయి. అంతేతప్ప వాటి పేరుతో దోచుకు తినమని ప్రోత్సహించవు. అయినా జగన్ రోతపత్రిక విషపు కథనం ప్రచురించింది. రాజధాని పునర్నిర్మాణ పనుల కోసం అధికారులు శరవేగంతో దాదాపు రూ.41 వేల కోట్ల మేర రుణ సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చారు. అయితే అంతే వేగంగా టెండర్లు పిలువలేక పోతున్నారు. దీనికి కారణం.. సీఆర్‌డీఏ, ఏడీసీలు రూపొందించే టెండర్ డాక్యుమెంట్లను ఆయా రుణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. చాలా కఠినమైన నిబంధనలను విధించాయి. దీంతో టెండర్లు పిలవడంలో జాప్యం జరుగుతోంది.
జాతీయ హైవేలతో పోలికా?
ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అమరావతిని ఏ విధంగా ఽధ్వంసం చేసిందో ప్రపంచమంతా చూసింది. శాశ్వత రాజధాని నిర్మాణ పనులు ఆపడంతో మొదలుపెట్టి క్రమంగా అన్ని పనులనూ నిలిపేసి రాజధానిని కకావికలం చేసింది. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసినా జగన్ అండ్ కోలో మార్పురాలేదు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే.. రాజధానిలోని ప్రధాన రోడ్ల పనులను జాతీయ రహదారులతో పోల్చి.. ఏదో గోల్‌మాల్ జరిగిపోయిందంటూ రోతపత్రిక బురదజల్లే ప్రయత్నం చేసింది. భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టే పనులకు కిలోమీటరుకు రూ.20-22 కోట్లు వ్యయమవుతుండగా.. ఏడీసీ అధికారులు కిలోమీటరుకు రూ.53.88 కోట్లు అంచనా వేశారని.. సగటున కిమీకు రూ.30 కోట్ల మేర అదనపు వ్యయం ప్రతిపాదించడం కమీషన్లు దండుకోవడానికేనని తన కథనంలో పేర్కొంది. జాతీయ రహదారులకు సంబంధించి చూస్తే కేవలం రోడ్డు పనులకే టెండర్లు పిలుస్తారు. సెంట్రల్ మీడియం పనులు ప్రత్యేకంగా ఉంటాయి. అమరావతిలో రోడ్లు గతంలోనే నిర్మించినప్పటికీ జగన్ ఏలుబడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. వాటికి అతుకుల మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. దెబ్బతిన్న రోడ్లను పూర్తిగా తొలగించి మళ్లీ వేయాల్సిందే. వీటి పునర్నిర్మాణంతోపాటు అనేక కాంపోనెంట్ పనులతో కలిపి ఏడీసీ టెండర్లు పిలిచింది. ఆ కాంపోనెంట్లలో వరదనీటి మళ్లింపు కాల్వలు (స్ర్టామ్ వాటర్ డ్రెయిన్స్), నీటిసరఫరా, సీవరేజీ నెట్‌వర్క్‌లు, యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, నడకదారులు, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్, స్ర్టీట్ ఫర్నిచర్ వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ గంపగుత్తగా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన వాస్తవాన్ని దాచి జగన్ పత్రిక రోడ్ల పనులకే పెంచేశారంటూ వండివార్చింది. రోడ్డు పనులకే ఇంత మేర అంచనాలు పెంచారంటే..
పైన చెప్పుకొన్న కాంపోనెంట్ల పనులకు కూడా భారీగా అంచనాలు పెంచేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేసింది. టెండర్లకు భారీగా అంచనాలు వేశారంటూ ఒక పట్టిక కూడా ఇచ్చింది. అందులో మిగిలిన పనుల అంచనా వ్యయం కాలమ్‌లో ఇటీవల ఏడీసీ పిలిచిన టెండర్ల విలువను కూడా కోట్ చేయడం గమనార్హం. రాజధానిలో రోడ్ల పునరుద్ధరణ పనుల్లో భూగర్భ విద్యుత్ కేబుల్స్, ఇంటర్నెట్ తదితర కేబుల్స్‌కు సంబంధించి దుర్భేద్యమైన ఆర్‌సీ డక్ట్స్ నిర్మించాల్సి ఉంటుంది. స్ర్టామ్ వాటర్ డ్రెయిన్స్, మంచినీటి పైపులైన్ల నెట్‌వర్క్, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ల పనులు సాధారణమైనవి కావు. సెంట్రల్ మీడియంను అభివృద్ధి చేయడంతో పాటు కిలోమీటర్ల కొద్దీ సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు వంటి పనులూ చిన్నవి కావు. ఇంటర్నెట్ కేబుల్స్ కోసం నిర్మించే డక్ట్స్‌ను భవిష్యత్‌లో ప్రైవేటు కేబుల్స్‌కు లీజ్‌కు ఇస్తే ఆదాయం కూడా వస్తుంది. అదీగాక ఐదేళ్ల నాటికీ, నేటికీ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ (ఎస్‌ఎ్‌సఆర్) బాగా పెరిగిపోయాయి. కనీసం 25 శాతం మేర పెరిగిపోయాయి. వీటన్నిటినీ దాచిపెట్టి అమరావతిపై జగన్ పత్రిక విషంకక్కే ప్రయత్నం చేసింది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News