Share News

Tirupati Stampede: మొదలైన పోలీస్‌ విచారణ

ABN , Publish Date - Jan 11 , 2025 | 03:39 AM

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసు విచారణ మొదలైంది.

Tirupati Stampede: మొదలైన పోలీస్‌ విచారణ

తిరుపతికి ప్రత్యేక దర్యాప్తు బృందం

సంఘటనా స్థలాల పరిశీలన

పోలీసు అధికారులతో సమావేశం

తొక్కిసలాటపై వివరాలు ఆరా

పునరావృతం కాకుండా చర్యలు

తిరుపతి(నేరవిభాగం), జనవరి 10(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసు విచారణ మొదలైంది. ఒకవైపు డీఐజీ శెముషీ బాజ్‌వాయ్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుండగానే.. మరోవైపు విశాఖ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, టీటీడీ మాజీ సీవీఎ్‌సవో, తూర్పు గోదావరి ఎస్పీ నరసింహకిషోర్‌ను దర్యాప్తు అధికారులుగా నియమించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద సమన్వయ లోపం ఎక్కడ జరిగింది? అధికారుల నిర్లక్ష్యం ఎంతనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేయనున్నారు. శుక్రవారం వారు తిరుపతికి చేరుకున్నారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్‌చార్జులుగా ఉన్నారు? వారిలో పోలీసు, టీటీడీ అధికారులు ఎవరనే వివరాలు తీసుకున్నారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో అత్యవసరంగా సమావేశమైనట్లు తెలిసింది.

తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు సమాచారం. సాయంత్రం పోలీసు అధికారులతో కలసి టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? భక్తులు అధిక సంఖ్యలో వస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అందుకు చేపట్టాల్సిన జాగ్త్రతలు, పోలీసు బందోబస్తు, టీటీడీ తీసుకోవాల్సిన చర్యలు, మౌలిక వసతులు వంటి విషయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. బైరాగిపట్టెడ, విష్ణునివాసం వద్ద ఘటనలు జరిగిన తీరు, చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. ఈ ఘటనకు టీటీడీ ఎంత వరకు బాధ్యత వహించిందనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. వారి వెంట అదనపు ఎస్పీలు రవిమనోహరాచారి, వెంకట్రావు, డీఎస్పీ వెంకటనారాయణ, సీఐలు రామకృష్ణ, రాంకిషోర్‌, ఎస్‌ఐలు ఉన్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టేందుకు ఈ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Updated Date - Jan 11 , 2025 | 03:39 AM