Share News

DIG Shemushi Bajpai: కుప్పం బందోబస్తుతో సంబంధం లేదు

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:36 AM

కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తుకు,

DIG Shemushi Bajpai: కుప్పం బందోబస్తుతో సంబంధం లేదు

తిరుపతిలో టోకెన్ల జారీ కేంద్రాల వద్ద 1500 మంది పోలీసులను నియమించాం

బందోబస్తు లేదనేది అవాస్తవం: డీఐజీ శెముషీ

తిరుపతి(నేరవిభాగం), జనవరి 10(ఆంధ్రజ్యోతి): కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తుకు, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి కౌంటర్ల వద్ద భద్రతకు సంబంధం లేదని అనంతపురం రేంజ్‌ డీఐజీ శెముషీ బాజ్‌పాయ్‌ స్పష్టంచేశారు. తిరుపతిలోని ఎనిమిది కౌంటర్ల వద్ద దాదాపు 1500 మంది పోలీసులను నియమించామని చెప్పారు. తిరుమలలో ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం పర్యటనకు అధిక సంఖ్యలో పోలీసులను పంపి, తిరుపతిలో అవసరమైన బందోబస్తు లేకపోవడం వల్లే ఘటన చోటు చేసుకుందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తిరుపతిలో బుధవారం రాత్రి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత గేట్లు తెరిచారా? లేదా నిర్లక్ష్యంతో గేట్లు తీసి భక్తులను ఒక్కసారిగా వదిలారా? అనేది విచారిస్తున్నామన్నారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా, తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆ ఘటనకు సంబంధించి అన్ని వర్గాల నుంచీ ఆధారాలు, సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. అలాగే సాంకేతిక పరమైన సాక్ష్యాలైన సీసీ కెమెరాల ఫుటేజీలు, మొబైల్‌ వీడియోలు, ఫొటోలు, ఇతర వివరాలనూ సేకరిస్తున్నామన్నారు.

వీటి ఆధారంగా సంఘటన ఎలా జరిగిందనేది విశ్లేషిస్తామని డీఐజీ వివరించారు. ప్రజలు, వివిధ వర్గాల వారు ఈ సంఘటనకు సంబంధించి తమ వద్ద ఏవైనా వీడియోలు, ఫొటోలు, ఇతర ఆధారాలుంటే దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సమగ్ర ప్రణాళికతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. తిరుమల, తిరుపతి ఆలయాల్లో ఏకాదశి బందోబస్తు కోసం దాదాపు 2,424 మందిని నియమించామన్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద జరిగిన ఘటనలో భక్తులు మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. ఈ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఊహించని విధంగా భక్తుల రద్దీ పెరగడంతో ఈ సంఘటన జరిగిందన్నారు. అక్కడ విధుల్లో ఉన్న వారు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలం కావడం వల్లే సంఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. టోకెన్లు జారీ క్యూలైన్‌లో జరిగిన విషాదకర ఘటనకు బాధ్యులు ఎవరనేది విచారణలో తేలుతుందని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Jan 11 , 2025 | 03:37 AM