డేంజర్ ఇండస్ర్టీస్!
ABN , Publish Date - Jan 08 , 2025 | 01:40 AM
ప్రమాద రహిత పరిశ్రమల కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘ఆపరేషన్ ఇండస్ర్టీస్’ కార్యక్రమం తొమ్మిది ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లు గుర్తించింది. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్, విద్యుత కంపెనీలుగా నిర్ధారణ అయ్యింది. వీటిలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల సంఖ్యను జీరో స్థాయికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
- ఎన్టీఆర్ జిల్లాలో 9 ప్రమాదకర పరిశ్రమల గుర్తింపు
- వాటిలో ఆయిల్, విద్యుత రంగాలే అధికం
- అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే..
- ప్రమాద రహిత పరిశ్రమల కోసం ‘ఆపరేషన్ ఇండస్ర్టీస్’ అమలు
- పరిశ్రమల వెంబడి ప్రాంతాల రక్షణకూ చర్యలు
ప్రమాద రహిత పరిశ్రమల కోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేపట్టిన ‘ఆపరేషన్ ఇండస్ర్టీస్’ కార్యక్రమం తొమ్మిది ప్రమాదకర పరిశ్రమలు ఉన్నట్లు గుర్తించింది. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్, విద్యుత కంపెనీలుగా నిర్ధారణ అయ్యింది. వీటిలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదాల సంఖ్యను జీరో స్థాయికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 1,047 పరిశ్రమలు ఉన్నాయి. కర్మాగారాల శాఖ పరిధిలో ఇవన్నీ రిజస్టర్ అయి ఉన్నాయి. వీటిలో ప్రభుత్వానికి సంబంధించి 27 పరిశ్రమలు ఉండగా.. ప్రైవేటు రంగానికి చెందినవి 1,020 పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలలో మొత్తం 44,096 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో పురుషులు 39,800 మంది, మహిళలు 4,293 మంది ఉన్నారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఉంది. జిల్లాలో మెరుగైన పారిశ్రామిక వాతావరణం కల్పించటానికి నూరుశాతం ప్రమాద రహిత పరిశ్రమలను తీర్చిదిద్దేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ‘ఆపరేషన్ ఇండస్ర్టీస్’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని తిరిగి జీరో స్థాయికి తీసుకు వచ్చేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేకంగా చొరవ చూపి ఇండస్ర్టీ సేఫ్టీ ఆడిట్‌ను చేయిస్తున్నారు. జిల్లాలో ప్రమాదకర పరిశ్రమలపై అధ్యయనం చేయించారు. పరిశ్రమలు పెట్టడం సురక్షితమనే వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు వీలుగా కర్మాగారాల శాఖను మేలుకొలిపే ప్రయత్నం చేశారు. దీంతో ప్రమాదకర పరిశ్రమలు తీసుకోవాల్సిన చర్యలపై పెద్ద కసరత్తే నిర్వహిస్తున్నారు.
ప్రమాదకరమైన పరిశ్రమలు ఇవే :
జి.కొండూరులోని గెయిల్ ఇండియా లిమిటెడ్ (బూస్టర్ స్టేషన్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్ - ఆయిల్ డివిజన్), ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని హెచ్‌పీసీఎల్ (గ్యాస్ డివిజన్), జి.కొండూరు మండలం కట్టుబడిపాలెంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్ - ఆయిల్ డివిజన్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్ - టెర్మినల్), కొండపల్లిలోని ఐవోసీఎల్ - ఎల్‌పీజీ, నార్ల తాతారావు ఽథర్మల్ పవర్ స్టేషన్ (ఎన్‌టీటీపీఎస్), ల్యాంకో కొండపల్లి పవర్ ప్లాంట్ లిమిటెడ్ (గ్యాస్ ఆధారితం) పరిశ్రమలను ప్రమాదకర పరిశ్రమలుగా కర్మాగారాల శాఖ గుర్తించింది. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశకు అధికారులు నివేదికను సమర్పించారు.
భద్రతా చర్యలపై అవగాహన
కర్మాగారాల శాఖ సమర్పించిన నివేదిక ప్రకారం కలెక్టర్ లక్ష్మీశ వీటికి సంబంధించి సమీప ప్రాంతాల మ్యాపింగ్‌కు ఆదేశించారు. పైన పేర్కొన్న పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే వాటి పరిధి ఎంత మేర ఉంటుంది ? ప్రమాదాలు జరిగినపుడు ఏం చేయాలి ? రిస్క్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను ఏ విధంగా అమలు చేయాలి ? వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అంశాల గురించి ప్రధానంగా కలెక్టర్ ఇప్పటికే కర్మాగారాల శాఖతో పాటు రెవెన్యూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గుర్తించిన ప్రమాదకరమైన భారీ పరిశ్రమలలో అర్హత కలిగి నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాలు కల్పించటం, ప్రమాదాలకు సంబంధించి సన్నద్ధతపై సిబ్బందికి అవగాహన కోసం తరచూ మాక్ డ్రిల్స్ నిర్వహించటం, ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా లీకేజీలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించటం వంటి వాటిని సీరియస్‌గా అమలు చేయాలని చెప్పారు. 2023లో ఒక్క ప్రమాదం జరిగితే.. 2024లో ఏకంగా నాలుగు ప్రమాదాలు జరిగాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగకుండా.. మళ్లీ జీరో స్థితికి తీసుకువచ్చేందుకు వీలుగా ’ఆపరేషన్ ఇండస్ర్టీస్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు.