Share News

Vaikuntha Dwaram : 60 వేల మందికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం

ABN , Publish Date - Jan 12 , 2025 | 06:53 AM

వైకుంఠ ఏకాదశి రోజైన శుక్రవారం 60,094 మందికి తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం లభించింది. శుక్రవారం వేకువజామున 3.50 గంటల నుంచి ఉదయం 8.15 గంటల వరకు ప్రముఖులకు దర్శనం కల్పించిన టీటీడీ.. ఆ తర్వాత సాధారణ భక్తులను వైకుంఠద్వార దర్శనానికి అనుమతించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,094 మంది శ్రీవారిని ఉత్తర

 Vaikuntha Dwaram : 60 వేల మందికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి రోజైన శుక్రవారం 60,094 మందికి తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం లభించింది. శుక్రవారం వేకువజామున 3.50 గంటల నుంచి ఉదయం 8.15 గంటల వరకు ప్రముఖులకు దర్శనం కల్పించిన టీటీడీ.. ఆ తర్వాత సాధారణ భక్తులను వైకుంఠద్వార దర్శనానికి అనుమతించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,094 మంది శ్రీవారిని ఉత్తర ద్వారంగుండా దర్శించుకున్నారు. 14,906 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఇక, శనివారం ద్వాదశిని పురస్కరించుకుని కూడా శ్రీవారి దర్శనాలు సాఫీగా జరిగాయి. ద్వాదశి సందర్భంగా వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శనివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో భక్తుల రద్దీతో తిరుమల కిటకిటలాడుతుంది. అయితే, ఈసారి తిరుపతిలో టోకెన్ల జారీకి ముందు జరిగిన తొక్కిసలాటతో చాలా మంది భక్తులు తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది వైకుంఠ ఏకాదశితో పోలిస్తే 7,812 మంది భక్తులు తక్కువగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఏకాదశి రోజు మఽధ్యాహ్నం నుంచే తిరుమలలో రద్దీ తగ్గిందని అధికారులు తెలిపారు.


‘తొక్కిసలాట’ బాధితులకు నేడు పరిహారం చెక్కుల పంపిణీ

2 కమిటీలుగా ఏర్పడిన టీటీడీ బోర్డు

విశాఖ, నర్సీపట్నానికి ఒక బృందం

కేరళ, తమిళనాడుకు మరో బృందం

తిరుమల, జనవరి 11(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఆదివారం పరిహారం అందించనున్నారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి ఏర్పాట్లు చేసింది. శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యుల సమావేశం నిర్వహించారు. మృతుల కుటుంబాలను స్వయంగా కలసి పరిహారం చెక్కులను అందించేందుకు బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. విశాఖ, నర్సీపట్నం ప్రాంతాలకు చెందిన బాధిత కుటుంబాలను ఓ బృందం పరామర్శించనుంది. ఈ బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీదేవి, మహేందర్‌ రెడ్డి, ఎంఎస్‌ రాజు, భానుప్రకాశ్‌రెడ్డి ఉన్నారు. ఇక తమిళనాడు, కేరళలకు చెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించి పరిహారం అందించే కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్‌, నరేశ్‌కుమార్‌, శాంతారాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు. ప్రతి కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్‌ ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా సేకరిస్తారు. ఇక, తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు రూ.5 లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 06:53 AM